Shubhanshu Shukla: నా దేశం ఎంతో గొప్పది
ABN, Publish Date - Jun 29 , 2025 | 05:02 AM
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో ఉన్న గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లాతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.
అంతరిక్షం నుంచి ఘనంగా కనిపిస్తోంది
రోజుకు 16సార్లు సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు చూస్తున్నాం
ఐఎస్‌ఎస్ నుంచి శుభాన్షు శుక్లా
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ప్రధాని
మీరెంత దూరంగా ఉన్నా మా హృదయాలకు దగ్గరగా ఉన్నారు: మోదీ
న్యూఢిల్లీ, జూన్ 28: ప్రధాని నరేంద్ర మోదీ శనివారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో ఉన్న గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లాతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. 18 నిమిషాలపా టు సాగిన ఈ సంభాషణలో.. ‘ఎలా ఉన్నారు? అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఐఎస్‌ఎస్లోకి వెళ్లగానే ఏమనిపించింది?’ అని మోదీ శుక్లాను ఆరా తీశారు. తాను క్షేమంగా ఉన్నానని, ఐఎస్‌ఎస్ నుంచి చూసినప్పుడు భారత్ ఎంతో గొప్పగా, చాలా పెద్దగా కనిపించిందని శుక్లా చెప్పారు. మొదటిసారి బయటి నుంచి భూగోళాన్ని చూస్తే ఏ ఎల్లలూ లేవనిపించిందని, ఏకత్వ భావన కలిగిందని తెలిపారు. ఐఎ్‌సఎ్‌సలోకి అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా శుక్లా చరిత్ర సృష్టించారు. శుభాన్షుతోపాటు మరో ముగ్గురు వ్యోమగాములు ఈ నెల 25న అమెరికాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్‌ఎక్స్ వ్యోమనౌకలో ఐఎన్‌ఎస్‌కు వెళ్లారు. శుక్లా బృందం అక్కడ 14 రోజుల పాటు వివిధ అంశాలపై పరిశోధనలు చేయనుంది. 1984లో రాకేశ్ శర్మ తర్వాత అంతరిక్ష యానం చేసిన రెండో భారతీయ వ్యోమగామి శుక్లా.
మోదీ, శుక్లా మధ్య సంభాషణ ఇలా..
మోదీ: మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు మన జాతీయ పతాకాన్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లిన క్షణం భారతీయులకు గర్వకారణం. ప్రతి భారతీయుడి ఉద్వేగం, అభిమానం, ఆశలకు ప్రతినిధిగా మీతో మాట్లాడుతున్నాను.
శుక్లా: అంతరిక్షంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉంది. మీతో పాటు 140 కోట్ల మంది భారతీయుల శుభాకాంక్షలకు ధన్యవాదాలు. భూమి నుంచి అంతరిక్షానికి సాగిన 400 కిలోమీటర్ల ప్రయాణం నా ఒక్కడిదే కాదు. యావత్ దేశానిది. నేను వ్యోమగామిని అవుతానని చిన్నప్పుడు ఎప్పుడూ అనుకోలేదు. మీ నాయకత్వంలో దేశం కలలు నెరవేరడానికి ఎన్నో అవకాశాలు లభిస్తున్నాయి.
మోదీ: మీరెలా ఉన్నారు? అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయి?
శుక్లా: నేను బావున్నాను. నాకిదో కొత్త అనుభవం. ఐఎన్‌ఎ్‌సలో గడిపేందుకు వీలుగా మేం ఏడాది పాటు శిక్షణ పొందాం. కానీ ఇక్కడికి వచ్చాక అంతా మారిపోయినట్లుంది. చిన్నపాటి విషయాలు కూడా పూర్తి భిన్నంగా ఉంటాయి. ఇక్కడ నిద్రపోవడం ఒక సవాల్. ఈ వాతావరణానికి అలవాటు పడడానికి కొంత సమయం పడుతుంది.
మోదీ: అక్కడ మీకెలాంటి అనుభూతి కలుగుతోంది?
శుక్లా: భారత్ ఎంతో గొప్పగా చాలా పెద్దగా కనిపించింది. నిజానికి మనం మ్యాప్‌లో చూసేదానికంటే చాలా చాలా పెద్దగా! ఇక మొదటిసారిగా బయటి నుంచి భూమిని చూసినప్పుడు రాష్ట్రాలు, దేశాలు, ఏ సరిహద్దులు లేవనిపించింది. ఏకత్వ భావన కలిగింది. పైనుంచి చూసినప్పుడు భిన్నత్వంలో ఏకత్వమనే ఆదర్శం ఎంత అర్థవంతమైనదో తెలిసింది.
మోదీ: మీ ప్రయాణ విశేషాలు చెప్పండి!
శుక్లా: కాసేపటి క్రితం... నేను కిటికీ నుంచి బయటకు చూస్తుంటే.. మేం హవాయి మీద నుంచి వెళుతున్నాం. రోజుకు 16 సార్లు సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు చూస్తున్నాం. మన దేశం ఎంతో వేగంగా ముందుకువెళుతోంది!
మోదీ: మీతో ఏ భారతీయ వంటకాలను తీసుకెళ్లారు? ఇతర దేశాలకు చెందిన తోటి వ్యోమగాములకు రుచి చూపించారా?
శుక్లా: మన గాజర్ కా హల్వా, మూంగ్ కా దాల్ హల్వా, మామిడిపళ్ల రసం తీసుకొచ్చాను. అందరం కలిసి తిన్నాం. వాళ్లకెంతో నచ్చాయి.
మోదీ: ఇవాళ, మీరు మన మాతృభూమికి దూరంగా ఉండొచ్చు. కానీ భారతీయుల హృదయాలకు చాలా దగ్గరగా ఉన్నారు. మీ పేరులో ‘శుభ’ ఉంది. మీ యాత్ర కొత్త శకానికి శుభారంభం’. భారత్ చేపట్టే మానవసహిత యాత్ర ‘గగన్‌యాన్’కు తొలి అడుగు. మీ తోటి వ్యోమగాములకు కూడా శుభాకాంక్షలు.
శుక్లా: మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు.
Updated Date - Jun 29 , 2025 | 05:30 AM