ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Gali Janardhan Reddy: కానిస్టేబుల్‌ కుమారుడు కోట్లకు పడగెత్తాడు

ABN, Publish Date - May 07 , 2025 | 06:21 AM

బళ్లారి కానిస్టేబుల్ కుమారుడిగా మొదలైన గాలి జనార్దన్‌రెడ్డి ప్రయాణం, మైనింగ్‌ దందాతో కోట్లకు పడగెత్తి, చివరికి అక్రమాల కేసుల్లో సీబీఐ చేత శిక్షితుడిగా ముగిసింది. చిత్తూరు నుంచే బళ్లారి వరకు సాగిన ఈ ప్రస్థానం రాజకీయ, వ్యాపార, న్యాయ పరమైన పరిణామాలతో నిండి ఉంది

  • అతి సాధారణ జీవనం నుంచి బంగారు సింహాసనం దాకా

  • సొంత హెలికాప్టర్లో కర్ణాటక సచివాలయానికి వెళ్లే స్థాయికి ఎదిగిన గాలి జనార్దన్‌రెడ్డి

బళ్లారిలో సాధారణ కానిస్టేబుల్‌గా పనిచేసిన చెంగారెడ్డి కుమారుడే మైనింగ్‌ కింగ్‌ గాలి జనార్దన్‌రెడ్డి. వాస్తవానికి చిత్తూరు జిల్లాకు చెందిన చెంగారెడ్డి కుటుంబం.. ఆ తర్వాత బళ్లారి వలస వెళ్లింది. ఆయన అత్యంత సాధారణమైన జీవితం నుంచి కోట్లకు పడగలెత్తి అత్యంత సంపన్నుడిగా ఆవిర్భవించడం వెనుక అక్రమ వ్యాపారాల చరిత్ర ఉంది. 1967లో బళ్లారిలో జన్మించిన జనార్దన్‌రెడ్డి.. కేవలం 21 ఏళ్ల వయసులో బళ్లారిలో ‘ఎన్నోబుల్‌ ఇండియా సేవింగ్స్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ కంపెనీ’ని ప్రారంభించి ప్రజల నుంచి పెద్దఎత్తున డిపాజిట్లు వసూలు చేశారు. ఎల్‌ఐసీకి దీటైన సంస్ధ అంటూ ప్రచారంతో ఊదరగొట్టి సామాన్యుల నుంచి డిపాజిట్లు సేకరించారు. బళ్లారితోపాటు కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల నుంచీ పలువురు డిపాజిట్లు చేశారు. ఈ సంస్ధపై రిజర్వ్‌ బ్యాంక్‌కు పలు ఫిర్యాదులు రావడంతో ఎన్నోబుల్‌ సంస్ధను ఆర్‌బీఐ మూసివేయించింది. అప్పటికే పెద్దఎత్తున పొదుపు ఖాతాల్లో డబ్బు పెట్టిన వేల మంది ప్రజలు నష్టపోయారు. అదే సమయంలో గాలి జనార్దన్‌రెడ్డి తన సోదరులైన కరుణాకర్‌రెడ్డి, సోమశేఖర్‌రెడ్డితో కలిసి చిట్‌ఫండ్‌ వ్యాపారం ప్రారంభించారు. ఈ క్రమంలో మైనింగ్‌ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ (ఓఎంసీ)ని ప్రారంభించారు. ఇనుప ఖనిజం అమ్మకాలతో భారీగా డబ్బు సంపాదించారు. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ద్వారా ఓఎంసీకి ఉమ్మడి అనంతపురం జిల్లాలో మైనింగ్‌ లీజులు పొందారు. మైనింగ్‌ దందాలో డబ్బు వస్తున్న కొద్దీ రాజకీయ అండ అవసరం కావడంతో గాలి సోదరులు బీజేపీలో చేరారు.


ఇచ్చింది కొంత.. తవ్వింది కొండంత

కే వలం 69 హెక్టార్ల మైనింగ్‌ లీజు పొందిన గాలి జనార్దన్‌రెడ్డి కంపెనీ ఓఎంసీ.. అక్రమంగా అంతకు రెట్టింపు మైనింగ్‌ జరిపిందని సీబీఐ దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దులను కూడా ధ్వంసం చేశారు. 60 లక్షల టన్నుల ఇనుప ఖనిజాన్ని విదేశాలకు అక్రమంగా ఎగుమతి చేసినట్లు విచారణలో వెల్లడైంది. అక్రమంగా ఇనుప ఖనిజం తవ్వడం, రవాణా, ఎగుమతులు, విక్రయాల ద్వారా గాలి రూ.వందల కోట్లు గడించినట్లు వెల్లడైంది. అప్పట్లో ప్రైవేటు హెలికాప్టర్‌ ‘రుక్మిణి’తోపాటు అనేక లగ్జరీ కార్లను గాలి ఇంట సీజ్‌ చేశారు.

