Share News

Putin: మరిన్ని ఉక్రెయిన్ భూభాగాలను లాగేసుకుంటాం: పుతిన్ వార్నింగ్

ABN , Publish Date - Dec 18 , 2025 | 07:37 AM

అమెరికా ప్రతిపాదిత శాంతి ఒప్పందానికి ఐరోపా నేతలు అంగీకరించాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ తేల్చి చెప్పారు. ఐరోపా నేతలు పందిపిల్లలని, అనవసర భయాలు రేకెత్తిస్తున్నారని ఎద్దేవా చేశారు.

Putin: మరిన్ని ఉక్రెయిన్ భూభాగాలను  లాగేసుకుంటాం: పుతిన్ వార్నింగ్
Vladimir Putin

ఇంటర్నెట్ డెస్క్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధవారం ఐరోపా నేతలపై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. వారు పంది పిల్లలు అంటూ ఎద్దేవా చేశారు. రష్యా ఏదోక రోజు నాటో కూటమి దేశాలపై కూడా దాడి చేస్తుందనే అనవసర భయాలను రేకెత్తిస్తున్నారని విమర్శించారు. అమెరికా ప్రతిపాదిక శాంతి ఒప్పందానికి మద్దతు తెలపకపోతే మరిన్ని ఉక్రెయిన్ భూభాగాలను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. రక్షణ శాఖ వార్షిక సమావేశాల్లో ఈ కామెంట్స్ చేశారు (Putin Calls European Leaders Piglets).

ఈ సందర్భంగా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడుతూ రష్యా సేనలు అన్ని వైపుల నుంచి ఉక్రెయిన్‌లోకి చొచ్చుకెళుతున్నాయని అన్నారు. దౌత్యం లేదా బలప్రయోగంతోనైనా చారిత్రక ప్రాధాన్య ప్రదేశాలకు ఉక్రెయిన్ నుంచి విముక్తి కల్పిస్తామని తేల్చి చెప్పారు. అమెరికా ప్రతిపాదిక శాంతి ఒప్పందంపై పురోగతి స్తంభించిపోయిన నేపథ్యంలో పుతిన్ ఈ హెచ్చరికలు జారీ చేశారు.


ఇదిలా ఉంటే.. యుద్ధం ముగింపు దిశగా అమెరికా ఇటీవల రష్యాతో పాటు ఉక్రెయిన్, ఐరోపా నేతలతో వేర్వేరుగా చర్చలు జరిపింది. అయితే, శాంతి ఒప్పందంలో భాగంగా తన భూభాగాలు కోల్పోవాల్సి రావడంపై ఉక్రెయిన్‌తో పాటు ఇతర ఐరోపా నేతలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ భద్రతకు మరిన్ని రక్షణలు కావాలని ఉక్రెయిన్ పట్టుబడుతోంది. పాశ్చాత్య దేశాల ఒత్తిడి ఉన్నప్పటికీ తాము మాత్రం తమ ప్రణాళికలతో యథావిధిగా ముందుకు సాగుతామని పుతిన్ తేల్చి చెప్పారు. ఇక రక్షణ శాఖ మంత్రి ఆండ్రె బెలోసోవ్ మాట్లాడుతూ వచ్చే ఏడాది దాడుల తీవ్రత పెంచుతామని హెచ్చరించారు. ఈ ఏడాది దేశ జీడీపీలో 5.1 శాతం మొత్తాన్ని యుద్ధానికి కేటాయించామని కూడా తెలిపారు.

అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, క్రిమియాతో పాటు ఉక్రెయిన్‌లోని సుమారు 19 శాతం భూభాగం ప్రస్తుతం రష్యా ఆధీనంలో ఉంది. డోన్‌బాస్, ఖెర్సన్, జెపోరిజియా ప్రాంతాలు అనేకం రష్యా ఆధీనంలోకి వెళ్లాయి. ఇవన్నీ ఇకపై తమ భూభాగాలే అని రష్యా ఇప్పటికే ప్రకటించుకున్నా ఉక్రెయిన్ మాత్రం ఈ వాదనలను తోసిపుచ్చుతోంది.


ఇవీ చదవండి:

పాక్ గగనతలంలోకి భారత్ విమానాల నిషేధం.. జనవరి 23 వరకూ పొడిగింపు

మరో 7 దేశాల పర్యాటకులపై అమెరికా నిషేధం!

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 18 , 2025 | 08:12 AM