BJP: ఈపీఎస్ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం..
ABN, Publish Date - Jun 12 , 2025 | 11:20 AM
రాష్ట్రంలో రానున్న శాసనసభ ఎన్నికల అనంతరం అన్నాడీఎంకే అధినేత ఈపీఎస్ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ స్పష్టం చేశారు. తిరునల్వేలి జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడాకగ.
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్
చెన్నై: రాష్ట్రంలో రానున్న శాసనసభ ఎన్నికల అనంతరం అన్నాడీఎంకే అధినేత ఈపీఎస్(EPS) నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్(BJP State President Nayinar Nagendhar) స్పష్టం చేశారు. తిరునల్వేలి జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... తమ కూటమిలో పలు పార్టీలు చేరే అవకాశం ఉందని, దానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఏది బలమైన పార్టీయో తెలుస్తుందన్నారు. తమదే బలమైన కూటమి అని చెబుతున్న డీఎంకే, ఒంటరిగా పోటీచేసేందుకు సిద్ధమేనా అని ప్రశ్నించారు.
మదురైలో జరుగనున్న మురుగన్ మహానాడుకు సుమారు 4 లక్షల మందికి పైగా వచ్చే అవకాశముందని తెలిపారు. ఈ మహానాడులో డీఎంకే, అన్నాడీఎంకే సహా వివిధ పార్టీల నుంచి మురుగన్ భక్తులు పాల్గొంటారని తెలిపారు. గత 11 సంవత్సరాల్లో రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్లను ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం అందజేసిందని, ఈ విషయాన్ని ప్రజలకు తెలినివ్వకుండా డీఎంకే ప్రభుత్వం వారిని మభ్యపెడుతున్నారని ఆరోపించారు. తమిళ భాషకు మోదీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, తిరుక్కురళ్‌ను 63 భాషల్లోకి అనువదించి ప్రపంచం మొత్తానికి తీసుకెళ్లిన ఘనత ప్రధాని మోదీకి దక్కుతుందన్నారు.
బీజేపీ కూటమిలోకి డీఎంకే కూటమి పార్టీ: కేంద్రమంత్రి మురుగన్
ప్రస్తుతం డీఎంకే కూటమిలో వున్న ఓ పార్టీ త్వరలో బీజేపీ కూటమిలోకి వస్తుందని కేంద్రమంత్రి ఎల్.మురుగన్ వెల్లడించారు. ఈ విషయమై కేంద్రమంత్రి మాట్లాడుతూ... మాజీ ప్రధానమంత్రి వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ బీజేపీ కూటమిలో ఉందని తెలిపారు. డీఎంకే కూటమి త్వరలోనే విచ్ఛిన్నమవుతుందని, రానున్న శాసనసభ ఎన్నికల్లో ఆ కూటమికి ఘోరపరాజయం తప్పదన్నారు. కొత్తగా కూటమిలో చేరే పార్టీలపై వేచి ఉండాలని, అన్నీ ఇప్పుడే చెబితే రాజకీయాల్లో అంచనాలు ఉండవని కేంద్రమంత్రి సరదాగా వ్యాఖ్యానించారు.
ఈ వార్తలు కూడా చదవండి.
Read Latest Telangana News and National News
Updated Date - Jun 12 , 2025 | 11:41 AM