ప్రభుత్వాలను శాసించే స్థాయికి..

మైనింగ్‌ మాఫియాతో రూ.కోట్లకు పడగలెత్తిన గాలి.. అనంతర కాలంలో ప్రభుత్వాలను సైతం శాసించే స్థాయికి ఎదిగారు. అప్పట్లో అనంతపురం డీఎ్‌ఫవోగా పనిచేసిన బిశ్వాస్‌ తన నివేదికలో రూ.700 కోట్ల విలువైన ఇనుప ఖనిజాన్ని ఓఎంసీ తరలించినట్లు నివేదిక ఇచ్చారు. ఆయనపై కూడా అక్రమ కేసులు బనాయించే ప్రయత్నం చేశారు. అప్పటి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అండదండలతో అక్రమ మైనింగ్‌ నిర్వహించి కోట్లు కొల్లగొట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.

నాడు టీడీపీ నేతలపై అక్రమ కేసులు

ఓబుళాపురంలో గాలి జనార్దన్‌రెడ్డి అక్రమ మైనింగ్‌ను పరిశీలించేందుకు 2007 జూలైలో ఉమ్మడి ఏపీ టీడీపీ నేతల బృందం ఓబుళాపురానికి వెళ్లింది. ముఖ్యనేతలు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, నిమ్మకాయల చినరాజప్ప, ఎర్రబల్లి దయాకర్‌రావు, నాగం జనార్దన్‌రెడ్డి, వేం నరేందర్‌రెడ్డి, పినిశెట్టి రంగనాయకులు, బీసీ గోవిందప్ప, మెట్టు గోవిందరెడ్డి, కొప్పుల హరీశ్వరరెడ్డి, చిన్నం బాబు రమేష్‌, పడాల అరుణ, లలితకుమారి, బొమ్మిడి నారాయణరావు, అమర్‌నాథ్‌రెడ్డి, రాజేంద్రప్రసాద్‌ తదితరులు అక్కడకు వెళ్లకుండా పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. వారు ఆందోళనకు దిగడంతో అరెస్టు చేశారు. అనంతపురం జిల్లా డి.హీరేహాళ్‌ పోలీసు స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు. ఆ కేసులను విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు ఈ ఏడాది మార్చిలో కొట్టివేసింది.


సొంత హెలికాప్టర్‌.. బంగారు కుర్చీ

ఓఎంసీని ప్రారంభించి అనంతపురం జిల్లాలో ఇనుపఖనిజం భూములను లీజుకు తీసుకుని దందా ప్రారంభించిన గాలి జనార్దన్‌రెడ్డి... వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో పెరిగిన సాన్నిహిత్యంతో అపరిమితంగా ఎదిగారు. అత్యంత విలాసవంతమైన జీవితం గడిపారు. ఆయన ఇంట్లో బాత్‌రూం కమోడ్‌ నుంచి భోజనం చేసే కంచాల వరకు అన్నీ బంగారమేనని అనేవారు. ఆయన బంగారు సింహసనంలో కూర్చునేవారని ప్రచారం. కొన్నాళ్లు కర్ణాటక మంత్రిగా పనిచేసిన గాలి.. అప్పట్లో సొంత హెలికాప్టర్లో సచివాలయానికి వచ్చేవారు. అక్రమ తవ్వకాల కేసులో 2011 సెప్టెంబరు 5న సీబీఐ ఆయన్ను అరెస్టుచేసింది. మూడేళ్లకుపైగా జైల్లోనే ఉన్నారు. బెయిల్‌ కోసం ఏకంగా న్యాయమూర్తులకే రూ.కోట్ల లంచం ఇవ్వడానికి గాలి ముఠా ప్రయత్నించడం అప్పట్లో సంచలనం సృష్టించింది. కుమార్తె బ్రహ్మణి వివాహానికి ఆయన భారీగా రూ.500 కోట్లు ఖర్చుపెట్టినట్లు ప్రచారం జరిగింది.


రూ.10 లక్షల పెట్టుబడితో ఆరంభం..

