Kamal Haasan: మాట కరుసు.. కోర్టుకు కమల్ హాసన్
ABN, Publish Date - Jun 02 , 2025 | 04:49 PM
తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందంటూ సినీ నటుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్య కర్ణాటకలో పెద్ద దుమారమే రేపుతోంది. తాను క్షమాపణ చెప్పనంటూ కమల్ కోర్టుకెక్కడంతో ఈ వివాదం తగ్గే సూచనలు కనిపించడం లేదు.
కర్ణాటక: సినీ నటుడు కమల్ హాసన్ ఇటీవల చేసిన 'తమిళం నుంచి కన్నడ పుట్టింది" అనే వ్యాఖ్య కర్ణాటకలో పెద్ద దుమారమే రేపుతోంది. తాను క్షమాపణ చెప్పనంటూ కమల్ హాసన్ చెబుతుండటంతో ఈ వివాదం తగ్గే సూచనలు కనిపించడం లేదు. అతని వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పకపోతే కమల్ కొత్త సినిమా 'థగ్ లైఫ్' కర్ణాటక రాష్ట్రంలో విడుదల కాబోదని కొన్ని సినిమా సంఘాలు హెచ్చరించాయి. దీంతో నటుడు కమల్ హాసన్ ఈరోజు(సోమవారం) కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.
'కమల్ క్షమాపణ చెప్పకపోతే, 'థగ్ లైఫ్' సినిమా కర్ణాటకలో నడవదు. ఇది కచ్చితంగా పరిశ్రమ గురించి కాదు, ఇది రాష్ట్రం గురించి. రాజకీయ పార్టీలు కూడా కమల్ మాటల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కన్నడ అనుకూల సంస్థలన్నీ కమల్ హాసన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆయన క్షమాపణ లేకుండా సినిమా విడుదల కష్టం. మా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కమల్ సినిమా ప్రదర్శించడానికి సిద్ధంగా లేరు. ఇక్కడ సినిమా ఎలా విడుదల అవుతుంది?' అంటూ కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఎం.నరసింహలు అంటున్నారు.
ఇలా ఉండగా, 'థగ్ లైఫ్' సినిమా ప్రమోషన్‌లో కమల్ హాసన్ మాట్లాడుతూ.. కన్నడ భాష తమిళం నుంచి పుట్టిందని చెప్పారు. ఈ వ్యాఖ్యపై కర్ణాటకలో పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు విమర్శలు గుప్పించారు. కన్నడ భాషకు సుదీర్ఘ చరిత్ర ఉందని, నటుడు కమల్ హాసన్‌కు దాని గురించి తెలియదని సాక్షాత్తూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు.
కమల్ హాసన్ క్షమాపణ చెప్పాలని కర్ణాటక బీజేపీ చీఫ్ బి.వై.విజయేంద్ర డిమాండ్ చేశారు. 'ఒకరు తమ మాతృభాషను ప్రేమించాలి, కానీ దాని పేరుతో అహంకారాన్ని ప్రదర్శించడం సాంస్కృతిక దివాలాకు నిదర్శనం. ముఖ్యంగా కళాకారులు ప్రతి భాషను గౌరవించే తత్వాన్ని కలిగి ఉండటం చాలా అవసరం' అని కర్ణాటక బీజేపీ చీఫ్ అన్నారు. కన్నడ సహా వివిధ భాషల సినిమాల్లో కమల్ నటించారని, అయితే ఆయన వ్యాఖ్య స్పష్టమైన అహంకారాన్ని చూపిస్తోందని విజయేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే, తనకు క్షమాపణ చెప్పే ఆలోచన లేదని నటుడు కమల్ హాసన్ తేల్చి చెప్పారు. 'ఇది ప్రజాస్వామ్యం. నేను చట్టం, న్యాయాన్ని నమ్ముతాను. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ పట్ల నాకున్న ప్రేమ నిజం. ఒక అజెండా ఉన్న వారు తప్ప ఎవరూ దీనిని అనుమానించరు. నన్ను ఇంతకుముందూ బెదిరించారు. నేను తప్పు చేస్తే క్షమాపణలు చెబుతాను. నేను తప్పు చేయకపోతే చెప్పను' అని కమల్ హాసన్ కుండబద్ధలు కొట్టి కోర్టు మెట్లెక్కారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
For More AP News and Telugu News
Updated Date - Jun 02 , 2025 | 05:45 PM