Tollywood Employees Federation Issue: సినీ రంగంలో శ్రమ దోపిడీ జరుగుతోంది: అనిల్ వల్లభనేని..
ABN , Publish Date - Aug 05 , 2025 | 12:42 PM
వేతనాలు పెంచాలని తెలుగు ఫిలిం ఫెడరేషన్ కార్మికులు డిమాండ్ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే, ఈ విషయంపై ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని కీలక వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: టాలీవుడ్ సినీ పరిశ్రమలో నెలకొన్న కార్మిక సమస్యలపై ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫెడరేషన్‌తో సంప్రదింపులు చేస్తామని చెప్పిన ఫిలిం ఛాంబర్, ఇప్పుడు ఒక్కసారిగా ఫెడరేషన్ వద్దు అనే ప్రకటన చేయడం బాధాకరమని వ్యాఖ్యానించారు.
అవగాహన పెంచాలి
తెలుగు ఇండస్ట్రీలో అంతర్జాతీయ స్థాయి సినిమాలు వస్తున్నాయంటే అది మన కార్మికుల నైపుణ్యాల ఫలితమని.. వాళ్లలో స్కిల్ లేదని అంటే, క్యాంపులు ఏర్పాటు చేసి ట్రైనింగ్ ఇవ్వాలని అన్నారు. కొత్త కెమెరాలు, టెక్నాలజీ వస్తుంటే వాటి గురించి అవగాహన పెంచాలే కానీ, ఇప్పుడు కార్మికులను పక్కన పెట్టి కొత్తగా మరెవరితోనో పని చేస్తామని చెప్పడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు.
రోజుకు 15 గంటలు
వేతనాలు అడిగితే కొత్తవారిని తీసుకువస్తామని నిర్మాతలు చెబుతున్నారని.. సినిమాపై ఇంట్రెస్ట్‌తో ఎవరైనా వస్తే వారిని శ్రమ దోపిడి చేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. 'కార్మికులు రోజుకు 15 గంటలు కష్టపడతారు.. వేతన పెంపును తాము ముందు నుంచి అడుగుతూనే ఉన్నాం.. అప్పటికప్పుడు బంద్ అంటూ తాము ఎప్పుడూ ప్రకటించలేదని' అనిల్ వివరించారు.
కూర్చుని చర్చిస్తే సరిపోతుంది
కొన్ని నిర్మాణ సంస్థలు తమ అభ్యర్థనను అంగీకరించి, అడిగిన వేతనాలను ఇచ్చి పని చేయిస్తున్నారని, కానీ, బయటకు చెప్పేంతగా తమ వేతనాలు ఎక్కువ కాదని తెలిపారు. వేతన పెంపుపై ఫిలిం ఛాంబర్‌కు, నిర్మాతలకు అభ్యంతరాలు ఉంటే కూర్చుని చర్చిస్తే సరిపోతుందని సూచించారు. లేని పక్షంలో తమ యాక్షన్ ప్లాన్ ఏంటనేది ప్రకటిస్తామని పేర్కొన్నారు.
కాగా, తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం కార్మికుల వేతనాల అంశం చర్చనీయాంశంగా మారింది. కార్మికులు సమాన హక్కులు కోరుతున్నారని, పరిశ్రమలో నైపుణ్యం ఉన్నవారిని పక్కన పెట్టడం సరికాదని ఫెడరేషన్ వాదిస్తోంది. ఈ వివాదం చర్చలతోనే పరిష్కారమవుతుందని ఆశిస్తున్నప్పటికీ, అవసరమైతే ఉద్యమ మార్గాన్ని ఎంచుకుంటామని స్పష్టం చేస్తున్నారు.
Also Read:
స్టీల్ పాత్రల్లో ఈ ఆహార పదార్థాలు నిల్వ చేస్తున్నారా? జాగ్రత్త.
గంభీర్ కళ్లలో నీళ్లు.. మ్యాచ్ అనంతరం గంభీర్ ఎంత ఎమోషనల్ అయ్యాడో చూడండి..
For More Latest News