ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Iran Retaliates: అమెరికాపై ఇరాన్‌ ప్రతీకారం

ABN, Publish Date - Jun 24 , 2025 | 05:09 AM

తమ అణు కేంద్రాలపై బీ2 బాంబర్లతో విరుచుకుపడ్డ అమెరికాపై ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇరాన్‌.. సోమవారం రాత్రి ప్రతీకార దాడులను ప్రారంభించింది. ఖతార్‌, ఇరాక్‌లోని అమెరికా బేస్‌లపై ఆరు క్షిపణులతో దాడులు జరిపింది.

  • ఖతార్‌, ఇరాక్‌లోని యూఎస్‌ సైనిక స్థావరాలపై ఆరు క్షిపణులు.. సమర్థంగా ఎదుర్కొన్న రక్షణ వ్యవస్థ

  • గగనతలాన్ని మూసివేసిన ఖతార్‌, కువైత్‌.. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు

  • అమెరికా మాపై ఎన్ని క్షిపణులు వేసిందో.. మేం కూడా అన్నే వేశాం: ఇరాన్‌

  • ఖతార్‌కు ముందే సమాచారం.. ఇరాన్‌పై కొనసాగిన ఇజ్రాయెల్‌ దాడులు

  • 15 జెట్లు, 6 ఎయిర్‌బేస్‌ల ధ్వంసం.. ఐఆర్‌జీసీ హెడ్‌క్వార్టర్స్‌పైనా క్షిపణులు

  • పదుల సంఖ్యలో గార్డుల దుర్మరణం!.. ఫోర్డో సహా అణుకేంద్రాలపై దాడులు

  • నేడోరేపో ఫోర్డో వద్ద గ్రౌండ్‌ ఆపరేషన్‌?.. క్షిపణి దాడిలో బద్ధలైన ఎవిన్‌ జైలు

  • ఇరాన్‌ రాజకీయ ఖైదీలకు విముక్తి కల్పించాం: ఐడీఎఫ్‌

  • ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడులు.. టెల్‌అవీవ్‌ శివార్లను తాకిన బాలిస్టిక్‌ క్షిపణులు

  • ఇజ్రాయెల్‌లో రష్యన్‌ మాట్లాడే వాళ్లున్నారు.. అందుకే తటస్థంగా ఉన్నాం

  • తనను కలిసిన ఇరాన్‌ విదేశాంగ మంత్రి అరాఘ్చితో రష్యా అధినేత పుతిన్‌

  • విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం.. భారతీయులకు ప్రభుత్వం జాగ్రత్తలు

టెల్‌అవీవ్‌/టెహ్రాన్‌, జూన్‌ 23: తమ అణు కేంద్రాలపై బీ2 బాంబర్లతో విరుచుకుపడ్డ అమెరికాపై ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇరాన్‌.. సోమవారం రాత్రి ప్రతీకార దాడులను ప్రారంభించింది. ఖతార్‌, ఇరాక్‌లోని అమెరికా బేస్‌లపై ఆరు క్షిపణులతో దాడులు జరిపింది. పశ్చిమాసియాలో అమెరికా మోహరించిన గగనతల రక్షణ వ్యవస్థలు వెనువెంటనే స్పందించి, ఇరాన్‌ దాడులను సమర్థంగా అడ్డుకున్నా.. తాజా పరిణామాలతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెనువెంటనే ఖతార్‌తోపాటు.. బహ్రెయిన్‌, కువైత్‌, ఇరాక్‌లోని గగనతల వ్యవస్థలను అమెరికా యాక్టివేట్‌ చేసింది. సైరన్లు మోగాయి. ఖతార్‌, కువైత్‌లు తమ గగనతలాన్ని మూసివేశాయి. ఖతార్‌లోని అల్‌-ఉదైద్‌లో ఉన్న అమెరికా బేస్‌(గల్ఫ్‌లోనే అమెరికాకు చెందిన అతిపెద్ద ఎయిర్‌వేస్‌)ను తమ క్షిపణులు తాకినట్లు ఇరాన్‌ సైన్యం ప్రకటించింది. తమ ఆపరేషన్‌కు ‘ద బ్లెస్సింగ్‌ ఆఫ్‌ విక్టరీ’గా నామకరణం చేసినట్లు తెలిపింది. ‘‘ఇరాన్‌పై అమెరికా ఎన్ని బాంబులు వేసిందో.. అంతే సంఖ్యలో మేము అమెరికా బేస్‌లపై క్షిపణులను ప్రయోగించాం’’ అంటూ ఓ ప్రకటన చేసింది. ఈ దాడులపై ఖతార్‌కు ముందుగానే సమాచారం అందించామని వివరించింది.

