Jammu and Kashmir: కశ్మీరులో వరద కల్లోలం
ABN, Publish Date - Aug 15 , 2025 | 05:22 AM
జమ్మూకశ్మీరులో మేఘవిస్ఫోటం (క్లౌడ్ బర్‌స్ట)తో భారీగా ప్రాణ నష్టం సంభవించింది. కిష్ట్వార్ జిల్లాలోని మారుమూల గ్రామం చోసితిలో గురువారం హఠాత్తుగా మేఘవిస్ఫోటం జరగడంతో మెరుపు వరదలు వచ్చాయి.
భారీ మేఘ విస్ఫోటం.. మెరుపు వరదల్లో 46 మంది దుర్మరణం
200 మందికి పైగా గల్లంతు!
మృతుల్లో ఇద్దరు సీఐఎ్‌సఎఫ్ జవాన్లు
కిష్ట్వార్ జిల్లాలోని చోసితి గ్రామంలో ఘటన
మాచైల్ మాతా యాత్రికులకిది బేస్‌పాయింట్
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
వరదల్లో కొట్టుకుపోయిన భక్తుల టెంట్లు, షాపులు
120 మందిని కాపాడిన సహాయక సిబ్బంది
గాయపడ్డవారిలో 28 మంది పరిస్థితి విషమం
ఘటన అత్యంత బాధాకరం: రాష్ట్రపతి, ప్రధాని
మెరుపు వరదలకు 46 మంది మృతి!
జమ్ము, ఆగస్టు 14: జమ్మూకశ్మీరులో మేఘవిస్ఫోటం (క్లౌడ్ బర్‌స్ట)తో భారీగా ప్రాణ నష్టం సంభవించింది. కిష్ట్వార్ జిల్లాలోని మారుమూల గ్రామం చోసితిలో గురువారం హఠాత్తుగా మేఘవిస్ఫోటం జరగడంతో మెరుపు వరదలు వచ్చాయి. మాచైల్ మాత ఆలయానికి వెళ్లే యాత్రికులకు ఈ గ్రామమే బేస్ పాయింట్. ఇక్కడ యాత్రికుల కోసం లంగర్ (సామూహిక వంటశాలలు) ఏర్పాటు చేస్తారు. భక్తులు ఇక్కడే వాహనాలు వదిలి, కాలినడకన మాచైల్ మాత గుడికి వెళ్తారు. గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా మెరుపు వరదలు రావడంతో భక్తుల టెంట్లు, దుకాణాలు, వసతి సౌకర్యాలు, సెక్యూరిటీ అవుట్ పోస్టులన్నీ కొట్టుకుపోయాయి. ఈ విషాద ఘటనలో 46 మంది మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. శిథిలాలు, బురద కింద మరింత మంది చిక్కుకొని ఉంటారని భావిస్తున్నట్లు తెలిపారు. ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టి 167 మందిని కాపాడగా.. వారిలో 38 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించారు. 200 మందికి పైగా గల్లంతైనట్లు భావిస్తున్నారు. మృతుల్లో ఇద్దరు సీఐఎ్‌సఎఫ్ సిబ్బంది కూడా ఉన్నారని చెప్పారు. ఘటనా స్థలంలో ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, పోలీసులు, ఆర్మీ, స్థానిక వాలంటీర్లు ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
చోసితి గ్రామంలో ఎటుచూసినా భయానక దృశ్యాలే కనిపిస్తున్నాయి. హఠాత్తుగా వచ్చిన వరదలకు దాదాపు గ్రామమంతా తుడిచిపెట్టుకుపోయింది. మృతదేహాలు, క్షతగాత్రులతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. గత నెల 25న మొదలైన మాచైల్ మాతా యాత్రలో భాగంగా చోసితి నుంచి భక్తులు కాలినడకన 8.5 కి.మీ. మేర కొండలు ఎక్కుతూ 9500 అడుగుల ఎత్తులో ఉన్న ఈ గుడికి చేరుకోవాల్సి ఉంటుంది. కిష్ట్వార్ పట్టణానికి 90 కి.