Bob Simpson Dies: ఆస్ట్రేలియన్ క్రికెట్ దిగ్గజం బాబ్ సింప్సన్ 89 ఏళ్ల వయస్సులో మృతి
ABN , Publish Date - Aug 16 , 2025 | 09:40 AM
ఆస్ట్రేలియా మాజీ టెస్ట్ కెప్టెన్, జాతీయ జట్టు మొదటి పూర్తి సమయం కోచ్ అయిన బాబ్ సింప్సన్, 89 ఏళ్ల వయస్సులో సిడ్నీలో మరణించారు. క్రికెట్ ఆస్ట్రేలియా (CA) ఈ విషాదకర వార్తను ధృవీకరించింది.
ఆస్ట్రేలియన్ క్రికెట్ దిగ్గజాల్లో ఒకరైన బాబ్ సింప్సన్ శనివారం సిడ్నీలో 89 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు (Bob Simpson Dies). మాజీ టెస్ట్ కెప్టెన్, ఆస్ట్రేలియా తొలి పూర్తి కోచ్‌గా విశేష సేవలందించిన సింప్సన్ మరణవార్తను క్రికెట్ ఆస్ట్రేలియా అధికారికంగా ప్రకటించింది. దీనిపై స్పందించిన క్రికెట్ ఆస్ట్రేలియా (CA), దక్షిణాఫ్రికాతో జరగబోయే తొలి వన్డేలో ఆట ప్రారంభానికి ముందు నిశ్శబ్దంతో, నలుపు బ్యాడ్జీలు ధరించి నివాళులు అర్పించనున్నట్లు తెలిపింది.
క్రికెట్ చరిత్రలో
రోజర్ బాడ్లీ సింప్సన్ పేరుతో జన్మించిన బాబ్, కేవలం 16 ఏళ్ల వయస్సులోనే న్యూసౌత్ వేల్స్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అడుగుపెట్టారు. తర్వాత ఆయన 62 టెస్ట్‌లు ఆడి 4,869 పరుగులు చేసి, సగటు 46.81తో 10 శతకాలు, 27 అర్ధశతకాలు నమోదు చేశారు. ఓ మ్యాచులో అత్యధిక వ్యక్తిగత స్కోరు 311 పరుగులు. 1964లో ఇంగ్లాండ్‌పై ఓ అద్భుతమైన ఇన్నింగ్స్ రూపంలో గుర్తుండిపోయింది.
నాయకత్వంలో మరో అధ్యాయం
బ్యాటింగ్ మాత్రమే కాదు, సింప్సన్ అద్భుతమైన స్లిప్స్ (110 క్యాచ్‌లు), అలాగే లెగ్ స్పిన్నింగ్ వేసి 71 వికెట్లు పడగొట్టాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఆయన 257 మ్యాచ్‌లు ఆడి 21,029 పరుగులు చేశారు. వీటిలో 60 శతకాలు, 349 వికెట్లు ఉన్నాయి. 62 టెస్ట్‌లలో 39 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన సింప్సన్, అతని భాగస్వామి బిల్ లారీతో కలిసి 382 పరుగుల ఓపెనింగ్ ఇప్పటికీ రికార్డుగా ఉంది.
1977లో వరల్డ్ సిరీస్ క్రికెట్ కారణంగా జట్టు బలహీనపడిన సమయంలో, సింప్సన్ 41 ఏళ్ల వయస్సులో రిటైర్మెంట్‌ను విడిచిపెట్టి మళ్లీ జట్టుకు నాయకత్వం వహించారు. ఆ క్రమంలో భారత్‌పై 3-2 విజయానికి జట్టు నాయకత్వం వహించడం ఒక కీలక ఘట్టంగా నిలిచింది.
విజయాల దశాబ్దం
1986 నుంచి 1996 వరకు సింప్సన్ ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు ప్రధాన కోచ్‌గా పని చేశారు. 1987 వరల్డ్ కప్ విజయం, 1989లో ఇంగ్లాండ్‌లో అశెస్ విజయాలు, 1995లో వెస్టిండీస్‌ను వారి సొంతగడ్డపై ఓడించడం వంటి గొప్ప విజయాలు ఆయన కోచ్‌షిప్‌లోనే సాధ్యం అయ్యాయి. అల్లన్ బోర్డర్‌తో కలిసి జట్టును పునర్నిర్మించిన సింప్సన్, ఒక బలమైన క్రికెట్ సంస్కృతిని ఏర్పరచడంలో కీలక పాత్ర పోషించారు.
బాబ్‌కు గౌరవాలు
1978లో మెంబర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా
2007లో ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా
1985లో స్పోర్ట్ ఆస్ట్రేలియా హాల్ ఆఫ్ ఫేమ్
2006లో ఆస్ట్రేలియన్ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్
ఇవి కూడా చదవండి
ఎటూ తేలకుండానే ముగిసిన ట్రంప్-పుతిన్ భేటీ.. తర్వాత మళ్లీ
రైల్వే టిక్కెట్లపై 20% తగ్గింపు ఆఫర్.. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి