Jeffrey Epstein: ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో పరిమితంగా ట్రంప్ ప్రస్తావన.. విమర్శల వెల్లువ
ABN , Publish Date - Dec 20 , 2025 | 09:11 AM
ఇటీవల విడుదలైన ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ట్రంప్ ప్రస్తావన తక్కువగా ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్ చీకటి కోణం జనాలకు తెలియకుండా చేస్తున్నారంటూ డెమాక్రాట్‌లు విమర్శలు ఎక్కుపెడుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్‌స్టీన్ కేసు అమెరికాలో కలకలం రేపుతోంది. అమెరికా చట్టసభల ఆదేశాల మేరకు న్యాయశాఖ శుక్రవారం ఈ కేసుకు సంబంధించిన వేల కొద్దీ డాక్యుమెంట్స్‌ను విడుదల చేసింది. అయితే, ఈ డాక్యుమెంట్స్‌లో ట్రంప్ ప్రస్తావన పరిమితంగా ఉండటంతో ప్రస్తుతం విమర్శలు రేగుతున్నాయి. ట్రంప్‌ను ఆయన రాజకీయ ప్రత్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు (Epstein Files Trump name Redacted).
న్యూయార్క్ టైమ్స్ కథనాల ప్రకారం, ఈ డాక్యుమెంట్స్‌లో ట్రంప్ పేరు ప్రస్తావన చాలా పరిమితంగా ఉంది. ఇక ఫొటోల్లోని కొందరు మహిళల ముఖాలు కనబడకుండా మసకగా మార్చారు. ఇతర ఫొటోల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్ కూడా ఉండటంతో పెద్ద దుమారం రేపుతోంది. స్విమ్మింగ్ పూల్‌లో ఈతకొడుతున్నట్టు, ఓ బాత్ టబ్‌లో స్నానం చేస్తున్నట్టు ఉన్న బిల్‌క్లింటన్ ఫొటోలు ప్రస్తుతం అమెరికాలో చర్చనీయాంశంగా మారాయి. మరో చిత్రంలో బిల్ గేట్స్ ఓ అమ్మాయితో కలిసి ఫొటో దిగిన వైనం కూడా కలకలం రేపుతోంది.
రాబోయే వారాల్లో మరిన్ని డాక్యుమెంట్స్ విడుదల చేస్తామని డిప్యుటీ అటార్నీ జనరల్ తెలిపారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతున్న ఉదంతాల్లో బాధితుల వివరాలు, ఫొటోలను దాచిపెట్టామని అన్నారు. ఈ ఘటనపై శ్వేతసౌధం కూడా స్పందించింది. ప్రపంచంలో ఏం జరిగినా పట్టనట్టు క్లింటన్ ఎలా రిలాక్స్ అవుతున్నాడో చూడండి అని శ్వేత సౌధం ట్వీట్ చేసింది. మరోవైపు, డెమాక్రటిక్ పార్టీ నేతలు ట్రంప్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ట్రంప్‌ను కాపాడుకునేందుకు డాక్యుమెంట్స్‌లో ఆయన ప్రస్తావనను పరిమితం చేశారంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. ట్రంప్ గతంలోని చీకటి కోణాన్ని ప్రజలకు కనబడకుండా చేస్తున్నారని ఆరోపించారు.
ఇవీ చదవండి:
కెనడా జనాభాలో తగ్గుదల.. 1946 తరువాత తొలిసారిగా..
మరిన్ని ఉక్రెయిన్ భూభాగాలను లాగేసుకుంటాం: పుతిన్ వార్నింగ్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి