Pain and Depression: నొప్పితో కుంగుబాటు
ABN, Publish Date - Apr 22 , 2025 | 01:29 AM
తీవ్రమైన నొప్పి శరీరానికే పరిమితం కాక, మానసిక కుంగుబాటుకు దారి తీస్తుందంటున్నాయి తాజా పరిశోధనలు. వేర్వేరు శరీర భాగాల్లో నొప్పి ఉన్నవారికి డిప్రెషన్ ముప్పు ఎక్కువగా ఉంటుందని స్పష్టమైంది
పరిశోధన
మూడు నెలలకు మించి తీవ్రమైన నొప్పి వేధిస్తూ ఉంటే, అంతిమంగా అది మానసిక కుంగుబాటుకు దారి తీస్తుందని పరిశోధనలో తేలింది. సైన్స్ అడ్వాన్సెస్‌లో ప్రచురితమైన ఒక కొత్త అధ్యయనంలో శరీరంలోని వేర్వేరు ప్రాంతాల్లో తలెత్తే నొప్పుల వల్ల, సదరు వ్యక్తుల్లో మానసిక కుంగుబాటుకు గురయ్యే ముప్పు కూడా పెరుగుతూ ఉంటుందని పేర్కొనడం జరిగింది. మరిన్ని వివరాలు....
ప్రపంచవ్యాప్తంగా 30% మంది తీవ్రమైన నడుము నొప్పి, మైగ్రెయిన్ తదితర సమస్యలతో బాధపడుతున్నారు. వీళ్లలో ప్రతి ముగ్గురిలో ఒకరికి ఈ బాధలకు ఇతరత్రా నొప్పులు కూడా తోడవుతూ ఉంటాయి. నిజానికి నొప్పి శరీరానికే పరిమితం కాదు. భౌతిక బాధలు మానసిక ఆరోగ్య పరిణామాలకు దారి తీస్తాయి. ఈ విషయాన్ని నిర్ధారించడం కోసం యేల్ బృందం, యుకెలో బయోబ్యాంక్ దీర్ఘకాల అధ్యయనానికి పూనుకున్నాయి. దాన్లో భాగంగా 14 ఏళ్ల పాటు 4 లక్షల మందికి చెందిన ఆరోగ్య సమాచారాన్ని సేకరించి పరిశీలించినప్పుడు, తల, ముఖం, మెడ, వెన్ను, పొట్ట, పిరుదులు, మోకాళ్లు... ఇలా వేర్వేరు ప్రదేశాల్లో దీర్ఘకాల నొప్పులతో బాధపడేవారు మానసిక కుంగుబాటుకు కూడా గురవుతున్నట్టు తేలింది.
అలాగే శరీరంలోని వేర్వేరు ప్రదేశాల్లో వేర్వేరు నొప్పులతో బాధపడేవారిలో మానసిక కుంగుబాటు తీవ్రత ఎక్కువగా ఉంటున్నట్టు కూడా పరిశోధకులు కనిపెట్టారు. ఇందుకోసం యేల్ పరిశోధకులు నొప్పితో బాధపడే వ్యక్తుల రక్తంలోని ఇన్‌ఫ్లమేటరీ మార్కర్లు, సి రియాక్టివ్ ప్రొటీన్స్, ప్లేట్‌లెట్లు, తెల్ల రక్త కణాలను పరిశీలించారు. వీటి ద్వారా నొప్పిని, మానసిక కుంగుబాటుతో ముడిపెట్టే ప్రాథమిక ఆధారాలను వాళ్లు కనిపెట్టగలిగారు. ఈ పరిశోధన ఆధారంగా భౌతిక ఆరోగ్యానికీ, మానసిక ఆరోగ్యానికీ మధ్య నెలకొని ఉన్న బంధాన్ని లోతుగా అర్థం చేసుకోవడం ద్వారా, నొప్పితో ముడిపడి ఉండే మానసిక కుంగుబాటును అరికట్టే దిశగా మరింత వినూత్నమైన వ్యూహాలను అభివృద్ధి చేయడం సాధ్యపడుతుందని పరిశోధకులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
బాత్‌రూమ్‌లో ఉన్నప్పుడు ఇలా చేస్తే డేంజరే..
ఈ టైమ్‌లో స్వీట్స్ తింటే నో టెన్షన్
కిడ్నీ సమస్యలున్న వాళ్లు టమాటాలు ఎందుకు తినొద్దంటే..
మధ్యాహ్నం నిద్రతో ఆరోగ్యానికి చేటు కలుగుతుందా?
Updated Date - Apr 22 , 2025 | 01:39 AM