MP Shashi Tharoor: ప్రధాని కలుపుగోలుతనం గొప్ప ఆస్తి
ABN, Publish Date - Jun 24 , 2025 | 05:32 AM
అసలే తనపై గుర్రుగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి మరింత ఆగ్రహం కలిగించే వ్యాఖ్యలను ఎంపీ శశిథరూర్ చేశారు. ప్రధాని మోదీని మరోసారి ప్రశంసించడం ద్వారా కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ఆయన మరింత ఇరుకునపెట్టారు.
ఇతర దేశాలను కలుపుకొనిరావడంతో ఆయనది చురుకైన, శక్తివంతమైన పాత్ర
మోదీపై కాంగ్రెస్ ఎంపీ థరూర్ పొగడ్తలు
న్యూఢిల్లీ, జూన్ 23: అసలే తనపై గుర్రుగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి మరింత ఆగ్రహం కలిగించే వ్యాఖ్యలను ఎంపీ శశిథరూర్ చేశారు. ప్రధాని మోదీని మరోసారి ప్రశంసించడం ద్వారా కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ఆయన మరింత ఇరుకునపెట్టారు. విదేశీ వ్యవహారాల్లో ప్రధాని కలుపుగోలుతనం భారత్‌కు గొప్ప ఆస్తి అని ఓ ఆంగ్ల పత్రికకు రాసిన వ్యాసంలో శశిథరూర్ అభివర్ణించారు. ఇతర దేశాలను కలుపుకొనిరావడంతో ఆయన చురుకైన, శక్తివంతమైన భూమికను పోషిస్తున్నారని ఆ వ్యాసంలో కొనియాడారు. ఈ వ్యాసాన్ని ప్రధానమంత్రి కార్యాలయం తన ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేసింది. ఆపరేషన్ సిందూర్‌కు కొనసాగింపుగా పాక్‌కు వ్యతిరేకంగా మొదలైన దౌత్యయుద్ధంలో భాగంగా ఏర్పాటుచేసిన ఏడు ఎంపీల బృందాల్లో ఒకదానికి శశిథరూర్‌ను కేంద్ర ప్రభుత్వం నాయకునిగా ఎంపిక చేసింది. సోమవారం ప్రచురించిన వ్యాసంలో తన విదేశీ అనుభవాలను థరూర్ పంచుకున్నారు. ‘‘జాతీయ సంకల్పం, వ్యక్తీకరణ శక్తి వెల్లడయిన సందర్భం అది. చాలా స్పష్టంగా ఐక్య భారత్ తన గొంతుకను వినిపించగలదని రుజువైంది. విదేశీ ప్రతినిధులను కలిసినప్పుడు మా బృందం పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత్ ప్రతిస్పందించిన తీరును వివరించింది. పాక్ కూడా ఒక బృందాన్ని అమెరికాకు పంపినప్పుడు మేం అక్కడే ఉన్నాం. అయినా, ఉగ్రవాదం, పాకిస్థాన్ విషయంలో న్యాయబద్ధమైన భారత్ వైఖరిని వాస్తవాలతోను, నిర్దిష్ట సూచనలతోను అమెరికా ప్రతినిధుల ముందు ఉంచగలిగాం. ఉగ్రవాద సంస్థలపై గట్టి నిర్ణయం తీసుకోవాలని కోరాం’’ అని శశిథరూర్ వివరించారు.
Updated Date - Jun 24 , 2025 | 05:33 AM