Best Time For Afternoon Nap: మధ్యాహ్నం నిద్రతో ఆరోగ్యానికి చేటు కలుగుతుందా?
ABN , Publish Date - Apr 06 , 2025 | 05:45 PM
మధ్యాహ్నం నిద్రతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ అరగంటకు మించి కునుకు తీస్తే ఇబ్బందులు తప్పవని అనుభవజ్ఞులు చెబుతున్నారు. మరి మధ్యాహ్నం ఎంత సేపు కునుకు తీస్తే మేలు కలుగుతుందో ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇంటర్నెట్ డెస్క్: మధ్యాహ్నాలు కునుకు తీయడం చాలా మందిలో కనిపించే అలవాటు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 4 గంటల మధ్యలో కునుకు తీసేందుకు చాలా మంది ఇష్టపడతారు. అసలు మధ్యాహ్నం నిద్ర ఎందుకు వస్తుందీ అనే ప్రశ్నకు శాస్త్రవేత్తలు సమాధానం ఎప్పుడో కనుగొన్నారు. జీవగడియారం పనితీరులో భాగంగా శరీరం మధ్యాహ్నానికల్లా కాస్తంత అసలి పోయి విశ్రాంతి కోరుకుంటుందని చెప్పారు. ఈ క్రమంలో మధ్యాహ్నం చిన్న కునుకు తీస్తే కచ్చితంగా ఉపయోగం ఉంటుంది. అయితే, ఎంత సేపు నిద్రపోయామనేదానిపై ఈ ప్రయోజనాలు ఆధారపడి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు (Best Time For Afternoon Nap).
మధ్యాహ్నం స్వల్ప సమయం పాటు నిద్రిస్తే మెదడు మళ్లీ ఉత్తేజితం అవుతుంది. ఉత్సాహం, అప్రమత్తత, విషయాలను అర్థం చేసుకునే సామర్థ్యం పెరుగుతాయి. గాఢ నిద్రలోకి జారిపోకుండానే మెదడు కావాల్సిన విశ్రాంతి తీసుకునేందుకు ఈ కునుకులు ఉపయోగపడతాయి. అందుకే వీటిని పవర్ నాప్స్ అని కూడా అంటారు.
అయితే, మధ్యాహ్నాలు గంటలకు గంటలు నిద్రలో వెళ్లబుచ్చితే మేలు కంటే కీడే ఎక్కువని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. నిద్రకు ముందుకంటే పరిస్థితి దిగజారుతుందని, సాయంత్రానికి శరీరం మరింత బద్ధకంగా, నిస్సత్తువగా మారుతుందని చెబుతున్నారు. అరగంటకు మించి నిద్రపోతే స్లీప్ ఇనర్షియా అనే పరిస్థితి వస్తుంది. గాఢ నిద్రలోంచి మెలుకొన్నట్టుగా, బద్ధకంగా, నిరసంగా అనిపిస్తుంది. అసలట, తికమక చుట్టుముడతాయి. సాయంత్రం ముఖ్యమైన పనులు పెట్టుకున్న వారికి ఇది మరింత ఇబ్బందికరం. మధ్యాహ్నాలు అరగంటకు మించి నిద్రపోతే మెదడు గాఢ నిద్ర స్థితిలోకి వెళుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ దశలో ఉండగా మేలుకుంటే ఆ తరువాత గంట పాటు మెదడు, శరీరం ఇబ్బందిపెడతాయి. రాత్రి నిద్రపై కూడా ప్రభావం పడుతుంది.
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా జరిపిన ఓ అధ్యయనం ప్రకారం, మధ్యాహ్నం 24 నిమిషాల పాటు కునుకు తీసిన వ్యోమగాముల అప్రమత్తత ఏకంగా 54 శాతం పెరిగిందట. వారి పనితీరు కూడా 34 శాతం మేర పెరిగిందట. మధ్యాహ్నం కునుకులతో క్రీడాకారుల్లో అలసిన కండరాలు కోలుకున్నాయని, రియాక్షన్ టైమ్, స్టామినా కూడా పెరిగినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. అత్యధిక ఒత్తిడి ఉన్న వాతావరణంలో పనిచేసే వైద్యులు, పైలట్లకు పవర్ నాప్స్ వల్ల మేలు కలిగింది. ఏకాగ్రత, అప్రమత్త పెరిగి, వృత్తిపరమైన పొరపాట్లు తగ్గాయి. ఇక పవర్ నాప్స్‌తో పూర్తి ప్రయోజనం పొందాలంటే మధ్యాహ్నం రెండు గంటల లోపు 10 నుంచి 20 నిమిషాల పాటు కునుకు తీయాలని చెబుతున్నారు.
ఇది కూడా చదవండి:
జుట్టు ఆరోగ్యం కోసం ఈ విటమిన్స్ తప్పనిసరి!
జుట్టుకు రోజూ నూనె రాసుకుంటారా.. ఈ తప్పులు అస్సలు చేయొద్దు
రోజూ 15 నిమిషాల పాటు జాగింగ్‌తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలిస్తే..