Monsoon Havoc: హిమాచల్ ప్రదేశ్‌లో రుతుపవనాల బీభత్స, భయానకం
ABN, Publish Date - Jul 05 , 2025 | 05:55 PM
హిమాచల్ ప్రదేశ్‌లో రుతుపవనాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటివరకూ రాష్ట్రంలో 72 మంది మృతి చెందారు. 40 మంది గల్లంతయ్యారు. 500 కి పైగా రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. జూలై 7 వరకు భారీ వర్షాలు కొనసాగుతాయని అంచనా నేపథ్యంలో..
ఇంటర్నెట్ డెస్క్ : హిమాచల్ ప్రదేశ్‌లో రుతుపవనాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వీటి ప్రభావంతో కురుస్తున్న కుండపోత వర్షాలతో హిమాచల్ ప్రాంతంలో ఇప్పటివరకూ 72 మంది మృతి చెందారు. 40 మంది గల్లంతయ్యారు. ఎడతెరిపి లేకుండా భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా 500 కి పైగా రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. రాష్ట్రంలో వరద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జూలై 7 వరకు భారీ వర్షాలు కొనసాగుతాయని అంచనా నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.
ఈ ప్రకృతి వైపరీత్యం 500 కి పైగా విద్యుత్ పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్‌లను ప్రభావితం చేసింది. పదివేల మందికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాదాపు 281 నీటి సరఫరా వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఫలితంగా స్వచ్ఛమైన నీరు, ఆహారం అందుబాటులో లేకపోవడంతో సంక్షోభం తలెత్తింది. మొత్తం 300 ట్రాన్స్‌ఫార్మర్లు పూర్తిగా పనిచేయడం లేదు.
ఇక, వరదల్లో 164 పశువులు సహా 300 కి పైగా మూగ జీవాలు చనిపోయాయి. వందలాది ఇళ్ళు ధ్వంసమయ్యాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మండి జిల్లాలో పెద్ద ఎత్తున సహాయ, పునరావాస, గాలింపు కార్యకలాపాలు చేపట్టింది. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF), స్థానిక అధికార సిబ్బంది గాలింపు, సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.
ముఖ్యమంత్రి ప్రతి బాధిత కుటుంబానికి అత్యవసర ఇంటి సహాయంగా రూ. 5,000 ప్రకటించారు. ప్రభుత్వ పూర్తిగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ మండిలోని సిరాజ్ లోయలోని తన నియోజకవర్గంలో వరద బాధిత ప్రాంతాలను సందర్శించారు. తునాగ్‌లో ఆకస్మిక వరదల తర్వాత సహాయ, రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్యమంత్రి సుఖుతో మాట్లాడి, హిమాచల్ ప్రదేశ్‌కు మాత్రమే కాకుండా గుజరాత్, రాజస్థాన్ వంటి ఇతర రుతుపవనాల ప్రభావిత రాష్ట్రాలకు కూడా కేంద్ర సహాయాన్ని అందించారు. తీవ్ర వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
ఇవి కూడా చదవండి
పెట్రోల్ విషయంలో గొడవ.. పోలీస్‌ను కొట్టిన పెట్రోల్ బంక్ సిబ్బంది..
ట్రంప్ ముందు మోదీ తలొంచుతారు.. రాహుల్ సెటైర్లు.
Updated Date - Jul 05 , 2025 | 06:04 PM