Trump Economic Policies: ట్రంప్ ఆర్థిక విధానాలు త్వరలోనే కూలిపోతాయ్.. అమెరికా ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు
ABN, Publish Date - Aug 09 , 2025 | 10:22 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న విధానాలు దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా వాణిజ్య సుంకాల విషయంలో ఆయన తీసుకున్న విధానాలు తీవ్ర విమర్శలకు గురయ్యాయి. తాజాగా, ప్రఖ్యాత ఆర్థికవేత్త, జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ స్టీవ్ హ్యాంకే ట్రంప్ నిర్ణయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలతో సొంత దేశంలో కూడా వ్యతిరేకత వస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా అమెరికన్ ఆర్థికవేత్త, జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ స్టీవ్ హ్యాంకే ట్రంప్ సుంకాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ట్రంప్ సుంకాల విధానంతో తనను తాను నాశనం చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ట్రంప్ తీసుకున్న సుంకాల నిర్ణయం పూర్తిగా చెత్త అని, ఇసుకపై నిర్మితమైనవని ఆయన విమర్శించారు. ఇది పూర్తిగా తప్పు అని ఆయన స్పష్టం చేశారు. ట్రంప్ విధానాలు అమెరికా ఆర్థిక వ్యవస్థకు మేలు చేసేందుకు కాదు, మరింత నష్టమే కలిగిస్తాయని హ్యాంకే అన్నారు.
అత్యధిక సుంకం
ఇదే సమయంలో అమెరికా, భారత్ మధ్య సుంకాల విషయంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. భారతదేశం రష్యా నుంచి చమురు దిగుమతి చేస్తోందన్న కారణంతో, ట్రంప్ భారత వస్తువులపై 25 శాతం అదనపు సుంకం విధించి, ఆ తర్వాత దాన్ని 50 శాతానికి రెట్టింపు చేశారు. దీంతో భారతదేశం, బ్రెజిల్‌తో పాటు అత్యధిక సుంకం (50%) చెల్లించే దేశాల జాబితాలో చేరింది. ఈ సందర్భంగా నెపోలియన్ సలహా గుర్తుంచుకోవాలని ప్రొఫెసర్ హ్యాంకే ప్రస్తావించారు. శత్రువు తనను తాను నాశనం చేసుకుంటున్నప్పుడు జోక్యం చేసుకోవద్దని ఆయన సూచించారు.
వాణిజ్య లోటుకు కారణం..
భారత ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఈ విషయంలో ఓపికగా ఉండాలని, ట్రంప్ ఆర్థిక విధానాలు త్వరలోనే కూలిపోతాయన్నారు. ట్రంప్ సుంకాల విధానం ఇసుక రాతిపై నిర్మితమైందని, ఇది ఎక్కువ కాలం నిలబడదని అభిప్రాయం వ్యక్తం చేశారు. అమెరికాలో వాణిజ్య లోటు భారీగా ఉండటానికి ప్రధాన కారణం, అమెరికన్ల ఖర్చు వారి జాతీయ ఉత్పత్తి కంటే ఎక్కువగా ఉండటమేనని హ్యాంకే వివరించారు. ట్రంప్ ఆర్థిక విధానాలు పూర్తిగా తప్పని, ఇవి ఆర్థిక శాస్త్రానికి వ్యతిరేకమని ఆయన అన్నారు.
రష్యా, చైనా స్పందన..
మరోవైపు భారతదేశం ఈ సుంకాల విధానాన్ని అన్యాయం, హేతుబద్ధం కానిదని ఖండించింది. ఈ నిర్ణయం టెక్స్‌టైల్, సముద్ర ఉత్పత్తులు, లెదర్ ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రధాని మోదీ దీనిపై స్పందించారు. ఆర్థిక ఒత్తిడి ముందు భారత్ వెనక్కి తగ్గదన్నారు.
రష్యా, చైనా కూడా ట్రంప్ నిర్ణయాన్ని తప్పుపట్టాయి. రష్యా ప్రతినిధి డిమిత్రీ పెస్కోవ్ ఇతర దేశాలతో వాణిజ్య సంబంధాలను తెంచుకోమని బెదిరించడం చట్టవిరుద్ధమన్నారు. చైనా రాయబారి జు ఫీహాంగ్ సుంకాలను ఆయుధంగా ఉపయోగించడం ఐక్యరాష్ట్ర సమితి నిబంధనలకు వ్యతిరేకమని వెల్లడించారు. ఇది ప్రపంచ వాణిజ్య సంస్థ నియమాలను ఉల్లంఘిస్తుందని విమర్శించారు.
ఇవి కూడా చదవండి
ఉద్యోగం పోయిన తర్వాత లోన్ EMIలు చెల్లించాలా? మారటోరియం?
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 09 , 2025 | 10:29 AM