అయితే.. వైట్‌హౌస్‌ వర్గాలు తమ గగనతల రక్షణ వ్యవస్థలు ఇరాన్‌ క్షిపణులను సమర్థంగా ఎదుర్కొన్నట్లు తెలిపాయి. ఇరాన్‌ నుంచి మధ్య, దీర్ఘశ్రేణి క్షిపణులు వచ్చినట్లు నిర్ధారించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సిచ్యువేషన్‌ రూమ్‌ నుంచి పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు వివరించాయి. కాగా.. ఖతార్‌, ఇరాక్‌తోపాటు.. బహ్రెయిన్‌, కువైత్‌లోని అమెరికా బేస్‌లపైనా దాడులు జరిగినట్లు ఇరాన్‌, ఇజ్రాయెల్‌ మీడియాలు నివేదించాయి. ఇరాన్‌ దాడులపై ఖతార్‌ తీవ్రంగా స్పందించింది. ఇరాన్‌కు తగిన గుణపాఠం చెబుతామని ప్రకటించింది. ఈ దాడులను సౌదీ అరేబియా ఖండించింది. కాగా.. దోహాలోని భారతీయులు జాగ్రత్తగా ఉండాలని భారత ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. వీలైనంతగా ఇళ్లలోనే ఉండాలని సూచించింది. ఖతార్‌లోని భారతీయ రాయబార కార్యాలయంతో టచ్‌లో ఉండాలని కోరింది. ఇటు కేరళ నుంచి ఖతార్‌ బయలుదేరిన విమానాలను వెనక్కి రప్పించినట్లు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ ఓ ప్రకటనలో తెలిపింది. ఖతార్‌లో గగనతలాన్ని మూసివేసినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. (అటు సోమవారం ఉదయం నుంచి ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ తన దాడులను కొనసాగించింది. ఈ దాడుల్లో ఇరాన్‌ వాయుసేనకు తీవ్రంగా నష్టం వాటిల్లగా.. ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ కార్ప్స్‌(ఐఆర్‌జీసీ) ప్రధాన కార్యాలయంపై జరిపిన దాడుల్లో పలువురు గార్డ్స్‌ మృతిచెందారు. ఫోర్డో అణుకేంద్రానికి దారితీసే మార్గాలను ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సె్‌స(ఐడీఎఫ్‌) ధ్వంసం చేసింది. రాజకీయ ఖైదీలు, విదేశీయులను నిర్బంధించే టెహ్రాన్‌లోని ఎవిన్‌ జైలును ఇజ్రాయెల్‌ డ్రోన్లు బద్ధలు కొట్టగా.. అందులో బందీలుగా ఉన్న వారికి స్వేచ్ఛను ప్రసాదించినట్లు ఐడీఎఫ్‌ ప్రకటించింది. ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ తన ప్రతీకారదాడులను కొనసాగించగా.. టెల్‌అవీవ్‌ శివార్లలో పలు భవనాలు ధ్వంసమయ్యాయి. అటు ఇరాన్‌ విదేశాంగ మంత్రి అరాఘ్చి రష్యా అధినేత పుతిన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తాము యుద్ధంలో జోక్యం కల్పించుకోకపోవడానికి కారణాలను పుతిన్‌ వివరించారు.

అర్థరాత్రి ఉద్రిక్తత..

ఐడీఎఫ్‌ వాయుసేన 50కి పైగా యుద్ధ విమానాలతో సోమవారం ఉదయం నుంచి పలు దఫాలుగా ఇరాన్‌లోని తబ్రీజ్‌, మహ్రాబాద్‌, షాహిద్‌ బేహస్తి, మష్హాద్‌, హమేదాన్‌, డెజ్ఫూల్‌ ఎయిర్‌బే్‌సలను టార్గెట్‌గా చేసుకుంది. ఈ విమానాశ్రయాలు టెహ్రాన్‌తోపాటు.. తూర్పు, పశ్చిమ, మధ్య ఇరాన్‌లో ఉన్నాయి. ఈ దాడుల్లో 15 యుద్ధ విమానాలు, ఒక హెలికాప్టర్‌ ధ్వంసమైనట్లు ఐడీఎఫ్‌ పేర్కొంది. అందుకు సంబంధించిన వీడియో ఫుటేజీని మీడియాకు విడుదల చేసింది. ధ్వంసమైన విమానాల్లో ఎఫ్‌-14 ట్యామ్‌కామ్‌, ఎఫ్‌-5తోపాటు.. ఒక ఇంధన సరఫరా జెట్‌(కేసీ-707) ఉన్నట్లు వివరించింది. గడిచిన 10 రోజుల్లో తాము జరిపిన దాడుల్లో ఇరాన్‌కు చెందిన 30 యుద్ధ విమానాలు, ఎనిమిది హెలికాప్టర్లు(ఏహెచ్‌-1జే) ధ్వంసమైనట్లు వెల్లడించింది. ‘‘ఇక ఇరాన్‌ యుద్ధ విమానాలు గాల్లోకి ఎగిరే అవకాశం లేకుండా రన్‌వేలు, హ్యాంగర్లు, ఇతర వనరులను నష్టపరిచాం’’ అని ఐడీఎఫ్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