2001-02 సంవత్సరంలో కేవలం రూ.10 లక్షల పెట్టుబడితో ప్రారంభమైన ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ.. అక్రమ ఖనిజ తవ్వకాలు, ఎగుమతులతో ఆరేడేళ్లలోనే ఏకంగా సుమారు రూ.3 వేల కోట్లు ఆర్జించినట్లు ఆరోపణలున్నాయి. కర్ణాటక, ఆంధ్ర సరిహద్దులో మైనింగ్‌ మాఫియాను గాలి జనార్దన్‌రెడ్డి నడిపించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం డి.హీరేహాళ్‌ మండలంలో ఆరు గనులు ఉండగా.. వాటిలో ఐదు ఓఎంసీ అధీనంలోనే ఉన్నాయి. బళ్లారి ఐరన్‌ ఓర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన 27.12 హెక్టార్లు, ఓఎంసీ-1 25.98 హెక్టార్లు, అంతరగంగమ్మ కొండలో ఓఎంసీ-2లో 68.50 హెక్టార్లు, ఓఎంసీ-3లో 39.50 హెక్టార్లు, అనంతపురం మైనింగ్‌ కంపెనీలో 6.5 హెక్టార్లు, వై మహాబళేశ్వరప్ప అండ్‌ సన్స్‌లో 20.24 హెక్టార్లను ప్రభుత్వం గనుల లీజుకు కేటాయించింది. వీటిలో బళ్లారి ఐరన్‌ ఓర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ తప్ప మిగిలినవన్నీ ఓఎంసీ అధీనంలో ఉన్నాయి. అంతరగంగమ్మ కొండలోని లీజు ప్రాంతంలో 29.32 లక్షల మెట్రిక్‌ టన్నుల ఖనిజాన్ని ఓఎంసీ తరలించినట్లు అధికారులు అప్పట్లో తేల్చారు. అక్కడ నాణ్యమైన ఖనిజం లేదని, పక్క ప్రాంతంలోని ఖనిజాన్ని తవ్వి అంతరగంగమ్మ కొండ పేరుతో తరలించినట్లు ఆరోపణలు వచ్చాయి. అటవీ శాఖ అనుమతులు లేకుండానే ఖనిజాన్ని తరలించినట్లు తేలింది. బళ్లారి ఐరన్‌ఓర్‌కు చెందిన లీజు ప్రాంతంలో చొరబడి 2.5 లక్షల మెట్రిక్‌ టన్నుల ఖనిజాన్ని అక్రమంగా తవ్వి తరలించినట్లు ఓఎంసీపై ఆరోపణలు వచ్చాయి. ఆ సంస్థ అధికారులకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసింది. కానీ గాలి అండ్‌ కో ఆ యాజమాన్యాన్ని భయపెట్టి దౌర్జన్యంగా తవ్వకాలు సాగించారు. అక్రమ తవ్వకాలు చేపట్టే ప్రాంతాల్లో తుపాకులతో సాయుధ బందోబస్తు ఏర్పాటు చేసుకున్నారు.


న్యాయం గెలిచింది

తప్పు చేసిన వారెవరూ న్యాయ దేవత నుంచి తప్పించుకోలేరని సీబీఐ కోర్టు తీర్పుతో మరోసారి రుజువైంది. అంతిమంగా న్యాయం గెలిచింది. గాలి జనార్దన్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డితోపాటు మరికొందరిని ఏడేళ్ల జైలుశిక్ష పడటాన్ని స్వాగతిస్తున్నాం. సుదీర్ఘ పోరాటం అనంతరం వారికి శిక్ష పడింది. గాలి జనార్దనరెడ్డి ఇప్పటికైనా తన ఆత్మసాక్షిగా దేవుడి ముందు క్షమాభిక్ష కోరుకోవాలి. సీబీఐ సీజ్‌ చేసిన ఇనుప ముడిఖనిజం దొంగతనం జరిగింది. దానిపైనా కేసు నమోదు చేసి విచారించాలని ఫిర్యాదు చేశాం. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, గనుల మంత్రి కొల్లు రవీంద్ర దీనిపై దృష్టి పెట్టి, న్యాయం చేయాలి. మా మైనింగ్‌ మెటీరీయల్‌ను మాకు ఇప్పించాలి.

- టపాల్‌ శ్యాంప్రసాద్‌, ప్రధాన సాక్షి.


అక్రమ మైనింగ్‌ కేసులో... ఎప్పుడేం జరిగింది?

