Lieutenant General Rahul Singh: పాక్ మద్దతుగా భారత్‌పై ఆయుధాలు ప్రయోగించిన చైనా
ABN, Publish Date - Jul 04 , 2025 | 04:38 PM
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పాకిస్థాన్ జరిపిన దాడులకు చైనా, టర్కీలు మద్దతు ఇచ్చాయని లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ వెల్లడించారు. పాకిస్థాన్ మిలటరీ వినియోగిస్తున్న హార్డ్ వేర్‌లో 81 శాతం చైనాదేనని వివరించారు.
న్యూఢిల్లీ, జులై 04: భారత డిప్యూటీ ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన సమయంలో పాకిస్థాన్‌కు చైనా, టర్కీలు మద్దతుగా నిలిచాయన్నారు. శుక్రవారం న్యూఢిల్లీలో ఫిక్కీ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యూ ఏజ్ మిలటరీ టెక్నాలజీస్ అనే అంశంపై లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ నిర్వహించిన సమయంలో పాకిస్థాన్‌ను చైనా ఎప్పటికప్పుడు సమాయత్తం చేసిందన్నారు.
భారత్‌కు ఒక సరిహద్దు.. ఇద్దరు శుత్రువులు ఉన్నారన్నారు. కానీ నిజానికి ముగ్గురు శత్రువులు అని ఆయన వివరించారు. అందులో పాకిస్థాన్ ముందు వరుసలో ఉందని పేర్కొన్నారు. పాకిస్థాన్‌కు చైనా అన్ని విధాలుగా మద్దతు ఇస్తుందన్నారు. పాకిస్థాన్ మిలటరీ వినియోగిస్తున్న హార్డ్‌వేర్‌లో 81 శాతం చైనాకు చెందినవేనని ఈ సందర్భంగా ఆయన సోదాహరణగా వివరించారు. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతల నడుమ భారత్‌పై పాక్ నిర్వహించిన దాడుల్లో చైనా తన ఆయుధాలను పరీక్షించుకుందని చెప్పారు. అదే సమయంలో పాకిస్థాన్‌కు టర్కీ సైతం అదే తరహాలో సహాయం చేసిందన్నారు. ఈ యుద్ధంలో టర్కీ పైలట్లు నేరుగా పాల్గొన్నారని వివరించారు.
పాక్, చైనాను ఎదుర్కొవడానికి బలమైన వాయు రక్షణ వ్యవస్థ ఉండాల్సిన ఆవశ్యకతను ఈ సందర్భంగా ఆయన నొక్కి చెప్పారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాద స్థావరాలను గుర్తించి.. వాటిని ధ్వంసం చేయడంలో కీలక పాత్ర పోషించిన భారత సైనిక బలగాలను ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు. అలాగే ఈ ఆపరేషన్ సిందూర్ వల్ల కొన్ని పాఠాలను సైతం నేర్చుకున్నామని చెప్పారు. మానవ మేథస్సుతోపాటు సాంకేతిక ద్వారా లెక్కలేనంత సమాచారాన్ని సేకరించి.. ఈ దాడులు నిర్వహించామని లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ వివరించారు.
గతంలో మాత్రం ఇలా సమాచారాన్ని సేకరించడంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొన్న మాట మాత్రం వాస్తవమన్నారు. అయితే పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో 21 లక్ష్యాలను గుర్తించి.. వాటిలో తొమ్మిది స్థావరాలను ధ్వంసం చేశామన్నారు. అందుకు చివరి రోజు.. చివరి నిమిషంలో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వివరించారు. త్రివిధ దళాలు ఐక్యత కారణంగానే ఇది సాధ్యమైందన్నారు.
ఏప్రిల్ 22వ తేదీన జమ్మూ కశ్మీర్‌లోని పహల్గంలో పర్యాటకులే లక్ష్యంగా జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించారు. ఈ ఘటనకు తామే బాధ్యులమంటూ లష్కరే తోయిబాకు చెందిన ది రిసిస్టెన్స్ ఫ్రెంట్ ప్రకటించింది. దీంతో ఈ ఘటనకు కర్త, కర్మ, క్రియా అంతా పాకిస్థాన్ అని భారత్ నమ్మింది. దీంతో పాక్‌కు వ్యతిరేకంగా భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అదే సమయంలో పాక్ సైతం భారత్‌కు వ్యతిరేకంగా పలు నిర్ణయాలు తీసుకుంది. ఇక పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సిందూర్ నిర్వహించింది. ఆ క్రమంలో తొమ్మిది స్థావరాలను ధ్వంసం చేసి.. 100 మందికి పైగా ఉగ్రవాదులును హతమార్చిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
సీఎం అభ్యర్థిగా హీరో విజయ్ పేరు ప్రకటించిన టీవీకే పార్టీ
బీజేపీకి మహిళా అధ్యక్షురాలు.. రేసులో ఉంది వీరే
సిగాచి ఘటన.. మరొకరు మృతి.. ప్రమాద స్థలికి హైలెవల్ కమిటీ
Read latest National News And Telugu News
Updated Date - Jul 04 , 2025 | 05:25 PM