అణు కేంద్రాలపై దాడుల పరంపర

అమెరికా బాంబర్లు విరుచుకుపడిన ఫోర్డో, నతాంజ్‌, ఇస్ఫహాన్‌ అణు కేంద్రాల వద్ద ఐడీఎఫ్‌ సోమవారం దాడులు జరిపింది. ఫోర్డో అణు కేంద్రం వద్ద రహదారి వ్యవస్థను ధ్వంసం చేసినట్లు పేర్కొంది. ఇక్కడ సైనికులతో కూడిన ఓ వాహనాన్ని కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు వివరించింది. ‘‘ఇకపై ఫోర్డోలోకి ఏ వాహనం వెళ్లదు..! లోపల ఉన్న వాహనాలు బయటకు రావు’’ అని ప్రకటించింది. నతాంజ్‌, ఇస్ఫహాన్‌పైనా దాడులు జరిగినట్లు ఇరాన్‌ మీడియా పేర్కొంది. అయితే.. ఫోర్డో వద్ద ఇజ్రాయెల్‌ భూతల దాడులతో గ్రౌండ్‌ ఆపరేషన్‌ను నిర్వహించనున్నట్లు సమాచారం. అమెరికా దాడుల్లో రియాక్టర్లు, సెంట్రీఫ్యూజ్‌లకు నష్టం వాటిల్లకపోవొచ్చనే అభిప్రాయాలను అంతర్జాతీయ విశ్లేషకులు వెల్లడించడంతో.. క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగి, పని పూర్తిచేయాలని నెతన్యాహు సర్కారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి అమెరికా ఈ దాడిలో పాలుపంచుకోకుండా ఉండి ఉంటే.. ఇజ్రాయెల్‌ సోమవారమే గ్రౌండ్‌ ఆపరేషన్‌కు వ్యూహాలు సిద్ధం చేసుకున్నట్లు ‘యెదిహోత్‌ అహ్రునోత్‌’ వార్తాసంస్థ ఓ కథనాన్ని ప్రచురించింది. కాగా.. అమెరికా దాడులతో ఫోర్డో అణు కేంద్రానికి భారీ నష్టం వాటిల్లినట్లు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ(ఐఏఈఏ) చీఫ్‌ రాఫెల్‌ గ్రాసీ వ్యాఖ్యానించారు.

ఎవిన్‌ జైలు ఖైదీలకు విముక్తి

టెహ్రాన్‌లోని ఎవిన్‌ జైలు గోడలను బద్ధలు కొట్టినట్లు ఐడీఎఫ్‌ ప్రకటించింది. అందుకు సంబంధించిన ఫుటేజీని, తమ క్షిపణులు, డ్రోన్లు ప్రధాన ద్వారం, ఇతర మార్గాలను ధ్వంసం చేసిన వీడియోలను మీడియాకు అందజేసింది. 1971లో నిర్మితమైన ఈ జైలు అప్పటి పాలకుడు మహమ్మద్‌ రజా షా పహ్లవీ కఠిన శిక్షలకు వినియోగించేవారు. 1979 నుంచి ఇస్లామిక్‌ రివల్యూషన్‌ పాలకులు ఈ జైలును రాజకీయ ఖైదీలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పేవారు, విదేశీయులను నిర్బంధించేందుకు వినియోగించడం మొదలుపెట్టారు. ఈ జైలులో కేవలం ఐఆర్‌జీసీ గార్డులకు మాత్రమే అనుమతి ఉంటుంది. మిలటరీ అధికారులు, పోలీసులకు ఎలాంటి అధికారం ఉండదు. సుప్రీంలీడర్‌ కనుసన్నల్లో ఈ జైలులో ఖైదీలను చిత్ర హింసలకు గురిచేస్తారని చెబుతుంటారు. ఆ జైలులోని ఖైదీలకు స్వేచ్ఛను ప్రసాదించినట్లు ఐడీఎఫ్‌ ప్రకటించింది.

