US China Economic Agreement: వాణిజ్య యుద్ధానికి విరామం
ABN, Publish Date - May 13 , 2025 | 04:17 AM
జెనీవాలో జరిగిన చర్చలతో అమెరికా, చైనా వాణిజ్య యుద్ధానికి తాత్కాలిక విరామం ప్రకటించాయి. రెండూ దేశాలు 90రోజుల సంధి ఒప్పందానికి వచ్చి ప్రతీకార సుంకాలను 115 శాతం తగ్గించాయి.
ప్రతీకార సుంకాల తగ్గింపుపై అమెరికా, చైనా ఒప్పందం
ద్వైపాక్షిక దిగుమతులపై 115 శాతం టారిఫ్‌ల తగ్గింపు
90 రోజుల పాటు కొనసాగించాలని నిర్ణయం
ఇక నుంచి చైనాపై 30శాతం..
అమెరికాపై 10శాతం సుంకాలు
జెనీవా, మే 12: వాణిజ్య యుద్ధానికి అమెరికా, చైనా విరామం ప్రకటించాయి. ప్రతీకార సుంకాల తగ్గింపుపై జెనీవాలో రెండు రోజుల పాటు, ఇరు దేశాల మధ్య జరిగిన చర్చలు ఫలించాయి. ఇటీవలి కాలంలో పరస్పరం విధించుకున్న ప్రతీకార సుంకాలను ఉపసంహరించుకోవాలని రెండు దేశాలూ ఓ ఒప్పందానికి వచ్చాయి. ఒప్పందం మేరకు అమెరికా, చైనా తమ ద్వైపాక్షిక దిగుమతులపై చెరో 115శాతం సుంకాలను తగ్గించాయి. అంతే కాకుండా వాణిజ్య యుద్ధానికి 90రోజుల పాటు సంధి ప్రకటించాయి. రెండు దేశాలూ సుంకాలను పెంచవద్దని నిర్ణయించాయి. ఈ 90రోజుల వ్యవధిలో ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్య వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోనున్నారు. ఈ మేరకు అమెరికా, చైనా వాణిజ్య ప్రతినిధులు సోమవారం ప్రకటన చేశారు. ఈ ప్రకటనతో అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. ప్రతీకార సుంకాల తగ్గింపుపై అమెరికా, చైనా వాణిజ్య ప్రతినిధులు రెండు రోజుల పాటు జెనీవాలో చర్చలు జరిపారు. ఒప్పందం కుదిరిన అనంతరం అమెరికా వాణిజ్య ప్రతినిధులు జేమిసన్ గ్రీర్, స్కాట్ బెస్సెంట్ జెనీవాలోనే విలేకరులతో మాట్లాడారు. చైనా దిగుమతులపై ప్రస్తుతం 145ు టారిఫ్ విధిస్తుండగా దాన్ని 30శాతానికి తగ్గించడానికి(అంటే 115 శాతం కోత) అమెరికా అంగీకరించిందని చెప్పారు. రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధంతో సరుకు రవాణా పూర్తిగా నిలిచిపోయిందని, ఇది రెండు దేశాలకూ మంచిది కాదని పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య మరింత సమన్వయమైన, సంతులిత వాణిజ్యం అవసరమని వారు అభిప్రాయపడ్డారు. మరోవైపు, చైనా ప్రస్తుతం అమెరికా దిగుమతులపై 125శాతం టారిఫ్ విధిస్తుండగా, దాన్ని 10శాతానికి తగ్గించడానికి అంగీకరించింది. అంటే, చైనా కూడా 115శాతం టారిఫ్ తగ్గించడానికి ఒప్పుకొంది.
అయితే ఇందులో 91శాతం తగ్గింపు వెంటనే అమల్లోకి వస్తుంది. మరో 24శాతం టారిఫ్‌ను దశల వారీగా 90రోజుల్లోపు తగ్గించనున్నారు. ఈ మేరకు చైనా వాణిజ్యశాఖ ప్రకటన విడుదల చేసింది. అమెరికా ఇకనైనా ఏకపక్షంగా టారి్‌ఫలను పెంచబోదని ఆశిస్తున్నట్లు అందులో పేర్కొంది. ప్రతీకార సుంకాల తగ్గింపుపై రెండు దేశాలు వేర్వేరు ప్రకటనలతో పాటు సంయుక్త ప్రకటన కూడా విడుదల చేశాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జనవరిలో చైనాపై ట్రేడ్ వార్ ప్రకటించారు. చైనా నుంచి వచ్చే వస్తువులపై టారి్‌ఫను దశలవారీగా 145శాతానికి పెంచారు. దీనికి ప్రతిగా చైనా అమెరికా వస్తువులపై టారి్‌ఫను 125శాతానికి పెంచింది. రెండు దేశాల మధ్య ట్రేడ్ వార్‌తో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మందగమనం చోటుచేసుకుంటుందని ప్రపంచ మార్కెట్లు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలోనే ఇరుదేశాల ఉన్నతస్థాయి వాణిజ్య ప్రతినిధుల మధ్య సమావేశం జరిగింది.
Updated Date - May 13 , 2025 | 04:18 AM