TVK Chief Vijay: సీఎం అభ్యర్థిగా హీరో విజయ్ పేరు ప్రకటించిన టీవీకే పార్టీ
ABN , Publish Date - Jul 04 , 2025 | 03:38 PM
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు మరికొన్ని నెలల్లో జరగనున్నాయి. అలాంటి వేళ.. టీవీకే పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం చెన్నైలో పార్టీ అధినేత విజయ్ అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. ఈ సందర్బంగా పలు తీర్మానాలు చేశారు.
చెన్నై, జులై 04: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తమిళగ వెట్రి కగళం(టీవీకే) పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా టీవీకే అధినేత, హీరో విజయ్ పేరును ప్రకటించింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే బరిలో దిగుతుందని స్పష్టం చేసింది. బీజేపీ, డీఏంకేలతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. టీవీకే పార్టీ సిద్ధాంతానికి ఈ రెండు పార్టీలు శత్రువులని పేర్కొంది.
పార్టీ అధినేత విజయ్ అధ్యక్షతన శుక్రవారం చెన్నైలో ఉన్నత స్థాయి కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా పార్టీ పలు తీర్మానాలు చేసింది. సెప్టెంబర్, డిసెంబర్ మాసాల మధ్య విజయ్ పర్యటన రాష్ట్రంలో కొనసాగుతుందని ప్రకటించింది. వచ్చే నెలలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. అలాగే గ్రామాల్లో సభలు ఏర్పాటు చేసి.. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా నేతలకు సూచించింది ఉన్నతస్థాయి కమిటీ.
ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇంగ్లీష్ భాషపై చేసిన వ్యాఖ్యలపై సైతం ఈ సందర్బంగా చర్చించారు. అలాగే తమిళనాడులో ద్వంద్వ భాషా విధానాన్ని అమలు చేసేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటామని స్పష్టం చేసింది టీవీకే. తమిళనాడుపై హిందీ, సంస్కృతం భాషను బలవంతంగా రుద్దడానికి ప్రయత్నిస్తే.. ఆ చర్యలను తమ పార్టీ అడ్డుకుంటుందని విజయ్ వెల్లడించారు.
అయితే ఎన్నికల సవరణ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టారు విజయ్. మైనార్టీ ఓట్లను తగ్గించేందుకే ఈ నిర్ణయమని పేర్కొన్నారు. అంతేకాదు.. బీజేపీ అనుకూల ఓట్లను పెంచేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో ఇది ఒక భాగమన్నారు. కాగా, 2026 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలు సభలు, సమావేశాలు నిర్వహించడమే కాకుండా.. కీలక నిర్ణయాలను హీరో విజయ్ తీసుకునే అవకాశముందని సమాచారం.
ఇవి కూడా చదవండి..
నేషనల్ మెడికల్ స్కామ్.. ఎఫ్‌ఐఆర్‌లో 36 మంది పేర్లు
బీజేపీకి మహిళా అధ్యక్షురాలు.. రేసులో ఉంది వీరే
సిగాచి ఘటన.. మరొకరు మృతి.. ప్రమాద స్థలికి హైలెవల్ కమిటీ
Read latest National News And Telugu News