ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Indian Army Retaliation: తడబాటు లేదు గడబిడా లేదు

ABN, Publish Date - May 11 , 2025 | 03:17 AM

ఉగ్రదాడులకు భారత్‌ గట్టి ప్రతీకారం తీర్చుకుంది. పాక్‌ ఆక్రమిత కశ్మీరు సహా పాక్‌ లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది.పాక్‌ అణు బెదిరింపులను లెక్కచేయకుండా 80 కిలోమీటర్ల లోపలికి చొరబడి భారత సైన్యం ఘాటుగా దాడి చేసింది.

  • పట్టు సడలించకుండా భారత్‌ దూకుడు

  • పాక్‌కు ఊపిరి సలపనివ్వని మన సైన్యం

  • శత్రు భూభాగంలోకి చొరబడి మరీ క్షిపణుల వర్షం

  • ఆ దేశ ఆయుధ, రక్షణ వ్యవస్థలు నిర్వీర్యం

క ధర్మపన్నాలు చెప్పడం ఉండదు.. సరిహద్దులు దాటి వెళ్లకూడదన్న ఆంక్షలూ ఉండవు.. దాడికి ప్రతిదాడి మాత్రమే చేస్తామని గిరిగీసుకుని కూర్చోరు.. శత్రువు భూభాగంలోకి చొరబడి మరీ నాశనం చేయగలమని భారత్‌ రుజువు చేసింది. పాక్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీరు (పీవోకే)లోని ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసి.. భారీ సంఖ్యలో టెర్రరిస్టులను హతమార్చడంతోనే సంతృప్తి చెందలేదు. ఆత్మరక్షణ కోసం శత్రువుల క్షిపణులు, డ్రోన్లను ధ్వంసం చేస్తూనే.. పాక్‌పై వజ్రాయుధాలతో విరుచుకుపడింది. ఆ దేశ సైన్యానికి ఆయువుపట్టయిన రావల్పిండి హెడ్‌క్వార్టర్స్‌పైనే బాంబులవర్షం కురిపించింది. పాక్‌ పాలక, విపక్షాలకు రాజకీయంగా కీలకమైన పంజాబ్‌, సింధ్‌ రాష్ట్రాలనూ వదల్లేదు. అక్కడి సైనిక, వైమానిక స్థావరాలను కూడా నేలమట్టం చేసింది. ‘పాకిస్థాన్‌ వద్ద 130 అణు వార్‌హెడ్లు ఉన్నాయి. ఘోరీ, ఘజ్నవీ, షహీన్‌ క్షిపణులు ఉన్నాయి. అవన్నీ ప్రదర్శన కోసం కాదు. భారత్‌పై ప్రయోగించడం కోసమే’ అని పాక్‌ పాలకుల బెదిరింపులను సైతం లెక్కచేయలేదు. అధునాతన టెక్నాలజీతో అభివృద్ధి చేసిన క్షిపణులు, బాంబుల సాయంతో పాక్‌ భూభాగంలోకి 80 కిలోమీటర్ల వరకు చొరబడి మరీ దాడులు చేసింది. పాక్‌ సైనిక పాటవం తన శక్తి సామర్థ్యాల ముందు ఎందుకూ కొరగాదని ప్రపంచ దేశాలకు సైతం చాటిచెప్పింది. పాక్‌కు తుర్కియే పంపిన డ్రోన్లు, క్షిపణులు, చైనా ఇచ్చిన జేఎఫ్‌-17 ఫైటర్‌ విమానాలనూ కూల్చివేసింది. ఆ దేశానికి అమెరికా విక్రయించిన ఎఫ్‌-16 యుద్ధవిమానాన్ని సైతం పడగొట్టింది. ప్రధాని మోదీపై అమెరికా ఎంత ఒత్తిడి తెచ్చినా తలొగ్గక తీసుకొచ్చిన సుదర్శన చక్రం ‘ఎస్‌-400’.. తాజా సమరంలో భారత్‌ పాలిట తిరుగులేని అస్త్రంగా ఆవిర్భవించింది. శత్రువుల ఆయుధ వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే గాక.. భారత సేన, మిలిటరీ స్థావరాలు, పౌర ఆవాసాలకు నిజంగానే చక్రాయుధంలా రక్షణ కల్పించింది.


నిక్కచ్చి వ్యూహంతో..

