IIT Madras : గోమూత్రం తాగితే.. 15 నిమిషాల్లో జ్వరం తగ్గుతుంది..ఐఐటీ మద్రాస్ డైరెక్టర్
ABN, Publish Date - Jan 20 , 2025 | 02:53 PM
గోమూత్రం తాగితే 15 నిమిషాల్లో జ్వరం నయమవుతుందని, అందుకే అప్పుడప్పుడు తాగడం మంచిదని ఐఐటీ మద్రాస్ డైరక్టర్ కామకోటి ఇటీవల వ్యాఖ్యానించారు. అందుకు సంబంధించిన వీడియో ఇటీవల ఆన్‌లైన్‌లో వైరల్ అవడంతో తమిళనాడులోని ప్రముఖ రాజకీయ పార్టీ నేతలు సామాజిక మాధ్యమాల్లో సెటైర్లు వేస్తున్నారు..
గోమూత్రం"యాంటీ బాక్టీరియల్", "యాంటీ ఫంగల్"గా పనిచేస్తుందని, అందుకే అప్పుడప్పుడు తాగడం మంచిదని ఐఐటీ మద్రాస్ డైరక్టర్ కామకోటి ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ నెల 15న పొంగల్ సందర్భంగా గోపూజలో పాల్గొన్న సందర్భంగా గోమూత్రం విశిష్టతను వివరిస్తూ తన అభిప్రాయాలు, అనుభవాలు వెల్లడించారు. ఆవు మూత్రంలోని ఔషధ గుణాలను వర్ణిస్తూ ఆయన మాట్లాడుతున్న వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా తమిళనాడులోని ప్రముఖ రాజకీయ పార్టీ నేతల మధ్య రచ్చ మొదలైంది. ప్రొఫెసర్ వ్యాఖ్యలను ఖండిస్తూ కొందరు, సపోర్ట్ చేస్తూ మరికొందరు 'ఎక్స్' వేదికగా పోస్ట్‌లు పెడుతున్నారు.
ప్రొఫెసర్ కామకోటి ఏమన్నారంటే..
కనుమ పండుగ సందర్భంగా ఈ నెల 15న చెన్నై వెస్ట్ మాంబళంలోని గోశాలలో గోపూజ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఐఐటీ మద్రాస్ డైరక్టర్ కామకోటి గోమూత్రం విశిష్టతను వివరిస్తూ పలు అంశాలు మాట్లాడారు. గోమూత్రానికి "యాంటీ బాక్టీరియల్", "యాంటీ ఫంగల్" లక్షణాలుండటం వల్ల పలు రోగాలను నివారించే ఔషధంగా పనిచేస్తుందని అన్నారు. ఓ సన్యాసి కథను ఉదహరిస్తూ ఈ విధంగా చెప్పుకొచ్చారు. "ఒక సన్యాసికి బాగా జ్వరం వచ్చింది. అప్పుడు వైద్యుడిని పిలవాలని అక్కడున్న ప్రజలు భావించారు. కానీ, ఆ సన్యాసి వద్దని వారించి నేరుగా గోశాలకు వెళ్లి గోమూత్రం సేవించాడు. అంతే, 15 నిమిషాల్లోనే జ్వరం తగ్గిపోయింది" అని చెప్పారు.
గోమూత్రానికి ఔషధ గుణాలున్నట్లు యునైటెడ్ స్టేట్స్ టాప్ జర్నల్స్‌లో ఆర్టికల్స్ ప్రచురితమయ్యాయని, శాస్త్రీయ ఆధారాలున్నాయని తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు ఐఐటీ మద్రాస్ డైరక్టర్ కామకోటి. ఈ వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయ పార్టీల మధ్య రచ్చకు దారితీసింది. ఏఐ, కంప్యూటర్ ఇంజినీరింగ్ సబ్జెక్టులలో నిష్ణాతుడైన వ్యక్తి ఇలా మాట్లాతున్నారేంటని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
"ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ కామకోటి అనాలోచితంగా, వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడుతున్నారని" కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం ఎక్స్‌లో పేర్కొన్నారు. అధికార డీఎంకే పార్టీ నుంచి టిఎస్ ఎలంగోవన్ ఓ జాతీయ మీడియాతో "అతడికి వెంటనే ఏదైనా ప్రభుత్వ వైద్య కళాశాలలో పోస్టింగ్ ఇస్తూ బదిలీ చేయాలి. ఐఐటీలో ఏమి చేస్తారు. వెంటనే తొలగించాలి" అని డిమాండ్ చేశారు. అయితే, బీజేపీ తమిళనాడు చీఫ్, కె అన్నామలై ప్రొఫెసర్ కామకోటికి అండగా నిలిచారు. "ఐఐటీ చెన్నై డైరెక్టర్‌ని ఇలా మాట్లాడటం దురదృష్టకరం.ప్రతి ఒక్కరికీ వారి మతాన్ని ఆచరించే హక్కు ఉంది. సంస్థ గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే వారంతా దీన్ని ఆపాలని కోరుతున్నాను" అని మీడియాతో వ్యాఖ్యానించారు.
Updated Date - Jan 20 , 2025 | 06:31 PM