Share News

Loan Process Tips: మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్

ABN , Publish Date - Aug 16 , 2025 | 10:37 AM

లోన్ కోసం అప్లై చేసినా ఎందుకు ఆలస్యం అవుతోంది? ఈ ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. లోన్ మంజూరు కాకపోవడం, ఆలస్యం కావడం వెనుక కొన్ని తప్పులు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

Loan Process Tips: మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్
Loan Process Tips

మీరు లోన్ కోసం అప్లై చేసినా కూడా ఇంకా మంజూరు కాలేదా. ఇలాంటి క్రమంలో మీరు కొన్ని విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. లోన్ అప్లై చేసే ముందు కొన్ని విషయాలు పాటించడం ద్వారా మీరు వేగంగా రుణం పొందే అవకాశం ఉంటుంది. మీరు చేసే చిన్న చిన్న తప్పులు మీకు లోన్ ఆలస్యంగా వచ్చేలా చేస్తాయి. అయితే ఆ తప్పులు ఏంటి, ఏం చేయకుండా ఉండాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.


1. అసంపూర్తి డాక్యుమెంట్లు

లోన్ అప్లై చేసేటప్పుడు సాధారణ తప్పు డాక్యుమెంట్ల సమర్పణలో జరుగుతుంది. ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఆదాయ రుజువు, బ్యాంక్ స్టేట్‌మెంట్ లేదా ఇతర ముఖ్యమైన పత్రాలు అసంపూర్తిగా ఉంటే, బ్యాంకు మీ అప్లికేషన్‌ను తిరస్కరించవచ్చు లేదా ఆలస్యం చేయవచ్చు. ఇలాంటి సమయంలో బ్యాంకు అడిగిన అన్ని డాక్యుమెంట్ల లిస్టును ముందుగా తెలుసుకుని, సరిగ్గా సమర్పించండి. డాక్యుమెంట్ల శాలరీ స్లిప్, స్టేట్ మెంట్ సహా అన్ని వివరాలను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని సమర్పించండి.


2. సిబిల్ స్కోర్ సమస్యలు

మీ సిబిల్ స్కోర్ (CIBIL Score) లోన్ మంజూరులో కీలక పాత్ర పోషిస్తుంది. 750 కంటే తక్కువ స్కోర్ ఉంటే, బ్యాంకులు మీ అప్లికేషన్‌ను సీరియస్‌గా తీసుకుంటాయి. క్రెడిట్ కార్డ్ బిల్లులు ఆలస్యంగా చెల్లించడం, గతంలో తీసుకున్న లోన్ల రీపేమెంట్‌లో జాప్యం వంటివి సిబిల్ స్కోర్‌ను దెబ్బతీస్తాయి. లోన్ అప్లై చేయడానికి ముందే మీ సిబిల్ స్కోర్‌ను చెక్ చేసుకోండి. ఒకవేళ స్కోర్ తక్కువగా ఉంటే, క్రెడిట్ కార్డ్ బిల్లులు, ఇతర ఈఎంఐలను చెల్లించి స్కోర్ పెంచుకున్న తర్వాత అప్లై చేయండి.


3. తప్పుడు సమాచారం

అప్లికేషన్ ఫారమ్‌లో తప్పుడు సమాచారం ఇవ్వడం మరో పెద్ద తప్పు. ఉదాహరణకు మీ ఆదాయం, ఉద్యోగ వివరాలు లేదా ఇతర వ్యక్తిగత సమాచారాన్ని తప్పుగా ఇస్తే, బ్యాంకు వెరిఫికేషన్ సమయంలో మీ అప్లికేషన్‌ను తిరస్కరిస్తారు. ఎల్లప్పుడూ నిజాయితీగా సమాచారం ఇవ్వండి. బ్యాంకు అధికారులతో సంప్రదించి, మీ సమాచారం సరిగ్గా ఉందని నిర్ధారించుకోండి.


4. లోన్ గురించి స్పష్టత లేకపోవడం

చాలామంది తమకు ఏ రకమైన లోన్ అవసరమో స్పష్టంగా నిర్ణయించుకోకుండా అప్లై చేస్తారు. ఉదాహరణకు హోమ్ లోన్, పర్సనల్ లోన్, బిజినెస్ లోన్ ప్రతి లోన్‌కు భిన్నమైన అర్హతలు, డాక్యుమెంట్లు అవసరం అవుతాయి. మీ అవసరాలను బట్టి లోన్ రకాన్ని ఎంచుకోండి. బ్యాంకు అధికారులతో లేదా ఫైనాన్షియల్ అడ్వైజర్‌తో మాట్లాడి సరైన లోన్ ఎంపిక చేసుకోండి.


5. ఎక్కువ లోన్ అప్లికేషన్లు

ఒకేసారి అనేక బ్యాంకులలో లోన్ కోసం అప్లై చేయడం వల్ల కూడా ఇబ్బందులు వస్తాయి. ఇది మీ సిబిల్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అలాంటి క్రమంలో బ్యాంకులు మిమ్మల్ని ఆర్థికంగా అస్థిరంగా భావించవచ్చు. అందుకే ఒకటి లేదా రెండు బ్యాంకులలో మాత్రమే అప్లై చేయండి. మీ అప్లికేషన్ తిరస్కరిస్తే, కారణాలను తెలుసుకుని తర్వాత కొన్ని రోజులకు అప్లై చేయండి .

6. ఆర్థిక ప్రణాళిక లేకపోవడం

లోన్ తీసుకునే ముందు దానిని ఎలా తిరిగి చెల్లించాలనే ప్రణాళిక కూడా చాలా ముఖ్యం. బ్యాంకులు మీ ఆర్థిక స్థిరత్వాన్ని, రీపేమెంట్ సామర్థ్యాన్ని చెక్ చేస్తాయి. మీ ఆదాయం, ఖర్చుల వివరాలను తెలుసుకుంటాయి. మీ ఖర్చులు ఎక్కువగా ఉంటే కూడా లోన్ వచ్చే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. ఇవన్నీ కూడా సరిగ్గా ఉంటే మీకు లోన్ వెంటనే మంజూరు అవుతుంది.


ఇవి కూడా చదవండి

ఎటూ తేలకుండానే ముగిసిన ట్రంప్-పుతిన్ భేటీ.. తర్వాత మళ్లీ

రైల్వే టిక్కెట్లపై 20% తగ్గింపు ఆఫర్.. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 16 , 2025 | 10:37 AM