CJI : వీధి కుక్కలపై సుప్రీం తీర్పును పరిశీలిస్తాం
ABN, Publish Date - Aug 13 , 2025 | 03:42 PM
న్యాయమూర్తులు జేబీ పరిడివాలా, ఆర్.మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఆగస్టు 11న ఇచ్చిన తీర్పులో ఢిల్లీ-ఎన్‌సీఆర్ అధికారులు వీధి కుక్కలన్నింటినీ శాశ్వత షెల్టర్లకు సాధ్యమైనంత త్వరగా తరలించాలని ఆదేశించింది. వీధి కుక్కలు కరవడం వల్ల రాబిస్ వ్యాధి కేసులు పెరగడం, ముఖ్యంగా పిల్లలు వీటి బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని వీధి కుక్కలను తొలగించాలంటూ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తీర్పు ఉత్తర్వులను తాము పరిశీలిస్తామని సీజేఐ (CJI) బీఆర్ గవాయ్ (BR Gavai) బుధవారంనాడు హామీ ఇచ్చారు. విచక్షణారహితంగా కమ్యూనిటీ డాగ్స్‌ను చంపకుండా గతంలో కోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని న్యాయవాది ఒకరు సీజేఐ ముందు ప్రస్తావించారు. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని బహిరంగ ప్రదేశాల్లో తిరుగాడే వీధి కుక్కలను తొలగించాలంటూ ఆగస్టు 11న కోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. న్యాయవాది సబ్మిషన్‌పై సీజేఐ స్పందిస్తూ, వేరే న్యాయమూర్తుల ధర్మాసనం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినందున ఆ తీర్పు ఉత్తర్వులను పరిశీలిస్తామని చెప్పారు.
ఆగస్టు 11న ఆదేశాలు
న్యాయమూర్తులు జేబీ పరిడివాలా, ఆర్.మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఆగస్టు 11న ఇచ్చిన తీర్పులో ఢిల్లీ-ఎన్‌సీఆర్ అధికారులు వీధి కుక్కలన్నింటినీ శాశ్వత షెల్టర్లకు సాధ్యమైనంత త్వరగా తరలించాలని ఆదేశించింది. వీధి కుక్కలు కరవడం వల్ల రాబిస్ వ్యాధి కేసులు పెరగడం, ముఖ్యంగా పిల్లలు వీటి బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. మనుషుల ప్రాణాలు ముఖ్యమని అన్నారు. వీధి కుక్కల కోసం రాబోయే ఎనిమిది నెలల్లో సుమారు 5,000 వీధి కుక్కలకు షెల్టర్లు ఏర్పాటు చేయాలని ఢిల్లీ సర్కార్‌ను కోర్టు ఆదేశించింది. షెల్టర్ల సామర్థ్యం పెంచుతూ దీర్ఘకాలిక ప్లాన్ అమలు చేయాలని సూచించింది. ప్రజా భద్రత ముఖ్యమని, ఎక్కడా వీధి కుక్కలు ఉండటానికి వీల్లేదని పేర్కొంది. ఈ చర్యలను అడ్డుకునేందుకు ఏవైనా సంస్థలు ప్రయత్నిస్తే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా హెచ్చరించింది.
కాగా, సుప్రీం తీర్పుపై పలు వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తీర్పు ఆచరణ సాధ్యం కాదని కేంద్ర మాజీ మంత్రి, జంతు హక్కుల కార్యకర్త మేనకా గాంధీ అన్నారు. ఢిల్లీలో 3 లక్షల వీధి కుక్కలు ఉన్నాయని, వీటికోసం 3 వేల షెల్టర్లు కావాలని, ఇందుకయ్యే వేల కోట్ల ఖర్చు చేసే పరిస్థితి ఢిల్లీలో ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. తీర్పు అమలు ఆచరణ సాధ్యం కాదని అన్నారు. తీర్పును సమీక్షించి, సవరణలు చేయాలని నటుడు జాన్ అబ్రహం సీజేఐకి రాసిన ఒక లేఖలో కోరారు. కోర్టు ఆదేశాలపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా మనం అనుసరిస్తున్న మానవీయ, సైన్స్ అధారిత విధానాల నుంచి వెనుకడుగు వేసినట్టు ఉందని అన్నారు. నోరులేని జీవాలు సమస్య కానేరవని పేర్కొన్నారు. షెల్టర్లు, వాక్సినేషన్, కమ్యూనిటీ కేర్‌తో ఎలాంటి క్రూరత్వం జోలికి వెళ్లకుండా వీధులను సురక్షితంగా కాపాడుకోవచ్చన్నారు. ప్రజా భద్రత, జంతు సంక్షేమం కలగలిసి ఉండాలని ఒక ట్వీట్‌లో ఆయన పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
ప్రాచీన యుగంలోకి వెళ్లినట్టుంది
రాష్ట్రంలో దశలవారీగా మద్యం దుకాణాల మూసివేత
For More National News and Telugu News
Updated Date - Aug 13 , 2025 | 03:46 PM