Nepal Leaders Escape: హెలికాప్టర్ సాయంతో పారిపోతున్న నేతలు.. నెటిజన్ల కామెంట్స్
ABN, Publish Date - Sep 11 , 2025 | 12:56 PM
నేపాల్ రాజధాని కాఠ్మండూలో ఉద్రిక్తత వాతావరణం తారాస్థాయికి చేరింది. దీంతో మంత్రులు వారి కుటుంబాల రక్షణ కోసం నేపాల్ ఆర్మీ అత్యవసర చర్యలు తీసుకుంది. ఆర్మీ హెలికాప్టర్లతో మంత్రులను తాళ్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
నేపాల్(Nepal) రాజధాని కాఠ్మండూలో గత కొన్ని రోజులుగా గందరగోళం, హింస, అల్లర్లు జరుగుతున్నాయి. నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై బ్యాన్ విధించడంతో ఇదంతా మొదలైంది. ఎందుకంటే, ఈ కంపెనీలు ప్రభుత్వ నిబంధనలను పాటించలేదని, రిజిస్టర్ చేయలేదని నేపాల్ ప్రభుత్వం చెబుతోంది. ఈ నిర్ణయం యువతను, ముఖ్యంగా జెన్ జీని రెచ్చగొట్టింది. వాళ్లు రోడ్లపైకి వచ్చి, ప్రభుత్వంపై తిరగబడేలా చేసింది.
కాఠ్మండూలో అల్లర్లు, మంత్రుల ఇళ్లపై దాడులు
దీంతో లక్షలాది యువత, కోపంతో రగిలిపోతూ మంత్రుల ఇళ్లను ధ్వంసం చేశారు. పార్లమెంట్ భవనానికి నిప్పు పెట్టారు. కమ్యూనికేషన్ మంత్రి పృథ్వీ సుబ్బా గురుంగ్ ఇంటిని తగలబెట్టారు. డిప్యూటీ ప్రధాని, ఆర్థికమంత్రి బిష్ణు పౌడెల్ ఇంటిపై రాళ్లు రువ్వారు.
మాజీ హోం మంత్రి రమేష్ లేఖక్ ఇంటిపైనా దాడి చేశారు. ఓ వీడియోలో ఆర్థిక మంత్రి వీధుల్లో తప్పించుకుంటూ పరుగెత్తుతూ కనిపించారు. జనం ఆయనపై కూడా దాడి చేశారు. ఇంకో వీడియోలో, విదేశాంగ మంత్రి అర్జు రానా దేవుబా, ఆమె భర్త, మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవుబాల ఇళ్లపై దాడి జరిగినట్లు వీడియోలు వెలుగులోకి వచ్చాయి.
పారిపోతున్న నేతలు..
ఈ ఆందోళన నేపథ్యంలో నేపాల్ ఆర్మీ హెలికాప్టర్లు మంత్రులను, వారి కుటుంబాలను సురక్షితంగా వేరే ప్రాంతాలకు తరలించాయి(Nepal Leaders Escape). ఓ వీడియోలో హెలికాప్టర్ తాడుకు మంత్రులు వేలాడుతూ కాఠ్మండూలోని ఓ హోటల్ పైనుంచి ఎగురుతూ కనిపించారు. దూరంగా భారీగా పొగలు కూడా కనిపించాయి. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన అనేక మంది స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, నేతలు మాత్రం పారిపోతున్నారని పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
జైళ్లలోనా అల్లర్లు
మరోవైపు వీధుల్లోనే కాదు జైళ్లలోనూ గందరగోళం నెలకొంది. ఖైదీలు జైలు భవనాలకు నిప్పు పెట్టి, ప్రధాన గేట్‌ను ధ్వంసం చేసి బయటకు పరుగెత్తే ప్రయత్నం చేశారు. కానీ, ఆర్మీ వాళ్లను అడ్డుకుని వేరే జైళ్లకు తరలించింది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Sep 11 , 2025 | 03:45 PM