UK Man: దరిద్రంలో మగ్గుతుండగా బంపర్ లాటరీ.. ఆ సంబరంలో ఉండగానే ఊహించని షాక్
ABN , Publish Date - Oct 07 , 2025 | 07:16 PM
లాటరీ గెలిచిన ఆనందంలో ఒళ్లు తెలీకుండా మూడు నెలల పాటు ఎంజాయ్ చేసిన ఓ బ్రిటన్ వ్యక్తి చివరకు ఆసుపత్రి పాలయ్యాడు. రెండు ఊపిరితిత్తుల్లో బ్లడ్ క్లాట్స్ ఏర్పడ్డాయి. తీవ్ర అనారోగ్యం నుంచి అదృష్టవశాత్తూ బయటపడ్డ అతడు తనకు బుద్ధొచ్చిందని తాజాగా పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: జీవితంలో ఎప్పుడో ఒకసారి మాత్రమే వచ్చే లాటరీ ఓ బ్రిటన్ వ్యక్తికి ప్రాణాల మీదకు తెచ్చింది. చావు తప్పి కన్నులొట్టపోయిన అతడు చివరకు బుద్ధి తెచ్చుకుని లెంపలేసుకునేలా చేసింది.
నార్‌ఫోక్‌కు చెందిన ఆడమ్ లోపెజ్ (39) ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్‌గా చేస్తుంటాడు. చాలా కాలంగా అతడు పేదరికంలోనే మగ్గుతున్నాడు. బ్యాంక్ అకౌంట్‌లో 17 పౌండ్లే ఉన్నాయి. ఇలాంటి టైమ్‌లో అతడికి ఊహించని విధంగా లాటరీ తగిలింది. నేషనల్ లాటరీ స్క్రాచ్ ఆఫ్ టిక్కెట్ కొన్న అతడు ఏకంగా 1 మిలియన్ పౌండ్లు గెలుచుకున్నాడు. దీంతో ఒక్కసారిగా అతడి తలరాత మారిపోయింది. సంపన్నుడైపోయాడు (UK lottery winner).
అప్పటి వరకూ పేదరికంతో బాధపడ్డ అతడు అంత డబ్బు వచ్చేసరికి తనని తానే మర్చిపోయాడు. ఆ తరువాత మూడు నెలల పాటు ఒళ్లు తెలీకుండా ఎంజాయ్ చేశాడు. చేస్తున్న జాబ్‌కు రిజైన్ ఇచ్చి రాత్రిపగలూ తేడా లేకుండా పార్టీలు గట్రా అంటూ ఫుల్లుగా ఎంజాయ్ చేశాడు. అదే చివరకు అతడి కొంప ముంచింది (Million Lottery Hospital).
ఇటీవల ఒక రోజు హఠాత్తుగా అతడి ఆరోగ్యం తలకిందులైంది. శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. అసలు ఏం జరుగుతోందో కూడా ఆడమ్‌కు అర్థం కాలేదు. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అతడి రెండు ఊపిరితిత్తుల్లో క్లాట్స్ ఏర్పడ్డాయని వైద్యులు షాకింగ్ న్యూస్ చెప్పారు. కాళ్లల్లో రక్తం గడ్డ కట్టి ఊపిరితిత్తుల వరకూ క్లాట్స్ చేరాయని తెలిపారు. పార్టీల పేరిట ఇష్టారీతిన వ్యవహరించి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసినందుకు ఇలా జరిగిందని తెలిపారు. లాటరీ గెలిచాక అతడు పార్టీల్లో మునిగితేలాడని ఇరుగుపొరుగు వారు చెప్పారు. నిత్యం అతడి ఇంట్లో పాటల శబ్దాలు, జనాల సవ్వడి వినిపిస్తూనే ఉండేవని చెప్పారు. మరో రోజు లేదన్నట్టు ఎంజాయ్ చేసేవాడని తెలిపారు.
దేవుడి దయ ఉండటంతో అతడు ప్రాణాలతో బయటపడ్డా అతడికి తన తప్పు తెలిసొచ్చింది. జ్ఞానోదయం అయ్యింది. ఇది తనకు మేలుకొలుపు అని వ్యాఖ్యానించాడు. జాబ్ కూడా మానేసి పార్టీల్లోనే ముగినితేలుతూ తన జీవితం ఎటుపోతోందో గుర్తించలేకపోయానని విచారం వ్యక్తం చేశాడు. క్రమశిక్షణ రాహిత్యం చివరకు కొంపముంచిందని అన్నాడు. ఇకపై జాగ్రత్తగా ఉంటానని చెప్పుకొచ్చాడు. లాటరీ గెలిచిన వాళ్లు కాస్త సంతోషాన్ని అణచుకుని, ఒళ్లు దగ్గరపెట్టుకుని మసలుకోవాలని సూచించాడు.
ఇవీ చదవండి:
నువ్వు ఇండియాకు తిరిగెళతావన్న నమ్మకం మాకు లేదు.. యువకుడికి షాకిచ్చిన అమెరికా
వీళ్లసలు మనుషులేనా.. అర్ధరాత్రి రైల్లో ఈ మహిళలు ఎలా రెచ్చిపోయారో చూస్తే..