  • 2006 సెప్టెంబరు 3వ తేదీన గాలి జనార్దన్‌రెడ్డి సిద్ధాపురం-ఓబుళాపురం సరిహద్దులో ఉండే సుంకులమ్మ దేవాలయాన్ని కూల్చి, ముడి ఖనిజం తవ్వకాలు చేపట్టారు.

  • 2006లోనే కర్ణాటకలోని టుముటిమెన్‌లో ఓఎంసీ చొరబడి అక్రమ తవ్వకాలు చేయడంతో పాటు సరిహద్దు రాళ్లను మార్చినట్లు బళ్లారిలోని సండూర్‌ పోలీసు స్టేషన్‌కు ఫిర్యాదు అందింది.

  • 2007 జూలై 21 నుంచి మూడు రోజుల పాటు అప్పటి ఉమ్మడి ఏపీలోని టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనాయకుల బృందం గనులను పరిశీలించడానికి వస్తే వారిని రాయదుర్గం పోలీసు స్టేషన్‌లో నిర్బంధించారు. ఆ క్రమంలో టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతల బృందం పోలీసు స్టేషన్‌ ముందు బైఠాయించి ఆందోళన చేశారు.

  • 2007 ఆగస్టు 11 నుంచి 14 వరకు అఖిలపక్ష బృందం అక్రమ తవ్వకాలపై పరిశీలన చేసింది.

  • 2008 జనవరి 14న ఓఎంసీకి పక్కనే ఉన్న బీఐఓపీ మైనింగ్‌ ప్రాంతంలో చొరబడి దౌర్జన్యంగా విలువైన ఖనిజాన్ని కొల్లగొడుతోందని ఆ సంస్థ యాజమాన్యం అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు ఫిర్యాదు చేసింది.

  • ఆ ఏడాది జనవరి 28, 29, 30వ తేదీల్లో అప్పటి అనంతపురం జిల్లా జడ్జి గడ్డెన్న గనుల్లో పర్యటించి అక్రమాలపై నివేదిక ఇచ్చారు.

  • కర్ణాటకలోని ఇన్‌ట్రేడర్‌ మైన్‌లో చొరబడి అక్రమ తవ్వకాలు చేయడంపై ఫిర్యాదు అందుకున్న కర్ణాటక లోకాయుక్త విచారించి వాస్తవమేనని నివేదిక ఇచ్చింది.


  • 2009లో ఓఎంసీ అక్రమాలు, సరిహద్దుల మార్పులపై అనంతపురం మైనింగ్‌ యజమాని టపాల్‌ గణేశ్‌.. కేంద్ర సాధికారిక సంస్థకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఆ కమిటీ.. సర్వే ఆఫ్‌ ఇండియాతో మైనింగ్‌ ప్రాంతాన్ని సర్వే చేయించాలనీ, అప్పటివరకు ఆరు మైన్స్‌లో తవ్వకాలను నిలిపి వేయించాలనీ ఏపీ ప్రభుత్వానికి సూచించింది. ఈ నేపథ్యంలో అప్పటి ప్రభుత్వం సమ్మిరెడ్డి కమిటీని నియమించింది.

  • 2009 డిసెంబరులో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో సీబీఐ విచారణ ప్రారంభించింది. ఓఎంసీ హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకుంది. అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏకేపాద నేతృత్వంలో 2010 మార్చిలో కమిటీ ఏర్పాటైంది. మూడు నెలలు గడువు కోరిన ఈ కమిటీ.. అంతరాష్ట్ర సరిహద్దు వివాదాన్ని తేల్చలేకపోయింది.

  • బళ్లారి రక్షిత అటవీ ప్రాంతంలో మైనింగ్‌ కంపెనీల అక్రమ తవ్వకాలు, పర్యావరణ ముప్పు లాంటి అంశాలపై సమాజ్‌ పరివర్తన సంస్థ పూర్తి స్థాయి నివేదికను తయారు చేసి కేంద్ర సాధికార సంఘానికి 2010లో అందించింది.

  • 2011 ఫిబ్రవరి 9న అప్పటి సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ బృందం గనులను పరిశీలించింది.

  • 2011 సెప్టెంబరు 5న గాలి జనార్దనరెడ్డి, ఎండీ శ్రీనివాసరెడ్డి అరెస్టు.

  • 2025 మే 6న..సీబీఐ కోర్టు గాలికి శిక్ష విధించింది.

- బెంగళూరు, ఆంధ్రజ్యోతి.

Updated Date - May 07 , 2025 | 06:21 AM