Bihar Elections: కుర్తా చించుకుని రోడ్డుపై పడి ఏడ్చిన ఆర్జేడీ నేత
ABN, Publish Date - Oct 19 , 2025 | 04:22 PM
మధుబన్ అసెంబ్లీ నుంచి టిక్కెట్ ఆశించిన ఆర్జేడీ నేత మదన్ షా తనకు టిక్కెట్ దక్కకపోవడంతో లాలూ నివాసం బయట కుర్తా చింపుకుని, నేలపై పడుకుని గుక్కపెట్టి ఏడుపు అందుకున్నాడు.
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly Elections) వేళ విపక్ష మహాకూటమి టిక్కెట్ల పంపకాల పంచాయతీ ఇంకా కొలిక్కి రాకుండానే అభ్యర్థుల జాబితాలు వెలువడుతుండటం గందరగోళం సృష్టిస్తోంది. దీంతో టిక్కెట్లు దక్కని నేతలు ఘొల్లుమంటున్నారు. తాజాగా పాట్నాలోని లాలూ ప్రసాద్ యాదవ్ నివాసం వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. మధుబన్ అసెంబ్లీ నుంచి టిక్కెట్ ఆశించిన ఆర్జేడీ నేత మదన్ షా (Madan Shah) తనకు టిక్కెట్ దక్కకపోవడంతో లాలూ నివాసం బయట కుర్తా చింపుకుని, నేలపై పడుకుని గుక్కపెట్టి ఏడుపు అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
టిక్కెట్లు అమ్ముకున్నారు
తాను ముడుపులు ఇవ్వకపోవడం వల్లే టిక్కెట్ నిరాకరించినట్టు షా ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులకు టిక్కెట్ల ఇచ్చే బ్రోకర్‌గా రాజ్యసభ ఎంపీ సంజయ్ యాదవ్ వ్యవహరించారంటూ ఆరోపించారు. తనకు బదులు బీజేపీ ఏజెంట్ డాక్టర్ సంతోష్ కుష్వాహకు టిక్కెట్ ఇచ్చారని, పార్టీనే నమ్ముకుని పనిచేసిన వారికి డబ్బుల్లేవనే కారణంగా టిక్కెట్లు నిరాకరిస్తున్నారని తెలిపారు.
లాలూతో ఎంతోకాలంగా పనిచేశానని, ఆయన తన గురువు అని షా చెప్పారు. మధుబని నుంచి తనకు గెలుపు తథ్యమని కమ్యూనిటీ సర్వేలో తేలడంతో తనకు టిక్కెట్ ఇస్తానని లాలూ ప్రసాద్ హామీ ఇచ్చారని తెలిపారు. 1990 నుంచి పార్టీలో పనిచేస్తున్నానని, తన రాజకీయ కెరీర్ కోసం భూమిని కూడా అమ్ముకున్నానని ఆయన వాపోయారు. తేజస్వి అహంభావి అని, ఆయన ప్రజలను కలవరని విమర్శించారు. 'టిక్కెట్లన్నీ ఇచ్చేశారు. ఇదంతా సంజయ్ యాదవ్ చేశారు. నేను చనిపోయేందుకు ఇక్కడకు వచ్చారు. లాలూ యాదవ్ నా గురువు. టిక్కెట్ ఇస్తామని చెప్పారు. కానీ బీజేపీ ఏజెంట్ సంతోష్ కుష్వాహకు ఇచ్చేశారు' అని భోరున విలపించారు. లాలూ ఇంటిముందు గందరగోళం తలెత్తడంతో సెక్యురిటీ సిబ్బంది షాను అక్కడి నుంచి తరలించారు. అయితే లూలా యాదవ్ కారును ఆయన వెంబడించడం మరో వీడియోలో కనిపించింది.
ఇవి కూడా చదవండి..
దీపాలు, కొవ్వొత్తులకు ఖర్చు దండుగ.. అఖిలేష్ వివాదాస్పద వ్యాఖ్యలు
దీపావళి వేళ.. ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Oct 19 , 2025 | 04:23 PM