Share News

Supreme Court Order on Stray Dogs: ప్రాచీన యుగంలోకి వెళ్లినట్టుంది

ABN , Publish Date - Aug 13 , 2025 | 03:24 AM

ఢిల్లీలోని వీధి కుక్కలను శాశ్వతంగా వేరే ప్రాంతానికి తరలించాలని, వాటికి ప్రత్యేక ఆవాసాలను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ స్పందించారు...

Supreme Court Order on Stray Dogs: ప్రాచీన యుగంలోకి వెళ్లినట్టుంది

వీధికుక్కలపై సుప్రీంకోర్టు ఆదేశాలను ఉటంకిస్తూ రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలు

  • అంత క్రూరత్వం పనికిరాదు: ప్రియాంక

  • కనికరం లేదా: సినీ నటుల ముక్తకంఠం

  • ఆదేశాలు సవరించండి: సీజేఐకి లేఖలు

న్యూఢిల్లీ, ఆగస్టు 12: ఢిల్లీలోని వీధి కుక్కలను శాశ్వతంగా వేరే ప్రాంతానికి తరలించాలని, వాటికి ప్రత్యేక ఆవాసాలను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ స్పందించారు. ‘‘సుప్రీంకోర్టు ఆదేశాలు.. సైన్సు, మానవత్వం లేని కొన్ని దశాబ్దాల కిందటి ప్రాచీన యుగంలోకి వెళ్లినట్టున్నాయి. మన దయ, కరుణలను దూరం చేస్తున్నట్టున్నాయి.’’ అని వ్యాఖ్యానించారు. కుక్కలకు టీకాలు వేయడం, స్థానికంగానే ఆవాసాలను ఏర్పాటు చేయడంవంటి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు. ఇదే విషయంపై ఎంపీ ప్రియాంక గాంధీ స్పందిస్తూ.. కుక్కలు ఎంతో అందమైనవని, వాటి పట్ల క్రూరత్వం ప్రదర్శించాల్సిన అవసరం లేదని, వాటిని నిర్మూలించడం అంటే మూగజీవుల పట్ల భయంకరమైన క్రూరత్వాన్ని ప్రదర్శించడమేనని తెలిపారు. పట్టణాల్లో జంతువుల పట్ల ఇప్పటికే అమానుషంగా ప్రవరిస్తున్నారని, వాటిపట్ల మానవత్వం ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

మరణ శాసనం: బాలీవుడ్‌

సుప్రీంకోర్టు ఆదేశాలపై బాలీవుడ్‌ నటులు తీవ్రంగా స్పందించారు. స్వేచ్ఛలేదని వ్యాఖ్యానించారు. జాన్వీకపూర్‌, వరుణ ధవన్‌లు స్పందిస్తూ.. ‘కనికరం చూపించలేమా?’ అని వ్యాఖ్యానించారు. అలాగే సింగర్‌ చిన్మయి శ్రీపాద, నిర్మాత సిద్ధార్థ్‌ ఆనంద్‌లు స్పందిస్తూ.. ‘కుక్కలకు ఇది మరణ శాసనం.’’ అని అన్నారు. మరోనటుడు అడవి శేష్‌ స్పందిస్తూ.. ‘భారత మానవీయ, కరుణా సూత్రాలకు ఈ ఆదేశాలు విరుద్ధం.’ అని పేర్కొన్నారు. అదేవిధంగా వరుణ్‌ గ్రోవర్‌, వీర్‌దాస్‌ తదితరులు కూడా సుప్రీం ఆదేశాలను తప్పుబట్టారు. అదేవిధంగా సుప్రీంకోర్టు ఆదేశాలను పునఃసమీక్షించాలని కోరుతూ.. నటులు అడివి శేష్‌, జాన్‌ అబ్రహం సుప్రీకోర్టు ప్రదాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, ఢిల్లీ సీఎం రేఖాగుప్తాలకు లేఖలు రాశారు. ఢిల్లీ నుంచి వీధికుక్కలను శాశ్వతంగా తరలించాలన్న ఆదేశాల్లో మార్పులు చేయాలని ఆయన కోరారు.


సుప్రీం ఆవరణలో కుక్కలు కనిపించొద్దు

వీధి కుక్కల వ్యవహారంపై సుప్రీంకోర్టు మంగళవారం మరోసారి స్పందించింది. కోర్టు ఆవరణ సహా లిఫ్టుల్లోనూ కుక్కలు కనిపిస్తున్నాయని, ఇక నుంచి అవి ఆవరణలో కనిపించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. కోర్టుకు వచ్చేవారు తినగా మిగిలిపోయిన పదార్థాలను కుక్కలకు అసలు పెట్టడానికి వీల్లేదని పేర్కొంది. మిగిలిపోయిన పదార్థాలను ధ్వంసం చేయాలని, లేదా ప్యాక్‌ చేసి గట్టి మూతలు ఉన్న డస్ట్‌బిన్లలో వేయాలని సర్క్యులర్‌లో స్పష్టం చేసింది.

కుక్కలు పోతే కోతులొస్తాయ్‌: మేనకాగాంధీ

కుక్కలను సామూహికంగా తరలించడాన్ని కేంద్ర మాజీ మంత్రి, జంతు హక్కుల ఉద్యమకారిణి మేనకా గాంధీ తప్పుబట్టారు. ‘ఇది అసాధ్యం. రూ.వేల కోట్ల ఖర్చు. పర్యావరణానికి కూడా ముప్పు.’’ అని అన్నారు. ఈ సందర్భంగా ఫ్రాన్స్‌ రాజధాని ప్యారి్‌సలో 1880లో జరిగిన ఘటనను ఆమె వివరించారు. ‘‘ప్యారి్‌సలో కుక్కలు పెరిగిపోయాయని సామూహికంగా చంపేశారు. దీంతో పర్యావరణ సమతుల్యం దెబ్బతింది. ఎలుకలు పెరిగిపోయాయి. దీనివల్ల ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. ఇప్పుడు ఢిల్లీలో కుక్కలను లేకుండా చేస్తే కోతులు మూగుతాయి. ఇది నా అనుభవం. అప్పుడు ఏం చేస్తారు?.’’ అని ప్రశ్నించారు.


ఇవి కూడా చదవండి

గతేడాది 2.17 లక్షల ఫేక్ కరెన్సీ నోట్ల పట్టివేత.. లోక్‌సభలో కేంద్ర మంత్రి వెల్లడి

రిజిస్టర్డ్ పోస్టు సేవ నిలిపివేత అంటూ వార్తలు.. అసలు విషయం ఏంటంటే..

For More National News and Telugu News

Updated Date - Aug 13 , 2025 | 03:24 AM