Dengue Prevention Tips: డెంగ్యూ దాడికి చెక్ పెట్టండి.. ఈ చిట్కాలతో ఆరోగ్యంగా ఉండండి
ABN , Publish Date - Aug 17 , 2025 | 07:05 AM
సాధారణంగా వర్షాకాలంలో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ముఖ్యంగా వైరల్ డెంగ్యూ ఫీవర్ గురించి ఎక్కువగా వింటుంటాం. అసలు ఈ వ్యాధి రాకుండా ఎలా జాగ్రత్త పడాలి, వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇక్కడ చూద్దాం.
వర్షాకాలం వచ్చిందంటే చాలు చల్లని వాతావరణంతో జ్వరం బారిన పడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇదే సమయంలో మరికొంత మందికి డెంగ్యూ జ్వరం కూడా సోకుతోంది. ఇలాంటి సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. జాగ్రత్తలు పాటించడం ద్వారా జ్వరం వచ్చినా త్వరగా కోలుకోవచ్చని (Dengue Prevention Tips) వైద్యులు సూచిస్తున్నారు. అయితే అందుకోసం ఏం చేయాలి, ఎలాంటివి పాటించాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
డెంగ్యూ ఎందుకు వస్తుంది..?
డెంగ్యూ కేసులు పెరగడానికి కొన్ని కారణాలున్నాయి. వాతావరణ మార్పుల వల్ల తడి వాతావరణం ఏర్పడుతుంది. ఇది దోమలు వృద్ధి చెందడానికి అనుకూలంగా మారుతుంది. పట్టణాల్లో వేగంగా విస్తరణ జరుగుతున్నా, చెత్త నిర్వహణ సరిగా లేకపోవడంతో నీరు నిలిచే ప్రదేశాలు ఎక్కువవుతున్నాయి. దీంతో వైరస్ త్వరగా వ్యాప్తి చెందుతోంది. ఇది ముఖ్యంగా Aedes aegypti అనే దోమ కాటు వల్ల వస్తుంది. డెంగ్యూ వస్తే, జ్వరంతో పాటు ప్లేట్లెట్ కౌంట్ తగ్గడం, నీరసం, శరీరంలో నీరు తగ్గిపోవడం వంటి సమస్యలు వస్తాయి.
డెంగ్యూ నివారణకు చిట్కాలు
దోమలు ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండటం, వాటిని నియంత్రించడం.
నీరు నిలిచే కుండీలు, పాత టైర్లు, పెంపుడు జంతువుల నీటి పాత్రలను ఖాళీ చేసి, శుభ్రం చేయండి
నీటి ట్యాంకులను గట్టిగా మూసి ఉంచండి
గట్టర్లు, డ్రైనేజీలలో చెత్త లేకుండా చూసుకోండి
ఉదయం, సాయంత్రం దోమలు ఎక్కువగా ఉండే సమయంలో క్రిమిసంహారిణి క్రీమ్‌లు రాసుకోండి
బయటకు వెళ్లేటప్పుడు పొడవు చేతుల చొక్కాలు, ప్యాంట్లు ధరించండి
కిటికీలు, తలుపులకు స్క్రీన్లు ఉంచి దోమలు ఇంట్లోకి రాకుండా చూసుకోండి
డెంగ్యూ నుంచి త్వరగా కోలుకోవడం ఎలా?
ఒకవేళ డెంగ్యూ సోకినా, సరైన ఆహారం, హైడ్రేషన్‌తో రోగనిరోధక శక్తిని పెంచుకుంటే త్వరగా కోలుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. డెంగ్యూ సమయంలో ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గిపోతుందని, దాన్ని పెంచడానికి కొన్ని ఆహారాలు తీసుకోవాలన్నారు.
హైడ్రేషన్ ముఖ్యం:
అనారోగ్యంగా ఉన్నప్పుడు సూప్‌లు, గంజి, మెత్తగా చేసిన పండ్లు తీసుకోవడం మంచిది
డెంగ్యూ జ్వరంతో డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంది. అందుకే నీళ్లు, కొబ్బరి నీళ్లు, తాజా ఫలాల రసాలు ఎక్కువగా తాగాలి
విటమిన్ సీ ఎక్కువగా ఉండే నిమ్మ, ఆరెంజ్, క్యాప్సికమ్, ఆకుకూరలు వంటివి తినాలి
జింక్ ఉండే గింజలు బీన్స్, లీన్ మాంసం శరీర రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తాయి
గుడ్డు, పప్పుల వంటి ప్రోటీన్ తీసుకోవాలి.
ప్లేట్‌లెట్ కౌంట్ పెంచే ఆహారాలు:
బొప్పాయి, దానిమ్మ, కివీ వంటి పండ్లు, ఆకుకూరలు, సూప్‌లు ప్లేట్‌లెట్ కౌంట్‌ను పెంచడానికి సహాయపడతాయని డాక్టర్లు చెబుతున్నారు.
స్వీయ చికిత్సకు దూరంగా ఉండండి
డెంగ్యూ వచ్చినప్పుడు విశ్రాంతి, హైడ్రేషన్ చాలా ముఖ్యం. ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గడం వంటి సమస్యలను నివారించడానికి ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. స్వీయ చికిత్స చేయడం, ముఖ్యంగా ఇబుప్రోఫెన్ వంటి పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం రక్తస్రావం ప్రమాదాన్ని పెంచుతుంది. జ్వరం నియంత్రణకు పారాసెటమాల్ సురక్షితం, కానీ దాన్ని కూడా డాక్టర్ సలహాతోనే తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్
రైల్వే టిక్కెట్లపై 20% తగ్గింపు ఆఫర్.. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి