South Africa: దక్షిణాఫ్రికాలో కాల్పుల కలకలం.. 9 మంది మృతి
ABN, Publish Date - Dec 21 , 2025 | 12:44 PM
దక్షిణాఫ్రికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. తాజా ఘటనలో 9 మంది మరణించారు. మరో 10 మంది గాయపడ్డారు.
ఇంటర్నెట్ డెస్క్: దక్షిణాఫ్రికా(South Africa)లో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. జోహెన్నెస్‌బర్గ్(Johannesburg ) ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున గుర్తు తెలియని ముష్కరులు జరిపిన ఈ కాల్పుల్లో 9 మంది మృతి చెందారు. ఆ దేశంలో ఈ నెల 6న ఇదే తరహాలో ప్రిటోరియా(Pretoria) సమీపంలో కాల్పులు జరగ్గా.. తాజా ఘటన రెండోది. ఈ ఘటనతో అక్కడ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు అధికారులు.
జోహెన్నెస్‌బర్గ్ శివారులోని బంగారు గనుల ప్రాంతం బెకర్స్‌డాల్(Bekkersdal) టావెర్న్ టౌన్‌షిప్‌లో ఈ దారుణం చోటు చేసుకుందని అక్కడి అధికారులు వెల్లడించారు. సుమారు డజను మందితో కూడిన గుంపు ఈ కాల్పులకు తెగబడగా.. ముగ్గురు చిన్నారులు సహా 9 మంది చనిపోయారని, మరో 10 మంది గాయపడ్డారని పేర్కొన్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నాడమని, వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. అయితే.. ఈ కాల్పులకు కచ్చితమైన కారణాలేవీ తెలియరాలేదని వారు అన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు స్పష్టం చేశారు.
రెండు వాహనాల్లో అక్కడకు చేరుకున్న దుండగులు.. తొలుత ఓసారి కాల్పులు జరిపారు. దీంతో అక్కడి ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురై పరుగులు తీశారు. పారిపోయేందుకు ప్రయత్నించగా.. మరోసారి కాల్పులకు దిగారు. అయితే.. అక్రమంగా మద్యం విక్రయాలు జరుగుతున్న ప్రాంతంలోనే ఈ కాల్పులు జరిగాయని అధికారులు పేర్కొన్నారు. ఏప్రిల్, సెప్టెంబర్ నెలల మధ్యలో రోజుకు సగటున 63 మంది ప్రాణాలు కోల్పోయారని అక్కడి నివేదికలు వెల్లడించాయి.
ఇవీ చదవండి:
ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో పరిమితంగా ట్రంప్ ప్రస్తావన.. విమర్శల వెల్లువ
కెనడా జనాభాలో తగ్గుదల.. 1946 తరువాత తొలిసారిగా..
Updated Date - Dec 21 , 2025 | 12:46 PM