Elvish Yadav Gurugram: ముసుగుతో వచ్చి యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ ఇంటిపై కాల్పులు జరిపిన దుండగులు
ABN, Publish Date - Aug 17 , 2025 | 12:06 PM
యూట్యూబ్, బిగ్ బాస్ ఓటీటీ విజేతగా క్రేజ్‌ను సంపాదించుకున్న ఎల్విష్ యాదవ్ నివాసంపై ఈరోజు తెల్లవారుజామున కాల్పుల దాడి జరిగింది. అయితే ఎల్విష్ ఇంటి గేట్ దాటి ఈ దాడికి ఎవరెవరు పాల్పడ్డారు? దాని వెనుక అసలు ఉద్దేశం ఏంటనేది తెలియాల్సి ఉంది.
ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ ఎల్విష్ యాదవ్ (Elvish Yadav) ఇంటిపై ఆదివారం తెల్లవారుజామున గురుగ్రామ్‌లో దాడి జరిగింది. తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో, గురుగ్రామ్‌లోని సెక్టార్ 57లో ఎల్విష్ యాదవ్ ఇంటి బయట ముగ్గురు ముసుగు ధరించిన వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో దాదాపు డజను రౌండ్ల కంటే ఎక్కువ తూటాలు పేలాయట. అయితే ఈ సమయంలో ఎల్విష్ యాదవ్ ఇంట్లో లేడు. అతను ప్రస్తుతం హర్యానా బయట ఉన్నాడు.
అందుకు సంబంధించిన వీడియోలో ఇంటి గాజులు పగిలిపోవడం, సీలింగ్ దెబ్బతిని, బుల్లెట్ల గుర్తులు పడినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఎల్విష్ ఇల్లు ఆ భవనంలో రెండు, మూడో అంతస్తుల్లో ఉంది. ఆ సమయంలో అతని కేర్‌టేకర్, కొంతమంది కుటుంబ సభ్యులు ఇంట్లో ఉన్నారు. అదృష్టవశాత్తూ, ఈ దాడిలో ఎవరికీ గాయాలు కాలేదు.
పోలీసులు ఏం చేశారు?
ఇది జరిగిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, ఆధారాలు సేకరించారు. సమీపంలోని CCTV ఫుటేజ్‌ను పరిశీలించారు. ఎల్విష్ కుటుంబం నుంచి కంప్లైంట్ వస్తే, దాని ఆధారంగా ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేస్తామని పోలీసులు తెలిపారు. గురుగ్రామ్ పోలీస్ PRO సందీప్ కుమార్ మాట్లాడుతూ ఈ దాడిలో 20కి పైగా రౌండ్లు కాల్చారని, బుల్లెట్లు గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్‌లో తగిలాయన్నారు. దాడి చేసిన వారు తప్పించుకున్నారని తెలిపారు. పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఎల్విష్ కుటుంబం నుంచి అధికారిక ఫిర్యాదు వస్తే, ఈ కేసు గురించి మరింత విచారణ జరగనుంది.
ఎల్విష్‌కు ఎలాంటి బెదిరింపులు రాలేదా?
ఎల్విష్ యాదవ్ కుటుంబ సభ్యుడొకరు ఈ దాడికి ముందు ఎల్విష్‌కు ఎలాంటి బెదిరింపులు రాలేదన్నారు. అంటే, ఈ దాడి హఠాత్తుగా జరిగినట్లు తెలుస్తోంది. దీని వెనుక కారణాలు ఏంటనేది పోలీసుల దర్యాప్తులో తేలాలి. ఎల్విష్ యాదవ్ పేరు ఇటీవల పలు రకాల కేసులతో వార్తల్లో నిలిచింది. అతనిపై స్నేక్ వెనమ్ కేసు నడుస్తోంది. ఈ కేసులో రేవ్ పార్టీల్లో స్నేక్ వెనమ్‌ను డ్రగ్‌గా ఉపయోగించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ పార్టీలకు భారతీయులతో పాటు విదేశీయులు కూడా హాజరయ్యారని సమాచారం.
ఇవి కూడా చదవండి
డెంగ్యూ దాడికి చెక్ పెట్టండి.. ఈ చిట్కాలతో ఆరోగ్యంగా ఉండండి
మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 17 , 2025 | 12:23 PM