ADR Petition: బిహార్‌లో ఓటర్ల జాబితాపై సమీక్షపై సుప్రీంకోర్టులో ఏడీఆర్ పిటిషన్
ABN, Publish Date - Jul 06 , 2025 | 02:29 AM
కేంద్ర ఎన్నికల కమిషన్ బిహార్‌లో నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సమీక్ష స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ రాజ్యాంగ వ్యతిరేకమని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ ఏడీఆర్ స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దానివల్ల లక్షలాది మంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోతారని తెలిపింది.
న్యూఢిల్లీ, జూలై 5 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ఎన్నికల కమిషన్ బిహార్‌లో నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సమీక్ష (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-ఎస్ఐఆర్) రాజ్యాంగ వ్యతిరేకమని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్(ఏడీఆర్) స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దానివల్ల లక్షలాది మంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోతారని తెలిపింది. గతేడాది అక్టోబర్ 29 నుంచి ఈ ఏడాది జనవరి 6 తేదీల మధ్య ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఇప్పటికే జరిగిపోయిందని గుర్తు చేసింది. వలస వెళ్లిన వారి ఓట్లు, మరణించిన వారి ఓట్ల విషయంలో తలెత్తిన సమస్యలను పరిష్కరించారని తెలిపింది.
ఎన్నికలు మరో మూడు, నాలుగు నెలల్లో ఉండగా ఇంత తక్కువ సమయంలో మరోసారి విస్తృత సమీక్ష జరపాలంటూ జూన్ 24న ఆదేశాలు ఇచ్చిందని, ఇందుకు ఎలాంటి కారణాలు లేవని ఏడీఆర్ అభిప్రాయపడింది. తన పౌరసత్వం గురించి మాత్రమే కాకుండా తన తల్లిదండ్రుల పౌరసత్వాన్ని కూడా పత్రాల ద్వారా నిరూపించాల్సి ఉంటుందని, లేకపోతే ఓటరు పేరును జాబితా నుంచి తొలగిస్తారని తెలిపింది. తమ అంచనా ప్రకారం ఈ ప్రక్రియ మూలంగా ఎస్సీ, ఎస్టీలు, వలస కార్మికులు వంటి అణగారిన వర్గాలకు చెందిన మూడు కోట్ల మంది తమ ఓటు హక్కును కోల్పోతారని ఏడీఆర్ తన పిటిషన్‌లో ఆందోళన వ్యక్తం చేసింది.
Updated Date - Jul 06 , 2025 | 02:38 AM