Qatar Airways Passenger Death: వెజ్ ఫుడ్ లేదని నాన్ వెజ్ తినమన్న విమానం సిబ్బంది.. ప్రయాణికుడి దుర్మరణం
ABN, Publish Date - Oct 09 , 2025 | 04:40 PM
విమానంలో వెజ్ ఫుడ్ లేని కారణంగా నాన్ వెజ్ ఫుడ్ తిన్న ఓ వృద్ధ ప్రయాణికుడు దుర్మరణం చెందారు. రెండేళ్ల క్రితం ఖతర్ ఎయిర్‌వేసులో జరిగిన ఈ ఘటనలో మృతిడి కుటుంబం తాజాగా న్యాయపోరాటం ప్రారంభించింది.
ఇంటర్నెట్ డెస్క్: విమానంలో నాజ్ వెజ్ ఫుడ్ తిన్న ఓ శాకాహారి ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ తలెత్తి మరణించాడు. రెండేళ్ల క్రితం ఈ ఘటన జరగ్గా మృతుడి కుటుంబం తాజాగా న్యాయపోరాటం ప్రారంభించింది. ఖతర్ ఎయిర్‌వేస్‌లో జరిగిన ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే ( Qatar vegetarian passenger death)..
మీడియా కథనాల ప్రకారం, డా అశోకా జయవీర అనే 85 ఏళ్ల రిటైర్డ్ కార్డియాలజిస్టు విమానంలో మాంసాహారం తిని దుర్మరణం చెందారు. 2023 జూన్ 30న ఆయన ఖతర్ ఎయిర్‌వేస్ విమానంలో లాస్ ఏంజిలిస్ నుంచి కొలొంబోకు బయలుదేరారు. అది దాదాపు 15.5 గంటల జర్నీ కావడంతో ఆయన విమానంలో తినేందుకు శాకాహారాన్ని ముందుగానే బుక్ చేసుకున్నారు. అయితే, శాకాహారం అందుబాటులో లేని విషయాన్ని మార్గమధ్యంలో ఉండగా సిబ్బంది చెప్పారు. కేవలం నాన్ వెజ్ ఫుడ్ మాత్రమే అందుబాటులో ఉందని అన్నారు. నాన్ వెజ్ భాగాన్ని వదిలేసి మిగతాది తినమని సూచించారు (Vegetarian Food Request Denied).
ఈ క్రమంలో ఆహారం గొంతుకకు అడ్డు పడటడంతో జయవీర తీవ్ర అస్వస్థతకులోనై చివరకు స్పృహ తప్పిపోయారు. ఆయనను కాపాడేందుకు సిబ్బంది ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది. క్రమంగా ఆయన ఆరోగ్యం దిగజారింది. విమానం స్కాట్‌ల్యాండ్‌లో దిగిన సమయంలో ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆయన చికిత్స పొందుతూ ఆగస్టు 3న కన్నుమూశారు. ఆహారం పొరపాటున ఊపిరితిత్తుల్లోకి వెళ్లడంతో ఆస్పిరేషన్ నిమోనియా అనే ఇన్‌ఫెక్షన్ తలెత్తి అశోకా జయవీర మరణించినట్టు తేలింది (wrongful death lawsuit).
అయితే, తన తండ్రి మరణానికి ఖతర్ ఎయిర్‌వేస్ నిర్లక్ష్యమే కారణమని సూర్య జయవీర ఆరోపించారు. పరిహారం కోసం తాజాగా న్యాయపోరాటం ప్రారంభించారు. ముందుస్తుగా తన తండ్రి బుక్ చేసుకున్న వెజ్ ఫుడ్‌ను అందించడంలో ఎయిర్‌లైన్స్ విఫలమైందని ఆరోపించారు. తన తండ్రి అనారోగ్యం పాలైన విపత్కర స్థితిలో కూడా ఎయిర్‌లైన్స్ సరిగా స్పందించలేదని అన్నారు. తమకు నష్టం జరిగినందుకు సంస్థ 1,28,821 డాలర్ల పరిహారం చెల్లించాలంటూ కోర్టులో కేసు దాఖలు చేశారు. మాంట్రియాల్ ప్రోటోకాల్ ప్రకారం, అంతర్జాతీయ ప్రయాణాల్లో ఇలాంటి ఘటనలకు పూర్తి బాధ్యత ఎయిర్‌లైన్స్‌దేనని స్పష్టం చేశారు. గతంలో బ్రిటన్ రియాల్టీ టీవీ స్టార్ జాక్ ఫౌలర్ కూడా విమాన ప్రయాణంలో ఫుడ్ ఎలర్జీ తలెత్తి తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డారు.
ఇవీ చదవండి:
న్యూయార్క్ సూపర్‌మార్కెట్‌లో షాకింగ్ సీన్.. కస్టమర్ల మధ్య తీవ్ర ఘర్షణ.. వైరల్ వీడియో
దరిద్రంలో మగ్గుతుండగా బంపర్ లాటరీ.. ఆ సంబరంలో ఉండగానే ఊహించని షాక్
Updated Date - Oct 09 , 2025 | 04:44 PM