టెల్‌అవీవ్‌పై కొనసాగిన దాడులు

ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ తన ప్రతీకారదాడుల్ని కొనసాగిస్తోంది. సోమవారం తెల్లవారుజాము నుంచి 15 బాలిస్టిక్‌ క్షిపణులు, పలు సూసైడ్‌ డ్రోన్లను ప్రయోగించింది. గోలన్‌బీచ్‌, సెలోన్‌, గోఫ్రాబీచ్‌, కుర్సీబీచ్‌, పెబుల్స్‌, కినార్‌బీచ్‌, దుగా, దుగిట్‌, సుసితాబీచ్‌, వైల్డ్‌ హోటల్‌పై క్షిపణులు/డ్రోన్లు పడ్డట్లు ఇజ్రాయెల్‌ అధికారులు ప్రకటించారు. లాచిష్‌, గలీలి, గోలన్‌లో నష్టం నమోదైనట్లు ఐడీఎఫ్‌ ప్రతినిధి బ్రిగేడియర్‌ జనరల్‌ డఫెరిన్‌ చెప్పారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. ఇప్పటి వరకు యుద్ధంలో మరణించిన పౌరుల సంఖ్య 24గా ఉన్నట్లు వివరించారు. కాగా.. ఇరాన్‌ ప్రయోగించిన ఓ డ్రోన్‌(షహీద్‌-101) జోర్దాన్‌ రాజధాని అమ్మాన్‌లో పడినట్లు అక్కడి వార్తాసంస్థలు తెలిపాయి.

టెహ్రాన్‌లో భారీ బీభత్సం

అణుకేంద్రాలపై అమెరికా బాంబర్ల విధ్వంసం నుంచి ఇరాన్‌ తేరుకునేలోపే.. ఇజ్రాయెల్‌ వైమానిక దాడులను కొనసాగించడంతో సోమవారం టెహ్రాన్‌లో భారీ విధ్వంసం కనిపించింది. ఐఆర్‌జీసీ హెడ్‌క్వార్టర్స్‌పై క్షిపణులు, డ్రోన్లతో జరిపిన దాడుల్లో పదుల సంఖ్యలో గార్డులు మృతిచెందినట్లు ఇరాన్‌ మీడియా తెలిపింది. అయితే.. ఐడీఎఫ్‌ మాత్రం ప్రాణనష్టం వంద వరకు ఉండొచ్చని పేర్కొంది. టెహ్రాన్‌లో భారీ దాడులు జరిగాయని, నగరం అంతటా ఆకాశంలో పొగలు ఎగిసిపడ్డట్లు రాయిటర్స్‌ పేర్కొంది. కరాజ్‌లోనూ ప్రభుత్వ, అంతర్గత భద్రత, కమ్యూనికేషన్ల కార్యాలయాలు, కెర్మన్షాలో రాడార్‌ కేంద్రం ధ్వంసమైనట్లు తెలిపింది. కాగా.. ఈ యుద్ధంలో ఇప్పటి వరకు 950 మంది ఇరానీలు మరణించినట్లు, 3,450 మంది గాయపడ్డట్లు మానవ హక్కుల సంఘాలు పేర్కొన్నాయి.

ఇజ్రాయెల్‌లో మావాళ్లున్నారు: పుతిన్‌

ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చి సోమవారం ఉదయం మాస్కోలో రష్యా అధినేత పుతిన్‌తో భేటీ అయ్యారు. ఇరాన్‌-ఇజ్రాయెల్‌ యుద్ధం, అమెరికా దాడులపై ఆయన పుతిన్‌కు వివరించారు. రష్యా ఎల్లప్పుడూ ఇరాన్‌ వెంటే ఉంటుందని తాము భావిస్తున్నామన్నారు. అయితే.. రష్యాలో జరుగుతున్న అంతర్జాతీయ ఆర్థిక సదస్సులో పుతిన్‌ మాట్లాడుతూ.. ఈ యుద్ధంలో రష్యా తటస్థంగా ఉండటానికి కారణాలను వివరించారు. ‘‘ఇజ్రాయెల్‌లో 20 లక్షల మంది పౌరులు రష్యా భాషను మాట్లాడుతారు. ఎక్కువ మంది రష్యా భాషను మాట్లాడే దేశాల్లో ఇజ్రాయెల్‌ ఒకటి. అందుకే.. ఇరాన్‌ను కాపాడేందుకు మేము నేరుగా రంగంలోకి దిగడం లేదు’’ అని వెల్లడించారు.

Updated Date - Jun 24 , 2025 | 05:25 AM