Khaleda Zia Passed away: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత
ABN, Publish Date - Dec 30 , 2025 | 07:54 AM
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బీఎన్పీ చీఫ్ ఖలీదా జియా కన్నుమూశారు. ఆ దేశ రాజకీయాల్లో దశాబ్దాల పాటు చక్రం తిప్పిన ఆమె.. మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(BNP) అధినేత్రి ఖలీదా జియా(BNP Chief Khalida Zia) తుదిశ్వాస విడిచారు. ఆ దేశ రాజకీయాల్లో దశాబ్దాల పాటు చక్రం తిప్పిన ఆమె.. 80 ఏళ్ల వయసులో గుండె, ఊపిరిత్తుల్లో ఇన్ఫెక్షన్‌కు గురై గత నవంబర్ 23న ఢాకా(Dhaka)లోని ఎవర్‌కేర్ ఆస్పత్రిలో చేరారు. అనంతరం.. ఆమెకు న్యుమోనియా(Pneumonia) సోకినట్టు వైద్యులు గుర్తించారు. దీంతో ఆమె ఆరోగ్యం రోజు రోజుకూ మరింత వేగంగా క్షీణించింది. ఈ నేపథ్యంలో ఆమె వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ.. మంగళవారం ఉదయం 6:00 గంటలకు తనువు చాలించారు(Bangladesh Former PM Khalida Zia Passed Away).
పదేళ్లపాటు ప్రధానిగా..
1945 ఆగస్టు15న అవిభక్త భారతదేశంలోని పశ్చిమ్ బెంగాల్లో జన్మించిన ఖలిదా జియా(Khalida Zia).. బీఎన్పీ ఛైర్‌పర్సన్‌గా ఆ దేశ రాజకీయాలపై చెరగని ముద్రవేశారు. బంగ్లా విమోచన యుద్ధంలో ఆమె భర్త జియావుర్ రెహమాన్(Ziaur Rahman).. పాక్‌పై తిరుగుబాటు చేసి యుద్ధంలో పాల్గొన్నారు. ఆ తర్వాత 1981లో ఆయన హత్యకు గురికావడంతో బంగ్లాదేశ్ రాజకీయాల్లో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. ఈ నేపథ్యంలో బీఎన్పీ అధ్యక్షురాలిగా ఖలీదా పగ్గాలు చేపట్టారు. పదేళ్ల తర్వాత ప్రధాని అయిన ఆమె.. 1991-96, 2001-06 మధ్య కాలంలో పదేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. ఆ దేశంలో కేర్ టేకర్(Care Taker) ప్రభుత్వ వ్యవస్థను తొలిసారిగా ప్రవేశపెట్టారామె. ఖలీదా ప్రధానిగా ఉన్న కాలంలో భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య సంబంధాలు తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. ఆ సమయంలో బీఎన్పీని భారత్ వ్యతిరేక పార్టీగా కొందరు పరిగణించారు. ఓ అవినీతి కేసులో 2018 నుంచి 2020 మధ్య జైలు జీవితం అనుభవించారు జియా.
ఎన్నికల నేపథ్యంలో..
2026 ఫిబ్రవరిలో బంగ్లాదేశ్‌లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. 2024లో షేక్ హసీనా(Sheikh Hasina) ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత.. ఆ దేశ రాజకీయాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం.. నోబెల్ అవార్డు గ్రహీత మహమ్మద్ యూనస్(Muhammad Yunus) నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం కొనసాగుతోంది. హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ(ALP)పై నిషేధం ఉండటంతో.. వచ్చే ఎన్నికల్లో బీఎన్పీ విజయం సాధించే అవకాశాలున్నట్టు అక్కడి రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖలిదా జియా మరణించడం ఆ దేశ రాజకీయాల్లో తీవ్ర ప్రభావం చూపనుంది.
ఇవీ చదవండి:
పుతిన్ నివాసాలపై దాడికి ఉక్రెయున్ ప్రయత్నం!
భారతీయుల వర్క్ పర్మిట్లన్నీ రద్దు చేయాలి
Updated Date - Dec 30 , 2025 | 08:48 AM