Share News

Donald Trump : ట్రంప్ ఎత్తుగడ

ABN , Publish Date - Feb 08 , 2025 | 06:14 AM

ఆ మురికివాడలన్నింటినీ నేలమట్టం చేసి, పేదజనాలను తరిమికొట్టి అక్కడ ఒక మహాద్భుతమైన బీచ్‌ రిసార్ట్‌ కడతానంటున్నారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌. అచ్చంగా ఇవే మాటలు కాకున్నా, గాజా గురించి ఈ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి అంతిమంగా చెప్పింది ఇదే.

Donald Trump : ట్రంప్ ఎత్తుగడ

ఆ మురికివాడలన్నింటినీ నేలమట్టం చేసి, పేదజనాలను తరిమికొట్టి అక్కడ ఒక మహాద్భుతమైన బీచ్‌ రిసార్ట్‌ కడతానంటున్నారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌. అచ్చంగా ఇవే మాటలు కాకున్నా, గాజా గురించి ఈ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి అంతిమంగా చెప్పింది ఇదే. గాజా నుంచి పాలస్తీనియన్లను ఖాళీచేయించడం, పొరుగు దేశాల్లో శాశ్వతంగా స్థిరపరచడం, హమాస్‌–ఇజ్రాయెల్‌ యుద్ధం వల్ల శరణార్థులుగా మారి పొరుగు దేశాలకు పోయినవారిని ఇక వెనక్కురానివ్వకపోవడం వంటివి ఆయన మెదడులో పుట్టిన అద్భుతమైన ఆలోచన. పాలస్తీనియన్లను తరమడానికి అవసరమైతే అమెరికా సైన్యాన్ని కూడా వాడతానని ట్రంప్‌ ముందే చెప్పారు కనుక, గాజాను అలా స్వచ్ఛందంగా ఖాళీచేసిపోయాక, వారి జన్మభూమిని ఏ విధంగా అమెరికా వశం చేయాలో ఇజ్రాయెల్‌ ప్రధాని చూసుకుంటారు. మందుపాతరలతో, మారణాయుధాలతో, మాంసపు ఖండాలతో నిండివున్న ఆ రుధిరక్షేత్రాన్ని శుభ్రం చేయించి దానిని ఓ అద్భుతమైన బీచ్‌ రిసార్టుగా అమెరికా తీర్చిదిద్దుతుంది. అది కేవలం విందువినోదాలను మాత్రమే పంచుతుందని సామాన్యజనం భ్రమపడతారని ట్రంప్‌కు తెలుసు. కాబట్టి, ఉపాధి అవకాశాలు పెంచుతుందని కూడా ఆయన గుర్తుచేశారు. ఇతరులతో పాటుగా అక్కడ పాలస్తీనా పేదలు, నిర్భాగ్యులు కూడా పనిచేసుకోవచ్చునని ఆయన దయగల మనసు అనుమతించింది.


