Trump Travel Ban: మరో 7 దేశాల పర్యాటకులపై అమెరికా నిషేధం!
ABN , Publish Date - Dec 17 , 2025 | 07:46 AM
వివిధ దేశాలపై విధిస్తున్న పర్యాటక నిషేధాన్ని అమెరికా ప్రభుత్వం తాజాగా విస్తరించింది. ఈ జాబితాలో కొత్తగా మరో 7 దేశాలను చేర్చింది. జనవరి 1 నుంచి ఈ నిషేధాజ్ఞలు అమల్లోకి రానున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం పర్యాటక నిషేధాన్ని మరికొన్ని దేశాలకు విస్తరించారు. మరో 7 దేశాల వారు అమెరికాకు రాకూడదంటూ నిషేధాజ్ఞలు జారీ చేశారు. జాతీయ భద్రత, ప్రజాభద్రత, వీసా ఉల్లంఘనలు తదితర కారణాలతో ఈ నిషేధం విధిస్తున్నట్టు తెలిపారు. బర్కీనో ఫాసో, మాలీ, నైజర్, సౌత్ సుడాన్, సిరియా, లావోస్, సియేరా లియోన్‌పై విధించిన ఈ ఆంక్షలు జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. పాలస్తీనా అథారిటీ జారీ చేసిన డాక్యుమెంట్స్ ఉన్న వారికి కూడా ఈ నిషేధం వర్తిస్తుంది.
వీటితో పాటు మరో 11 దేశాలకు పాక్షిక నిషేధాన్ని అమెరికా ప్రభుత్వం విధించింది. అయితే, ఈ ఆంక్షల నుంచి తుర్క్‌మెనిస్థాన్‌కు మాత్రమే స్వల్ప ఊరట లభించింది. తుర్క్‌మెనిస్థాన్ పౌరులకు వలసేతర వీసాల జారీపై గతంలో విధించిన నిషేధాన్ని ట్రంప్ ప్రభుత్వం తాజాగా తొలగించింది (US Travel Ban Extended).
పర్యాటక నిషేధాల విస్తరణను అమెరికా ప్రభుత్వం సమర్ధించుకుంది. ఆయా దేశాల్లో పెరుగుతున్న ఉగ్రవాదం, అంతర్గత కుమ్ములాటలు, వీసా నిబంధనల ఉల్లంఘనలే నిషేధాజ్ఞలకు కారణమని పేర్కొంది. విదేశీయులపై పూర్తి తనిఖీలు సాధ్యం కాని పక్షంలో వీసాలను జారీ చేయబోమని స్పష్టం చేసింది. ఇలాంటి వారితో ముప్పు పొంచి ఉంటుందని ప్రకటించింది. నిషేధిత జాబితాలోని దేశాల్లో అవినీతి, పౌర డాక్యుమెంట్స్‌లో లోపాలు, జనన ధ్రువీకరణలో లోటుపాట్లు వంటి కారణాలతో వీసా జారీకి పూర్తిస్థాయి తనిఖీలు సాధ్యం కావడం లేదని పేర్కొంది. అయితే, అమెరికాలో శాశ్వత నివాసార్హత ఉన్న వారు, ఇతరత్రా వీసాలు ఉన్న వ్యక్తులు, దౌత్యవేత్తలు, క్రీడాకారులు, అమెరికా ప్రయోజనాలకు కీలకమైన వ్యక్తులపై ఈ నిషేధం వర్తించదని కూడా ప్రభుత్వం పేర్కొంది.
ఇవీ చదవండి:
నిధుల విడుదలకు కఠిన షరతులు.. పాక్‌కు చుక్కలు చూపిస్తున్న ఐఎమ్ఎఫ్
భారత్‌కు వెళ్లొద్దు.. హెచ్-1బీ వీసాదారులకు ఇమిగ్రేషన్ లాయర్‌ల సూచన
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి