Lucknow Restaurant Incident: బిల్లు ఎగ్గొట్టేందుకు మాస్టర్ ప్లాన్.. కానీ అడ్డంగా దొరికిపోయారు..
ABN, Publish Date - Aug 05 , 2025 | 02:03 PM
బిల్లు ఎగ్గొట్టేందుకు ఓ బ్యాచ్ మాస్టర్ ప్లాన్ వేసింది. కానీ, వాళ్ల ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయి చివరికి అడ్డంగా దొరికిపోయారు. అసలేం జరిగిందంటే..
ఇంటర్నెట్ డెస్క్: రెస్టారెంట్‌లో భోజనం చేసిన తర్వాత బిల్లు చెల్లించకుండా తప్పించుకోవాలని కొంతమంది యువకులు చేసిన ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయింది. చివరికి సీసీటీవీ ఫుటేజ్ వల్ల అడ్డంగా దొరికిపోయారు. ఈ సంఘటన లక్నోలోని కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న శాస్త్రి చౌక్‌లోని బిర్యానీ బే రెస్టారెంట్‌లో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..
జూలై 31 రాత్రి, 8 నుండి 10 మంది యువకులు ఒక బ్యాచ్‌గా ఆ రెస్టారెంట్‌కి వెళ్లారు. వెజ్, నాన్ వెజ్ బిర్యానీలు ఆర్డర్ చేశారు. ఆహారం వడ్డించిన కొద్ది సేపటికే, వారిలో ఒకరు తన వెజ్ బిర్యానీలో ఎముక వచ్చిందంటూ గోల చేయడం ప్రారంభించాడు. దీంతో ఈ ఘటనపై రెస్టారెంట్ మేనేజర్ పోలీసులకు ఫోన్ చేయగా, వారు అక్కడికి వచ్చి సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. ఆ ఫుటేజ్‌లో ఒక యువకుడు, తన నాన్ వెజ్ బిర్యానీ లోని ఎముకను మరొకరికి అందించగా, ఆ యువకుడు తెలివిగా ఆ ఎముకను వెజ్ బిర్యానీ ప్లేట్‌లో ఉంచినట్లు స్పష్టంగా కనిపించింది.
రెస్టారెంట్ యజమాని రవికర్ సింగ్ మాట్లాడుతూ, యువకులు ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారని, తమ కిచన్‌లో మాంసాహారాన్ని విడిగా వండుతామని, వెజిటేరియన్ ఫుడ్‌తో నాన్ వెజ్ కలవడానికి అవకాశం లేదని స్పష్టం చేశారు. సుమారు రూ. 5,000 నుండి రూ. 6,000 బిల్లు చెల్లించకుండా తప్పించుకోవాలని ఇలా ప్లాన్ చేశారని వివరించారు.
కంటోన్మెంట్ సర్కిల్ ఆఫీసర్ యోగేంద్ర సింగ్ మాట్లాడుతూ, పోలీసులు ఈ విషయంలో జోక్యం చేసుకున్నారని.. అయితే రెస్టారెంట్ యాజమాన్యం అధికారికంగా ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు కాలేదని తెలిపారు. అయినప్పటికీ, చట్టపరమైన చర్యల దిశగా పనిచేస్తున్నామని తెలిపారు. కాగా, ఇలా రెస్టారెంట్ బిల్ ఎగ్గొట్టాలని యువకులు చేసిన ప్లాన్ చివరికి ఫెయిల్ అయింది. ఇది కాస్తా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారడంతో పలువురు వారిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
Also Read:
గుంతకల్లు ఏరియా వాసులకు గుడ్‌న్యూస్.. వెలంకనికి ప్రత్యేక రైలు
సినీ కార్మికుల సమస్యలు ఇలానే పరిష్కారమవుతాయి
For More Latest News
Updated Date - Aug 05 , 2025 | 04:25 PM