Share News

BC Cell President Bathula Ravi: సీఎం సహాయ నిధి పక్కదారి

ABN , Publish Date - Aug 17 , 2025 | 06:27 AM

పేదవారికి అందాల్సిన సీఎం రిలీఫ్‌ ఫండ్‌ సంపన్నులకు అందింది. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడుకు చెందిన నక్కా సూర్యకుమారి అనారోగ్య కారణాలతో సాయం కోసం సీఎంఆర్‌ఎఫ్‌కు దరఖాస్తు పెట్టుకున్నారు.

BC Cell President Bathula Ravi: సీఎం సహాయ నిధి పక్కదారి

  • ఓ విద్యాసంస్థల అధినేత భార్యకు ‘రిలీఫ్‌’

  • రూ.10 లక్షల సాయం మంజూరు

  • ఈ ఘటనపై కూటమి నేతల్లో తీవ్ర అసంతృప్తి

  • సీఎంవో దృష్టికి చేరిన వ్యవహారం

ఆకివీడు, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): పేదవారికి అందాల్సిన సీఎం రిలీఫ్‌ ఫండ్‌ సంపన్నులకు అందింది. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడుకు చెందిన నక్కా సూర్యకుమారి అనారోగ్య కారణాలతో సాయం కోసం సీఎంఆర్‌ఎఫ్‌కు దరఖాస్తు పెట్టుకున్నారు. ఆమెకు రూ.10లక్షలు మంజూరయ్యాయి. డిప్యూటీ స్పీకర్‌ రఘురామ కృష్ణరాజు చేతుల మీదుగా ఆ సొమ్మును సూర్యకుమారి కుమారుడు ఇటీవల అందుకున్నారు. సూర్యకుమారి భర్త సత్యనారాయణమూర్తికి కార్పొరేట్‌ స్థాయి విద్యా సంస్థలున్నాయని టీడీపీ నాయకుడు, బీసీ సెల్‌ పట్టణ అధ్యక్షుడు బత్తుల రవి ఆరోపిస్తున్నారు. నగర పంచాయతీ కార్యాలయం వెనుక జీ ప్లస్‌ ఫ్లోర్‌ బిల్డింగ్‌లో సుమారు 1,100 మంది విద్యార్థులు ఆ విద్యాసంస్థల్లో చదువుతున్నారని, ఈ కుటుంబానికి ముస్లిం వీధిలో మరో విద్యాసంస్థ కూడా ఉందని చెబుతున్నారు. ఆర్థికంగా స్థిరపడిన ఈ కుటుంబానికి సీఎంఆర్‌ఎఫ్‌ రావడానికి జనసేన పట్టణ ప్రధాన కార్యదర్శి కారంపూడి సుమంత్‌ కారణమని ఆయన ఆరోపించారు. ఈ మేరకు శనివారం జనసేన కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు పిల్లా బాబులుకు రవి ఫిర్యాదు పత్రం అందజేశారు. విద్యాసంస్థల అధినేత సత్యనారాయణమూర్తికి ఆదాయం (సంవత్సర ఆదాయం) కేవలం రూ.1,75,000 మాత్రమే అని ధ్రువీకరణ పత్రం రెవెన్యూ అధికారులు అందించారని ఆ ఫిర్యాదులో తెలిపారు. ధనవంతులకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ఇప్పించడంలో అధికారులను, నాయకులను సుమంత్‌ తప్పుదోవ పట్టించారన్నారు. ఈ ఫిర్యాదు జిల్లాలో ఉన్నతాధికారులు దృష్టికి కూడా తీసుకెళ్లానని తెలిపారు. కాగా, ఈ వ్యవహారమంతా సీఎంవో కార్యాలయం దృష్టికి వెళ్లినట్టు తెలిసింది.

Updated Date - Aug 17 , 2025 | 06:29 AM