పాకిస్థాన్‌పై భారత్‌ తాజాగా సాధించిన విజయం ఏదో ఆషామాషీగా వచ్చింది కాదు. పహల్గాంలో గత నెల 22న అమాయక పర్యాటకులను ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నది మొదలు.. వారినెలా మట్టుబెట్టాలి.. వారికి కోరలుపెట్టి పంపిన పాకిస్థాన్‌ మెడలు ఎలా వంచాలన్నదే మన వ్యూహకర్తల ఏకైక లక్ష్యమైంది. ఇందుకోసం త్రివిధ దళాలను పూర్తిగా సన్నద్ధం చేసి.. ముప్పేట దాడితో శత్రువుకు ఊపిరి సలపకుండా చేశారు. ఇరవై రోజులుగా వేదన పడుతున్న ప్రజలకు.. కేవలం వంద గంటల యుద్ధంతో సాధించిన విజయంతో ఎంతో సాంత్వన కల్పించారు. చైనా, తుర్కియే దేశాలిచ్చిన ఆయుధ, రక్షణ వ్యవస్థలను చూసుకుని విర్రవీగిన పాక్‌ను కోలుకోలేని దెబ్బకొట్టారు. ఉగ్రవాద కర్మాగారాలనే గాక.. ఏకంగా వైమానిక, సైనిక స్థావరాలనే ధ్వంసం చేసి కాళ్లబేరానికి తీసుకొచ్చారు. కాల్పుల విరమణకు అంగీకరిస్తూనే.. భవిష్యత్‌లో ఇలాంటి దుందుడుకు చర్యలకు దిగితే యుద్ధచర్యగానే పరిగణించి కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. ఐదేళ్లుగా శాంతి పరిఢవిల్లుతున్న జమ్మూకశ్మీరును కల్లోలపరిచే లక్ష్యంతో పాకిస్థాన్‌ ప్రేరిత ఉగ్రవాదులు ఏప్రిల్‌ 22న.. భూతల స్వర్గంగా భావించే పహల్గాంలో విహారయాత్రకు వచ్చిన పర్యాటకులపై నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపారు. మతం పేరడిగి మరీ.. వారి భార్యాబిడ్డల కళ్లెదుటే చంపేశారు. 26 మందిని హత్యచేసిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనతో యావత్‌ ప్రపంచం దిగ్ర్భాంతికి గురైంది. 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో ఉగ్రవాదులు సీఆర్‌పీఎఫ్‌ కాన్వాయ్‌పై జరిగిన ఆత్మాహుతి దాడిలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దాని తర్వాత పహల్గాం దాడిలోనే ఇంత ప్రాణనష్టం జరిగింది. ఈ ఉగ్ర చర్యకు పాల్పడింది తామేనని లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ‘ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ (టీఆర్‌ఎఫ్‌)’ ప్రకటించింది. అయితే పాక్‌ మాత్రం తమ దేశానికి చెందిన ఎవరి ప్రమేయమూ లేదని.. భారత్‌ సేనలే అమాయక టూరిస్టులను చంపాయని దుష్ప్రచారానికి ఒడిగట్టింది.


హంతకులు ఎక్కడున్నా వేటాడి వెలికి తీసుకొస్తామని.. ఊహకైనా అందని రీతిలో శిక్షిస్తామని ప్రధాని మోదీ హెచ్చరించారు. అటు రంగంలోకి దిగిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ).. ఉగ్ర దాడిలో పాల్గొన్న పాకిస్థానీల పూర్వాపరాలను, ఎక్కడెక్కడ స్కెచ్‌ వేశారో కూడా కనిపెట్టింది. ఇదే సమయంలో ఉగ్రమూకలకు, పాక్‌కు బుద్ధి చెప్పేందుకు మోదీ ప్రభుత్వం కూడా సన్నాహాలు ప్రారంభించింది. అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసి.. ఉగ్రదాడి వివరాలను తెలియజేసింది. ప్రభుత్వం తీసుకునే ఎలాంటి చర్యనైనా సమర్థిస్తామని అన్ని పార్టీలూ ప్రకటించాయి. తొలుత మోదీ సర్కారు సంయమనంతోనే వ్యవహరించింది. సింధు జలాల ఒప్పందం సస్పెన్షన్‌, దౌత్య ఆంక్షల వంటి చర్యలకే పరిమితమైంది. కానీ పాక్‌ పాలకుల ‘అణు’ రంకెలతో సైనిక చర్యకు కూడా సమాయత్తమైంది. త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ప్రకటించింది. సరిహద్దుల వెంబడి గస్తీని పెంచింది. రక్షణ, ఆయుధ వ్యవస్థలను నిర్దేశిత ప్రాంతాల్లో మోహరించింది. పాక్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీరుల్లో ఉగ్రవాద శిబిరాలు ఎక్కడెక్కడున్నాయో నిఘా సంస్థలు నిక్కచ్చిగా గుర్తించాయి కూడా. అటు పాకిస్థాన్‌ ఈ ఘటనతో తనకు సంబంధం లేదని.. తనను తాను ఉగ్రవాద బాధిత దేశంగా చెప్పుకొనేందుకు విఫలయత్నం చేసింది. పాక్‌ సహాయ నిరాకరణతో ఓపిక నశించిన భారత్‌.. ‘ఆపరేషన్‌ సిందూర్‌’కు శ్రీకారం చుట్టింది.


ఉగ్ర స్థావరాల నేలమట్టం

ఏడో తేదీ (మంగళవారం) అర్ధరాత్రి దాటిన తర్వాత పీవోకే, పాకిస్థాన్‌లోని బహావల్పూర్‌, మురిడ్కేల్లో లష్కరే తోయిబా, జైషే మహ్మద్‌, హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్ర స్థావరాలను భారత సైన్యం నేలమట్టం చేసింది. దరిదాపుగా 150 మంది ఉగ్రవాదులు హతమైనట్లు రక్షణ వర్గాలు వెల్లడించాయి. మరో 70 మంది గాయపడ్డారు. మృతుల్లో కరుడుగట్టిన ఉగ్రవాది మసూద్‌ అజహర్‌ కుటుంబ సభ్యులు పది మంది, అతడి సన్నిహితులు మరో నలుగురు ఉండడం గమనార్హం. ఎక్కడా గురి తప్పకుండా.. సైనిక స్థావరాలు, పౌర ఆవాసాలపై ప్రభావం లేకుండా.. కేవలం ఉగ్ర స్థావరాలపైనే సైన్యం దాడులు చేసింది. 14 రోజుల్లో తిరుగులేని ప్రతీకారం చేసింది.

- సెంట్రల్‌ డెస్క్‌


సరిహద్దు గ్రామాలపై పాక్‌ గుళ్ల వర్షం

తీవ్ర స్థాయిలో జరిగిన నష్టంతో విచక్షణ కోల్పోయిన పాక్‌ సేనలు.. మర్నాడు కశ్మీర్‌లోని సరిహద్దు గ్రామాలపై ఫిరంగి గుళ్ల వర్షం కురిపించాయి. అంతటితో ఆగకుండా బుధవారం (8వ తేదీ) అర్ధరాత్రి దాటగానే భారత్‌లోని 15 నగరాలను టార్గెట్‌ చేసి.. సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడికి విఫల యత్నం చేసింది. పెద్దఎత్తున దాడి చేస్తే భారత్‌ భయపడి కాల్పుల విరమణకు అంగీకరిస్తుందని పాక్‌ వేసిన అంచనా విఫలమైంది. అప్పటికే సర్వసన్నద్ధంగా ఉన్న భారత సైన్యం.. ఎస్‌-400 గగనతల రక్షణ వ్యవస్థ సాయంతో డ్రోన్లను, క్షిపణులను తుత్తునియలు చేసింది. అంతేకాదు.. పాక్‌కు గుణపాఠం నేర్పేందుకు లాహోర్‌, సియాల్‌కోట్‌ సహా పాకిస్థాన్‌కు చెందిన తొమ్మిది ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలపై భీకర దాడులు చేసింది. శనివారం మరింత భీకర దాడికి భారత్‌ సన్నద్ధమైందన్న సమాచారంతో కాళ్ల కింద భూకంపం వచ్చినట్లయింది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో సమన్వయం చేయడంతో పాక్‌ అత్యున్నత సైన్యాధికారి ఒకరు.. భారత మిలిటరీ ఉన్నతాధికారులతో రహస్య చర్చలు జరిపారు. కాల్పుల విరమణకు ప్రాధేయపడ్డారు.

Updated Date - May 11 , 2025 | 03:19 AM