బరువు నియంత్రణకు ‘ఉషోదయం’
ABN, Publish Date - May 25 , 2025 | 10:01 AM
బరువు తగ్గాలనుకునేవారు డైటింగ్ పేరిట నోరు కట్టేసుకోనక్కర్లేదు. గంటల తరబడి వ్యాయామాలతో కుస్తీపడాల్సిన అవసరం లేదు. ‘ఉదయం నిద్ర లేచిన వెంటనే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలు... సులువుగా బరువు తగ్గించుకోవచ్చ’ని చెబుతున్నారు నిపుణులు. ఆ సూచనలే ఇవి...
- బరువు కొలత
ఉదయం నిద్ర లేచాక కాలకృత్యాలు తీర్చుకున్న వెంటనే బరువు తూచుకోవటం మంచిది. అప్పుడైతే కడుపు ఖాళీగా ఉంటుంది. ఏ మధ్యాహ్నమో, సాయంత్రమో బరువు చూసుకుంటే అప్పటివరకు తిన్న పదార్థాల బరువూ తోడవుతుంది. దాంతో బరువు తగ్గుతున్నామా, లేదా? అనేది కచ్చితంగా తెలియదు. ఒకవేళ బరువు తగ్గనట్టు అనిపిస్తే.. సమస్య ఎక్కడుందో గుర్తించి, పకడ్బందీగా తిరిగి ప్రయత్నించే వీలుంటుంది.
- నీరు తాగాలి
టిఫిన్ తినటానికి ముందే.. ఒకట్రెండు గ్లాసుల నీళ్లు తాగితే బరువు తగ్గటానికి అవకాశం ఉంటుంది. నీటిలో క్యాలరీలు ఉండవు కానీ కడుపు నిండుతుంది. ఆకలి తగ్గుతుంది. దీనివల్ల మరీ ఎక్కువగా టిఫిన్ తినకుండా చూసుకోవచ్చు. నీటితో జీవ క్రియల వేగమూ పుంజుకుంటుంది. క్యాలరీలు ఖర్చు కావడానికి సాయం చేస్తుంది. నీళ్లు ఎక్కువగా తాగినవారు... తీపి పానీయాలు, కొవ్వు పదార్థాలు, చక్కెర, ఉప్పు తక్కువగా తీసుకున్నట్లు అధ్యయనాల్లో తేలింది.
- ఖాళీ కడుపుతో వ్యాయామం
టిఫిన్ తినటానికి ముందే వ్యాయామం చేయటం ఉత్తమం. ఖాళీ కడుపుతో వ్యాయామం చేస్తే కచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. శరీరం శక్తి కోసం కొవ్వును వినియోగిం చుకుంటుంది. కాబట్టి ఆ సమయంలో అదనపు కొవ్వు ఇట్టే కరిగిపోతుంది.
- నడకను మించింది లేదు...
జిమ్‌కి వెళ్లకుండా బరువు తగ్గాలనుకుంటే... నడకను మించిన మంత్రం లేదు. రోజూ మార్నింగ్ వాక్ చేయడం అలవాటు చేసుకోవాలి. కొంతమంది చాలా మెల్లిగా నడుస్తుంటారు. ఇలా చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. కాబట్టి నడిచిన అరగంటైనా కొంచెం వేగంగా నడవాలని సూచిస్తున్నారు నిపుణులు. అప్పుడే శరీరానికి చెమట పట్టి తొందరగా బరువు తగ్గుతారు. అలాగే నడిచేటప్పుడు వీపును నిటారుగా ఉంచి నడవాలి. ఇలా చేస్తేనే ఎక్కువ క్యాలరీలు బర్న్ అవుతాయి.
.
- ఒత్తిడి దరి చేరకుండా...
ఒత్తిడిలో ఉన్నప్పుడు శరీరం కార్డిసాల్ అనే హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఇది బరువు పెరగడానికి దారి తీస్తుంది. కాబట్టి ఒత్తిడి దరిచేరకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా మైండ్‌ఫుల్ నెస్‌ని (శ్వాస మీద దృష్టి కేంద్రీకరించి, అవయ వాలు, ఆలోచనల మీద కంట్రోల్ సాధించడమే ‘మైండ్‌ఫుల్‌నెస్’) సాధన చేయడం ఉత్తమం.
- ఆహార జాబితా
రోజంతా ఏమేం తింటామో ఉదయాన్నే జాబితా సిద్ధం చేసుకోవాలి. దీనివల్ల తక్కువ క్యాలరీలు లభించే ఆహారాన్ని ముందే నిర్ణయించుకోవచ్చు. అధిక క్యాలరీలు ఉండే జంక్ ఫుడ్ జోలికి పోకుండా ముందుగానే జాగ్రత్త పడొచ్చు
- ప్రొటీన్‌పై శ్రద్ధ...
అల్పాహారంలో ప్రొటీన్ కాస్త ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇది ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగిస్తుంది. నిజానికి పిండి పదార్థాన్ని, కొవ్వును జీర్ణం చేసుకోవటం కన్నా.. ప్రొటీన్స్‌ను జీర్ణం చేసుకోవటానికిశరీరం ఎక్కువ క్యాలరీలను వినియోగించుకుంటుంది. కాబట్టి అల్పాహారంలో మినుములు, పెసర, వేరుశనగ వంటి పప్పులతో చేసే పదార్థాలు, గుడ్డు, పెరుగు వంటివి చేర్చుకోవటం మంచిది.
- నెమ్మదిగా తినాలి
అల్పాహారాన్ని నెమ్మదిగా ఆస్వాదిస్తూ తినాలి. ఇలా తినడం వల్ల ఎంత తింటున్నాం? ఏం తింటున్నాం? అనేది అర్థమవుతుంది. తద్వారా అవసరమైనంత ఆహారాన్ని మాత్రమే తీసుకోగలుగుతాం. ఇది బరువు తగ్గడానికి తోడ్పడుతుంది.
- ఎండలో గడపాలి
ఉదయాన్నే శరీరానికి కాస్త ఎండ తగిలేలా చూసుకుంటే ఎక్కువగా కొవ్వు కరిగే అవకాశ ముంది. కాబట్టి పొద్దున్న 10- 15 నిమిషాల పాటు ఎండలో వ్యాయామం, నిలబడటం లాంటివి చేయాలి. ఉదయం వేళల్లో ఎండలో గడిపేవారి శరీర బరువు నియంత్రణలో ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి
ఈ వార్తలు కూడా చదవండి.
భార్య సీమంతంలో భర్తకు గుండెపోటు.. మృతి
Hyderabad Metro: పార్ట్-బీ మెట్రోకు డీపీఆర్ సిద్ధం
Read Latest Telangana News and National News
Updated Date - May 25 , 2025 | 10:01 AM