మీ. దూరంలో చోసితి ఉంటుంది. బేస్ పాయింట్‌లో మెరుపు వరదలు సంభవించిన వెంటనే కిష్ట్వార్ డిప్యూటీ కమిషనర్ పంకజ్‌కుమార్ శర్మ రంగంలోకి దిగారు. సహాయక బృందాలను అక్కడికి తరలించడంతో పాటు ఆయన స్వయంగా ఘటనా స్థలానికి వెళ్లారు. ‘‘కిష్ట్వార్‌లోని చోసితిలో మెరుపు వరదలు వచ్చాయి. మాచైల్ మాతా యాత్రకు బేస్ క్యాంప్ కావడంతో పెద్ద ఎత్తున భక్తులు ఉంటారు. భారీగా ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉంది. అధికారులు తక్షణమే రంగంలోకి దిగారు. నా కార్యాలయానికి నిరంతరం సమాచారం అందజేస్తున్నారు’’ అని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. రెండు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు ఇప్పటికే చోసితికితరలి వెళ్లాయని, అదనపు బృందాలు, హెలికాప్టర్లను సిద్ధం చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. సహాయక చర్యల్లో సైన్యాన్ని కూడా రంగంలోకి దించారు. 300 మంది సైనికులు చోసితిలో సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు అధికారులు తెలిపారు.
ఎల్జీ, సీఎంతో మాట్లాడిన అమిత్ షా
కిష్ట్వార్‌లో మెరుపు వరదల ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా జమ్మూకశ్మీరు లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ), సీఎంలతో మాట్లాడారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని చెప్పారు. కాగా, చోసితి గ్రామంలో సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయని ఎల్జీ మనోజ్ సిన్హా తెలిపారు.
మాచైల్ యాత్ర నిలిపివేత
మాచైల్ మాతా మందిరం సముద్ర మట్టానికి సుమారు 2,800 మీటర్ల ఎత్తులో ఉంది. గత నెల 25న మొదలైన ఈ యాత్రకు జమ్మూ డివిజన్ నుంచి వేల సంఖ్యలో భక్తులు వచ్చారు. ఈ పెను విషాదం నేపథ్యంలో మాచైల్ యాత్రను నిలిపివేశారు. చోసితిలో మెరుపు వరదలతో జమ్మూకశ్మీరు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలు, భక్తులకు సహాయం అందించేందుకు కంట్రోల్ రూమ్, హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేసింది. కాగా, జమ్మూకశ్మీరులోని రాజౌరి తదితర జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. రియాసి జిల్లాలోని వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే మార్గాన్ని గురువారం మూసివేశారు. వర్షాలకు తావి, చీనాబ్ తదితర నదులకు మెరుపు వరదలు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
అత్యంత విషాదకర ఘటన: రాష్ట్రపతి
జమ్మూకశ్మీరులో మెరుపు వరదల ఘటన అత్యంత విషాదకరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానిమోదీ పేర్కొన్నారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
హిమాచల్‌ప్రదేశ్‌లో కూడా..
హిమాచల్‌ప్రదేశ్‌లో కూడా భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. మేఘవిస్ఫోటంతో మెరుపు వరదలు వచ్చాయి. సిమ్లా, లాహోల్-స్పితి ప్రాంతాల్లో చాలా నిర్మాణాలు కొట్టుకుపోయాయి. జాతీయ రహదారులతో సహా 396 మార్గాలను మూసివేశారు. సిమ్లాలోని విద్యుత్తు సరఫరా కార్యాలయం కూడా దెబ్బతింది. అయితే, ప్రాణ నష్టానికి సంబంధించిన సమాచారం అందలేదని అధికారులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పోలీసుల విద్యార్హతపై.. డీజీపీ కీలక వ్యాఖ్యలు
సీఎంపై ప్రశంసలు.. ఎమ్మెల్యేను బహిష్కరించిన పార్టీ
Updated Date - Aug 15 , 2025 | 08:08 AM