Operation Sindoor: నుదుటి సిందూరం తుడిచినవాని నట్టింట్లోకి వెళ్లి నాశనం చేశాం
ABN, First Publish Date - 2025-05-13T16:12:26+05:30
Operation Sindoor: భారత్, పాకిస్థాన్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ.. పంజాబ్‌లోని అదంపూర్ ఎయిర్ బేస్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా సైనికులతో ఆయన స్వయంగా మాట్లాడారు.
పంజాబ్, మే 13: ధర్మ సంస్థాపన కోసం ఆయుధం పట్టడం.. మన సంప్రదాయం.. మన విధానమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. మన సైన్యం చూపిన శక్తి సామర్థ్యాలు భావితరాలకు గొప్ప ప్రేరణ అని ఆయన అభివర్ణించారు. ఈ భూమి నుంచి వీర సైనికులు అందరికీ తాను సెల్యూట్ చేస్తున్నానన్నారు. వీర సైనికుల పరాక్రమంతో ఆపరేషన్ సిందూర్ నినాదం.. ప్రపంచమంతా మార్మోగుతోందని ఆయన తెలిపారు. మంగళవారం పంజాబ్‌లోని అదంపూర్ ఎయిర్‌బేస్‌ను ప్రధాని మోదీ సందర్శించారు. ఈ సందర్భంగా సైనికులతో ఆయన స్వయంగా మాట్లాడారు. అనంతరం సైనికులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు.
మన సైన్యం చేపట్టిన ఈ పరాక్రమం.. భారత్ సామర్థ్యానికి ప్రతి రూపమని పేర్కొన్నారు. భారత్ చూపిన ఈ పరాక్రమం.. త్రివిధ దళాల త్రివేణీ సంగమమని ఆయన వ్యాఖ్యానించారు. పాకిస్థాన్‌కు భారత వాయుసేన తన సత్తా చాటిందంటూ సైనికులపై ఆయన ప్రశంసల జల్లు కురిపించారు. యుద్ధ క్షేత్రంలోనూ భారత్ మాతాకీ జై నినాదాలు చేశామని.. ఈ జయ జయ ద్వానాలు ప్రపంచమంతా విన్నదని ఆయన గుర్తు చేశారు.
భారత్ మాతాకీ జై అనేది ప్రతీ పౌరుడి నినాదమని ప్రధాని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అణు బాంబు హెచ్చరికలను సైతం చిత్తు చేశామని చెప్పారు. దేశంలోని ప్రతీ పౌరుడూ గర్వపడేలా మీరు చేశారంటూ సైనికులను ఈ సందర్భంగా ప్రధాని మోదీ అభినందించారు. మీరందరూ చరిత్ర సృష్టించారంటూ సైనికులను ఆయన వెన్ను తట్టి ప్రోత్సహించారు. మీ కోసమే నేను ఇక్కడికి వచ్చానని చెప్పారు. వీరులను చూసినప్పుడు జీవితం ధన్యమవుతోందని ప్రధాని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
మన అక్కాచెల్లెళ్ల నుదుటి సిందూరం తుడిచినవాడి నట్టింట్లోకి వెళ్లి నాశనం చేశామని ప్రధాని మోదీ తెలిపారు. మీరు గురిచూసిన కొట్టిన దెబ్బ శత్రు స్థావరాలు మట్టిలో కలిసిపోయాయన్నారు. భారత త్రివిధ దళాలు పాక్ సైన్యాన్ని మట్టి కరిపించాయని చెప్పారు. పాక్ సైన్యానికి స్పష్టమైన సందేశం ఇచ్చామన్నారు. పాక్‌లో ఎక్కడైనా ప్రశాంతంగా శ్వాస తీసుకునే అవకాశం లేకుండా చేశామని వివరించారు.
మన డ్రోన్లు, మిస్సైల్స్ పాక్ భూభాగంలోకి.. చొచ్చుకెళ్లి విధ్వంసం సృష్టించాయని తెలిపారు. ఇంకా చెప్పాలంటే.. పాక్ సైన్యానికి నిద్ర లేని పరిస్థితి సృష్టించామన్నారు. పాక్ భూభాగంలో ఏ స్థావరాన్ని అయినా.. గురి చూసి కొట్టగలమని నిరూపించామని చెప్పారు. ఆపరేషన్ సిందూర్ భారత్ ఆత్మ విశ్వాసాన్ని కొత్త ప్రమాణాలు లిఖించిందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
ఇక మన స్థావరాలపై దాడి చేసేందుకు పాక్ ఎంతో ప్రయత్నించిందన్నారు. కానీ పాక్ విమానాలు, మిస్సైల్స్.. మన ముందు చిత్తైపోయాయన్నారు. భారత లక్ష్మణ రేఖ ఇప్పుడు ఎంతో సురక్షితమని పేర్కొన్నారు. మళ్లీ దాడి చేస్తే భారత్ గట్టిగా జవాబిస్తుందని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. న్యూక్లియర్ బ్లాక్‌మెయిల్‌ను భారత్ ఏ మాత్రం ఉపేక్షించదని స్పష్టం చేశారు. ఉగ్రవాదులు..వారి వెనుకున్నవారిని..భారత్ వేర్వేరుగా చూడదని ఆయన కుండ బద్దలు కొట్టారు.
కేవలం 15 నిమిషాల్లో సరిహద్దుల ఆవల శక్తులను భగ్నం చేశామని చెప్పారు. ఇదంతా ప్రొఫెషనల్ సామర్థ్యంతోనే సాధ్యమైందని ప్రధాని మోదీ తెలిపారు. భారత్ సైన్యం దాడితో శత్రువు డీలా పడిపోయిందన్నారు. ఎప్పుడు దాడి జరిగిందో కూడా కనిపెట్టలేక పోయిందని ప్రధాని మోదీ చెప్పారు. ఎంతో కచ్చితత్వంతో ఎంతో నైపుణ్యంతో చేసిన దాడి ఇదని ఆయన గుర్తు చేశారు. పౌర విమానాలను అడ్డు పెట్టుకుని పాక్ కుయుక్తులు పన్నిందని ప్రధాని మోదీ చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Vallabhaneni Vamsi: వంశీని ఆసుపత్రికి తరలించిన పోలీసులు
Operation Sindoor: భారత్ దాడుల్లో 11 మంది సైనికులు మృతి: పాకిస్థాన్
For National News And Telugu News
Updated Date - 2025-05-13T16:56:29+05:30 IST