Kulgam Encounter: జమ్మూ కశ్మీర్‌లోని కుల్గాంలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు జవాన్లు వీరమరణం
ABN, Publish Date - Aug 09 , 2025 | 09:31 AM
జమ్మూ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని అఖల్ అడవి ప్రాంతంలో తొమ్మిదో రోజు కూడా భద్రతా బలగాలు ఉగ్రవాదులతో పోరాడుతున్నాయి. ఆ క్రమంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు ఇద్దరు భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
జమ్మూ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్ (Kulgam Encounter) తొమ్మిదో రోజు కూడా కొనసాగుతోంది. అఖల్ అడవి ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు భారత సైనికులు వీరమరణం చెందారు, మరో ఇద్దరు గాయపడ్డారు. గాయపడిన సైనికులను వెంటనే 92 బేస్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చినార్ కార్ప్స్ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది.
ఈ ఎన్‌కౌంటర్‌లో అమరులైన సైనికులు లెఫ్టినెంట్ కల్నల్ ప్రీత్‌పాల్ సింగ్, సిపాయి హర్మిందర్ సింగ్. దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన ఈ వీరుల సేవలను దేశం ఎప్పటికీ మరచిపోదు. ఈ ఘటన కుల్గాం జిల్లాలోని అఖల్ ప్రాంతంలోని దట్టమైన అడవిలో రాత్రి జరిగింది. ఇక్కడ ఉగ్రవాదులు దాక్కున్నట్లు సమాచారం అందడంతో భద్రతా బలగాలు ఆపరేషన్ ప్రారంభించాయి.
కొనసాగుతున్న ఆపరేషన్
కుల్గాం జిల్లాలోని అఖల్ అటవీ ప్రాంతంలో దాగి ఉన్న ఉగ్రవాదులను పట్టుకోవడానికి భద్రతా దళాలు ఇంకా ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. పోలీసులు, సైన్యం ఉన్నతాధికారులు ఈ ఆపరేషన్‌ను 24 గంటలూ పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం డీజీపీ నళిన్ ప్రభాత్ ఆ ప్రాంతానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. ఆయనతో పాటు ఐజీపీ కశ్మీర్ వీగే విర్ది కూడా ఉన్నారు. అలాగే, నార్తర్న్ కమాండ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ప్రతీక్ శర్మ దక్షిణ కశ్మీర్ భద్రతపై సమీక్ష నిర్వహించారు.
ఉగ్రవాదులను గుర్తించేందుకు భద్రతా బలగాలు డ్రోన్‌లు, హెలికాప్టర్లు, ఆధునిక పరికరాలు, శునకాలను ఉపయోగిస్తున్నాయి. ఇప్పటి వరకు ఇద్దరు ఉగ్రవాదులు హతమవగా, తొమ్మిది మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఇది ఈ ఏడాది జమ్మూ కశ్మీర్‌లో ఎక్కవ సమయం పాటు జరిగిన ఆపరేషన్‌గా చెప్పుకోవచ్చు.
ప్రజలకు సూచన
ఈ నేపథ్యంలో అఖల్ ప్రాంతంలోని ప్రజలు ఇంట్లోనే ఉండాలని, ఏవైనా అనుమానాస్పద విషయాలు ఉంటే వెంటనే సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. ప్రజలకు అవసరమైన సహాయం అందించేందుకు ప్రత్యేక నోడల్ అధికారులను నియమించారు. సహాయం కోసం ఈ కింది హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించవచ్చు.
DSP DAR (DPL కుల్గాం): 9419042364, 7051510656
తహసీల్దార్ దేవ్‌సర్: 9797144203
SHO, పోలీస్ స్టేషన్ దేవ్‌సర్: 9682196481, 7051510664
నయీబ్ తహసీల్దార్ అఖల్: 7006743818
SI అర్షిద్ అహ్మద్: 7006613287
MHC దేవ్‌సర్: 9906525978
ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు సహకరించాలని అధికారులు కోరారు.
ఇవి కూడా చదవండి
ఉద్యోగం పోయిన తర్వాత లోన్ EMIలు చెల్లించాలా? మారటోరియం?
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 09 , 2025 | 09:54 AM