అరవైవేల మృతదేహలమీద అద్భుతమైన రిసార్టు నిర్మిస్తామని, ఊచకోతకోసిన చోట రియల్‌ ఎస్టేట్‌, టూరిస్ట్‌ వ్యాపారం చేసుకుంటామని ఒక దేశాధినేత చెప్పడం ఇదే ప్రధమం కావచ్చు. అందుకే ఇంతటి పాడు ప్రపంచం కూడా అంతగా నివ్వెరపోయింది, ఆగ్రహంగానూ ప్రతిస్పందించింది. అనంతరం శ్వేతసౌధం ట్రంప్‌ వ్యాఖ్యలకు కొత్తభాష్యాలు చెప్పింది. స్వపక్షం కూడా కస్సుమంటున్నందున ఒక్క అమెరికన్‌ సైనికుడు కూడా అక్కడ అడుగుపెట్టకుండానే స్వకార్యాన్ని చక్కబెట్టుకోవాలని ట్రంప్‌ నిర్ణయించుకున్నారు. తన సమక్షంలో ట్రంప్‌ అంత చక్కగా భవిష్యత్‌ను విప్పిచెప్పిన తరువాత ఇజ్రాయెల్‌ ప్రధానికి మాత్రం ఆనందం కలగకుండా ఎందుకు ఉంటుంది? హమాస్‌ ఏలుబడిలో ఉన్న గాజా దుంపనాశమై, అక్కడో అద్భుతమైన బీచ్‌రిసార్టు వస్తే ఇజ్రాయెల్‌కు అంతకంటే భద్రత ఏముంటుంది? ఆయన వెంటనే సినిమా ఫక్కీలో మంచి ఆఫర్‌ ఇది అని తేల్చేశారు. అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్‌ బాధ్యతలు స్వీకరించిన తరువాత, ఆయనతో భేటీ అయిన తొలివిదేశీ నేత నెతన్యాహూ. పదిహేను నెలల గాజాయుద్ధంలో చావులూ నష్టాలూ కష్టాలూ ఒప్పందాల వరకూ లోతుపాతులన్నీ చర్చించుకోకుండానే వీరిద్దరూ మీడియాముందు ఈ విన్యాసం చేయరన్నది నిజం. ట్రంప్‌ తన ప్రణాళిక విప్పగానే, చరిత్ర గతినే మార్చేటంతటి మహాద్భుతమైన ఆలోచన అని కీర్తించారు నెతన్యాహూ. తక్షణ అమలుకోసం అమెరికా నుంచే తన దేశానికి ఆదేశాలు జారీ చేశారు. అమెరికా తన సైనికులను పంపబోవడం లేదు కనుక, మీరే పాలస్తీనియన్లను గాజానుంచి వెళ్ళగొట్టండి అని ఇజ్రాయెల్‌ రక్షణమంత్రి తన సైన్యాన్ని ఆదేశించారు.

ట్రంప్‌ ప్రతిపాదనను చాలా దేశాలు ఖండించాయి. ఈజిప్ట్‌, జోర్డన్‌, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్‌ ఇత్యాది దేశాలు ఆగ్రహంగా స్పందించాయి. అంతర్జాతీయ వేదికలు కఠినమైన మాటల్లో తప్పుబట్టాయి. ధ్వంసమైన గాజాను అందంగా తీర్చిదిద్దుతానని ట్రంప్‌ ప్రకటించిన నేపథ్యంలో, అమెరికా–ఇజ్రాయెల్‌ తమ మారణాయుధాలతో కలసికట్టుగా సర్వనాశనం చేయడానికి ముందు అది ఎంత మనోహరంగా ఉండేదో తెలియచెబుతున్న చిత్రాలు తిరిగి ప్రచారంలోకి వచ్చాయి. టూరిజం మక్కా, ఉద్యోగాల మక్కా అంటూ ఆయన విసురుతున్న వలలో పాలస్తీనియన్లు చిక్కరన్నది వాస్తవం. కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉండగా, ఇజ్రాయెలీ బందీలను హమాస్‌ సవ్యంగా అప్పగిస్తున్న తరుణంలో ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేసి కొత్త చిచ్చురేపారు. నెతన్యాహూ మళ్ళీ రణనినాదాలు చేస్తున్నారు. అమెరికా రాయబారకార్యాలయాన్ని టెల్‌ అవీవ్‌నుంచి జెరూసలేంకు మార్చడం, ఆక్రమించుకున్న ప్రాంతాలతో కలిపి ఇజ్రాయెల్‌ సార్వభౌమత్వాన్ని గుర్తించడం వంటివి ట్రంప్‌ తన తొలి హయాంలో చేశారు. ఇప్పుడు పాలస్తీనియన్ల భూభాగంలో కొంత తానే ఆక్రమించుకొని, 18లక్షల మందిని ఇతరదేశాలకు తరిమికొట్టి పాలస్తీనా సమస్యకు శాశ్వత పరిష్కారం పేరిట కొత్త కుట్రలకు తెరదీస్తున్నారు.

Updated Date - Feb 08 , 2025 | 06:14 AM