ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Uttarakhand Floods: ఉత్తరాఖండ్‌లో జలప్రళయం

ABN, Publish Date - Aug 06 , 2025 | 05:35 AM

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లా ధరాలీ గ్రామాన్ని జలప్రళయం ముంచెత్తింది! మంగళవారం మధ్యాహ్నం

Uttarakhand Floods
  • 2 గంటల వ్యవధిలో రెండుసార్లు మేఘవిస్ఫోటం

  • నలుగురి మృతి.. 70 మందికి పైగా గల్లంతు

  • గల్లంతైనవారిలో 11 మంది సైనికులు

  • కొండలపై నుంచి.. ముంచెత్తిన మెరుపు వరద

  • కన్నుమూసి తెరిచేంతలో పెద్ద పెద్ద భవనాలను సైతం కూల్చేస్తూ.. విధ్వంసం సృష్టించిన వెల్లువ

  • పూర్తిగా నీట మునిగిపోయిన ధరాలీ గ్రామం

  • పది నిమిషాల్లోనే రంగంలోకి దిగిన సైన్యం

  • స్థానిక యంత్రాంగంతో కలిసి సహాయకచర్యలు

  • బాధితులను అన్నివిధాలా ఆదుకుంటాం: ప్రధాని

  • మృతదేహాల గుర్తింపునకు కెడవర్‌ జాగిలాలు

  • పర్యావరణ విధ్వంసంతోనే వరదలు: నిపుణులు

న్యూఢిల్లీ, ఆగస్టు 5: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లా ధరాలీ గ్రామాన్ని జలప్రళయం ముంచెత్తింది! మంగళవారం మధ్యాహ్నం 1.45 గంటల సమయంలో.. క్లౌడ్‌బరస్ట్‌ (మేఘ విస్ఫోటం- ఒకేచోట కుండపోతగా వర్షం కురవడం) దెబ్బకు ప్రళయవేగంతో దుంకిన గంగమ్మ (ఖీర్‌ గంగానది).. దారిలో ఉన్న చెట్టు, చేమ, బురదను కలుపుకొని కిందికి ప్రవహించింది! కొండచరియలను సైతం నుగ్గునుగ్గు చేస్తూ దూసుకొచ్చిన ఆ వెల్లువ ధాటికి గ్రామంలోని ఇళ్లు, పెద్ద పెద్ద భవనాలు పేకమేడల్లా నేలకూలాయి. గుండెలదిరేలా హోరుమనే శబ్దంతో కమ్ముకొస్తున్న జలప్రళయం నుంచి తప్పించుకునేందుకు.. ప్రజలు ప్రాణాలు అరచేత పెట్టుకుని.. పెద్దపెట్టున ఆర్తనాదాలు చేస్తూ పరుగులు తీశారు! కానీ.. కన్నుమూసి తెరిచేంతలోనే వరద బురద వారిని ముంచెత్తిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మొదటి మేఘవిస్ఫోటం జరిగిన రెండు గంటల వ్యవధిలోనే.. అదే ప్రాంతంలోని సుఖీ పర్వతప్రాంతంపై మరో మేఘవిస్ఫోటం జరిగింది. దీంతో మరోసారి కొండలమీద నుంచి నీరు ధరాలీ గ్రామాన్ని ముంచెత్తింది. అధికారిక సమాచారం ప్రకారం ఈ విలయంలో ఇప్పటిదాకా నలుగురు మరణించగా.. 11 మంది సైనికులు సహా 70 మందికి పైగా గల్లంతయ్యారు! అయితే.. మృతుల సంఖ్య భారీగా ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు. ప్రవాహంలో 20-25 హోటళ్లు కొట్టుకుపోయాయయని రాజేశ్‌ పన్వర్‌ అనే స్థానికుడు తెలిపారు. ‘‘చూస్తూండగానే ఇళ్లు, మార్కెట్లు, హోటళ్లు తుడిచిపెట్టుకుపోయాయి. ఇలాంటి విలయాన్ని నేను ఇంతకుముందెన్నడూ చూడలేదు’’ అని మరో ప్రత్యక్షసాక్షి తెలిపారు.

