Covid Surge in Hongkong: హాంకాంగ్, సింగపూర్‌లో పెరుగుతున్న కోవిడ్ కేసులు
ABN, Publish Date - May 15 , 2025 | 06:32 PM
ఆసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రాలపై హాంకాంగ్, సింగపూర్‌లో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో, ప్రజలు అలర్ట్‌గా ఉండాలని, బూస్టర్ డోసులు తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియాలో మళ్లీ కరోనా వేవ్ మొదలైన సూచనలు కనబడుతున్నాయి. హాంకాంగ్, సింగపూర్‌లో కరోనా కేసులు పెరుగుతుండటంతో స్థానిక అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. హాంకాంగ్‌లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని స్థానిక అధికారి ఒకరు హెచ్చరించారు. ఇటీవల శాంపిల్స్‌లో అనేకం పాజిటివ్‌గా తేలాయని అన్నారు. ఈ ఏడాది ఈ స్థాయిలో కోవిడ్ పాజిటివ్స్ రావడం ఇదే తొలిసారని అన్నారు. మే 3తో ముగిసిన వారంలో 31 కొవిడ్ మరణాలు నమోదు అయ్యాయని, ఈ ఏడాది ఇదే గరిష్ఠ సంఖ్య అని కూడా తెలిపారు. రెండేళ్ల నాటి కొవిడ్ ఇన్ఫెక్షన్ దశతో పోలిస్తే కేసుల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ పరీక్షల్లో వైరల్ లోడ్ పెరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు. దీనర్థం వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని భావించాలని అన్నారు.
ఇక పొరుగున ఉన్న సింగపూర్‌లో కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దాదాపు ఏడాది తరువాత అక్కడి ఆరోగ్య శాఖ కొవిడ్ కేసుల సంఖ్యను తాజాగా వెల్లడించింది. మే3తో ముగిసిన వారంలో కేసుల సంఖ్య 14200గా ఉందని, అంతకుముందు వారంతో పోలిస్తే ఇది 28 శాతం ఎక్కువని అధికారులు అన్నారు. ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య కూడా 30 శాతం పెరిగిందని చెప్పారు.
జనాభాలో తగ్గుతున్న ఇమ్యూనిటీ కారణంగా కేసుల సంఖ్య పెరుగుతూ ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుత వేరియంట్ల వ్యాప్తి సామర్థ్యం గతంలో కంటే ఎక్కువగా లేదని కూడా చెబుతున్నారు. వ్యాధి తీవ్రత కూడా మునుపటి లాగానే ఉందని వివరించారు.
సింగపూర్, హాంకాంగ్‌తో పాటు ఆసియాలోని పలు ప్రాంతాల్లో ఇటీవల కాలంలో కొవిడ్ కేసులు పెరుగదల కనిపిస్తోంది. దీంతో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. టీకాలను వేసుకోవాలని, కొవిడ్ ముప్పు ఎక్కువగా ఉన్న వారు బూస్టర్ డోసులు తీసుకోవాలని చెబుతున్నారు. సాధారణంగా శ్వాసకోస సంబంధిత సమస్య తీవ్రత చలికాలంలో ఎక్కువగా ఉంటే కొవిడ్ మాత్రం ఎండాకాలంలో కూడా కనిపిస్తుండటంతో అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
Also Read:
RBI: పాకిస్థాన్, గల్ఫ్ దేశాలకు సాయం చేసిన ఆర్బీఐ.. ఎందుకంటే..
Abhinandan Vardhaman: అభినందన్ వర్థమాన్‌ను భారత్‌కి పాక్ ఆర్మీ అప్పగించిన తర్వాత ఏమైందంటే..
Colonel Sofiya Qureshi: కల్నల్ సోఫియా వివాదం.. సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు
Read Latest and International News
Updated Date - May 15 , 2025 | 06:37 PM