Operation Sindoor: తృతీయ పక్షం జోక్యాన్ని భారత్ తోసిపుచ్చింది.. ఒప్పేసుకున్న పాక్ మంత్రి
ABN, Publish Date - Sep 16 , 2025 | 08:13 PM
ట్రంప్ గత మే నుంచి అమెరికా యంత్రాంగం జోక్యంతోనే రెండు అణ్వస్త్రదేశాల మధ్య యుద్ధం ఆగిపోయిందని చెబుతూ వస్తున్నారు. అయితే ఆయన వాదనను భారత్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది.
దోహా: భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని పదేపదే చెప్పుకుంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump) మాటలన్నీ అబద్ధాలని తేలిపోయింది. ట్రంప్ మధ్యవర్తిత్వాన్ని తాము కోరలేదని భారత్ ఇప్పటికే విస్పష్టంగా ప్రకటించగా, భారత్ వాదనను దాయాది దేశమైన పాక్ కూడా తాజాగా అంగీకరించింది. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) సమయంలో పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సమస్యలను తృతీయ పక్షం జోక్యంతో పరిష్కరించుకునే ప్రసక్తే లేదని భారత్ తేల్చిచెప్పిందని పాక్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి మహమ్మద్ ఇషాక్ దార్ (Mohammad Ishaq Dar) వెల్లడించారు.
అల్ జజీరాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇషాక్ దార్ మాట్లాడుతూ, తృతీయ పక్షం జోక్యం అంశాన్ని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో ఇస్లాబాద్ ప్రస్తావించిందని, బయట వ్యక్తుల ప్రమేయానికి ఇండియా ఒప్పుకోవడం లేదని ఆయన తనకు చెప్పారని తెలిపారు. జూలై 25న ఇదే విషయాన్ని వాషింగ్టన్‌లో తాను తిరిగి రూబియాతో ప్రస్తావించినట్టు చెప్పారు. పూర్తిగా ఇది ద్వైపాక్షికంగానే పరిష్కారం కావాల్సిన అంశమని ఇండియా తెగేసి చెప్పినట్టు ఆయన తిరిగి సమాధానమిచ్చారని ఇషాక్ దార్ తెలిపారు.
ట్రంప్ గత మే నుంచి అమెరికా యంత్రాంగం జోక్యంతోనే రెండు అణ్వస్త్రదేశాల మధ్య యుద్ధం ఆగిపోయిందని చెబుతూ వస్తున్నారు. అయితే ఆయన వాదనను భారత్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. భారత్-పాక్ దేశాల డీజీఎంఓలు మాట్లాడుకున్న తర్వాతే కాల్పుల విరమణ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.
చర్చలకు సిద్ధమే కానీ..
కాగా, భారత్‌తో వివిధ అంశాలపై ద్వైపాక్షిక చర్చకు పాక్ సిద్ధంగానే ఉందని, అయితే సమగ్ర చర్చ జరగాలని, ఉగ్రవాదం, వాణిజ్యం, ఎకానమీ, జమ్మూకశ్మీర్ అంశాలు ఈ చర్చలో ఉండాలని ఇషాక్ దార్ అన్నారు. 'మేము ఏదీ అడుక్కోం. ఏ దేశం చర్చలు కోరుకున్నా మేము సంతోషిస్తాం, స్వాగతిస్తాం. సమస్యల పరిష్కారానికి చర్చలే మార్గమని మేము నమ్ముతాం. ఇది ఇరువైపులా సహకరించుకుంటేనే సాధ్యమవుతుంది. ఇండియా చర్చలు కోరుకోనప్పుడు మేము బలవంతం చేయలేం' అని దార్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఆపరేషన్ సిందూర్‌లో మసూద్ అజార్ కుటుంబం ముక్కచెక్కలు.. వెల్లడించిన జైషే కమాండర్
భారత్‌తో మా బంధాన్ని తెంచేందుకు చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి: రష్యా విదేశాంగ శాఖ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయం
Updated Date - Sep 16 , 2025 | 08:26 PM