వరదనీరు, విరిగిపడ్డ కొండచరియల కారణంగా ఆ ప్రాంతంలోని ఐదు జాతీయరహదారులు, ఏడు రాష్ట్ర రహదారులు సహా మొత్తం 163 రహదారుల్లో రాకపోకలు నిలిచిపోయాయి. కాగా.. వరద చుట్టుముట్టిన పదినిమిషాల వ్యవధిలోనే సమీపంలో ఇండియన్‌ ఆర్మీ రంగంలోకి దిగింది. ధరాలీకి 4-5 కిలోమీటర్ల దూరంలో ఉన్న హర్షిల్‌ క్యాంప్‌ నుంచి నుంచి 150 మంది సైనికులు అక్కడికి చేరుకుని విపత్తు స్పందన చర్యలు చేపట్టారు. ముంపులో చిక్కుకుపోయిన స్థానికులను కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.ఆ తర్వాత కొద్దిసేపటికి.. ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ఐటీబీపీ) బృందాలు చేరుకున్నాయి. ఉత్తరాఖండ్‌ రాష్ట్ర విపత్తు స్పందన దళాలు, జాతీయ విపత్తు స్పందన దళాలు, ఉత్తరకాశీ జిల్లా యంత్రాంగం.. అంతా కలిపి 400 మందికిపైగానే సహాయకచర్యలో పాల్గొంటున్నారు. క్యాంపు దెబ్బతిని, 11 మంది సైనికులు గల్లంతైన క్లిష్టపరిస్థితుల్లోనూ మన సైనికులు ఎలాంటి ఒత్తిడికీ లోనుకాకుండా, దృఢనిశ్చయంతో సహాయకచర్యల్లో పాల్గొనడం వారి నిబద్ధతకు, ధైర్యానికి నిదర్శనం అని ఆర్మీ ఒక ప్రకటన ద్వారా తెలిపింది. మరోవైపు.. ధరాలీ ప్రాంతంలో మంగళవారం ఒక్కరోజే 21 సెం.మీ.వాన కురవడంతో వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. రానున్న 2-3 రోజుల్లో భారీ వర్షాలు కురిసే ముప్పుందని హెచ్చరించింది. దీంతో స్థానికులంతా బిక్కుబిక్కుమంటున్నారు. వర్షాలు, వరదల ముప్పు నేపథ్యంలో.. డెహ్రాడూన్‌, హరిద్వార్‌ సహా ఉత్తరాఖండ్‌లోని పలు జిల్లాల్లో పాఠశాలల మూసివేతకు అధికారులు ఆదేశాలిచ్చారు. ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో జూన్‌ నుంచి సెప్టెంబర్‌ దాకా భారీ వర్షాలు సహజమేగానీ.. ఇటీవలికాలంలో కొండలను నాశనం చేసి పెద్దఎత్తున కట్టడాలు నిర్మించడంతో పర్యావరణం దెబ్బతింటోందని, దాని ఫలితమే ఫ్లాష్‌ ఫ్లడ్స్‌ సంఖ్య, తీవ్రత పెరుగుతోందని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు.

గంగోత్రికి దగ్గర్లోనే..

చార్‌ధామ్‌ యాత్రలో భాగంగా.. గంగానది పుట్టినచోటు అయిన గంగోత్రికి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఈ ధరాలీ గ్రామం ఉంది. హృషీకేశ్‌ నుంచి బయల్దేరే యాత్రికులు ఉత్తరకాశీ, హర్షిల్‌, ధరాలీ మీదుగా గంగోత్రికి చేరుతారు. అలకనంద నది ఒడ్డున.. అద్భుతమైన ప్రకృతి సౌందర్యంతో విరాజిల్లే ఈ గ్రామంలోని ఇళ్లు, హోటళ్లు, ఆశ్రమాల్లో చాలా మంది యాత్రికులు బస చేస్తారు. వారికోసం అక్కడ పెద్ద సంఖ్యలో రెస్టారెంట్లు కూడా ఉంటాయి. ఈ గ్రామానికి పై నుంచి ప్రవహించే ఖీర్‌ గంగ (ఇది గంగానదికి ఉపనది. పాల నురగలా తెల్లగా ఉంటుందని అలా పిలుస్తారు) పరీవాహక ప్రాంతంలోనే మేఘవిస్ఫోటం జరిగి కుంభృష్టి కురవడంతో ఈ ప్రళయం సంభవించింది. దీంతో ధరాలీ గ్రామం పూర్తిగా నీటమునిగింది. గంగోత్రికి రోడ్డు సంబంధాలు తెగిపోయాయి. కాగా.. ఈ విలయంలో చనిపోయిన, గల్లంతైన వారి కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. ఽబాధితులను తాము అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కూడా ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌సింగ్‌ ధామీతో మాట్లాడి.. సహాయక చర్యల నిమిత్తం ఏడు బృందాలను అక్కడికి పంపారు.

ఏమిటీ క్లౌడ్‌బరస్ట్‌

కేవలం 20-30 కిలోమీటర్ల పరిధిలో.. గంట వ్యవధిలో.. కుంభవృష్టి (10 సెంటీమీటర్లు అంతకన్నా ఎక్కువ) కురిస్తే దాన్ని క్లౌడ్‌బరస్ట్‌ అంటారు. ఎక్కువగా కొండప్రాంతాల్లో జరిగితే ఈ మేఘ విస్ఫోటం ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. మంగళవారం ధరాలీని ముంచెత్తిన మెరుపువరదలే ఇందుకు రుజువు.

గంగమ్మ దర్శనంతోనే స్వర్గ ప్రాప్తి!

వరద బాధితులతో యూపీ మంత్రి దారుణ వ్యాఖ్యలు

వరద ముంపులో సర్వం కోల్పోయిన బాధితులు ఆశించేది.. ప్రభుత్వం నుంచి కాస్తంత భరోసా, బాధ్యతాయుత ప్రవర్తన! కానీ.. ఉత్తరప్రదేశ్‌లో వరదబాధితులను పరామర్శించడానికి వెళ్లిన మంత్రి అందుకు విరుద్ధంగా ప్రవర్తించారు. ‘‘మంత్రిగారూ మా ప్రాంతమంతా నీళ్లల్లో మునిగిపోయింది. మా ఇళ్లు కూలిపోయాయి. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాం.. మమ్మల్ని ఆదుకోండి’’ అని వారు వేడుకుంటే.. ‘‘గంగమ్మ తల్లి తన పిల్లల పాదాలు కడగడానికి వస్తుంది. ఆ తల్లి దర్శనంతోనే పిల్లలు నేరుగా స్వర్గానికి వెళ్లిపోతారు’’ అంటూ సందర్భం లేకుండా ఏదేదో మాట్లాడారు. ఆయన మాటలు విని.. బాధితులు నివ్వెరపోయారు. ధరాలీ గ్రామం గంగా నదీ తీరంలో లేదని, యమున ఒడ్డున ఉందని ఆ విషయం కూడా మంత్రికి తెలియదని వారు వాపోయారు.

Updated Date - Aug 06 , 2025 | 07:52 AM