Bihar Elections : చొరబాటుదారులే వారి ఓటు బ్యాంకు.. అమిత్ షా ఆగ్రహం
ABN, Publish Date - Aug 08 , 2025 | 06:46 PM
చొరబాటుదారులే వారి ఓటు బ్యాంకు.. అందుకే SIR ని కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శించారు. ఓట్ల కోసం దేశ ప్రజలకి తీరని ద్రోహం చేస్తున్నారని..
సీతామర్హి (బీహార్), ఆగస్టు 8 : బీహార్‌లో ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)ను వ్యతిరేకించడాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్రంగా తప్పుబట్టారు. కొన్ని పార్టీలు దేశప్రయోజనాల్ని పక్కన పెట్టి, ఓటు బ్యాంకు పాలిటిక్స్ కు ప్రాధాన్యత ఇవ్వడం వల్లే ఇదంతా జరుగుతోందని ఆయన విమర్శించారు. ఇవాళ (శుక్రవారం) అమిత్ షా బీహార్ లో పర్యటించారు. సీతామర్హి లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా బీహార్‌లో ప్రతిపక్ష పార్టీలైన ఆర్జేడీ, కాంగ్రెస్ లపై అమిత్ షా విరుచుకుపడ్డారు.
అటు, కాంగ్రెస్ పైనా అమిత్ షా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 'రాహుల్ గాంధీ ఈ ఓటు బ్యాంకు రాజకీయాలను ఆపాలి. SIR దేశంలో మొదటిసారి జరగడం లేదు.. దీనిని జవహర్‌లాల్ నెహ్రూ ప్రారంభించారు. ఇది 2003లో కూడా జరిగింది. వీళ్లంతా బీహార్ ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణాలను వెతుక్కుంటున్నారు' అని అమిత్ షా అన్నారు. 'బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, చొరబాటుదారుల పేర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించాలా వద్దా? భారతదేశంలో పుట్టని వారికి భారత రాజ్యాంగం ఓటు హక్కు ఇవ్వదు. రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని మోసుకుంటూ తిరుగుతున్నాడు.. అయితే, ఆయన దానిని తెరిచి చదవాలి.' అని అమిత్ షా చురకలంటించారు.
ఇలా ఉండగా, బీహార్‌లో ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ (SIR) రాజకీయ వివాదానికి దారితీసింది. ప్రతిపక్ష INDIA బ్లాక్ సవరణ ప్రక్రియ పెద్ద సంఖ్యలో ఓటర్ల తొలగింపుకు దారితీస్తుందని ఆరోపిస్తోంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిపక్ష పార్టీలు బీహార్‌లో ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణపై చర్చకు డిమాండ్ చేస్తున్నాయి.
Updated Date - Aug 08 , 2025 | 06:57 PM