Lankala Deepak Reddy: కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒక్కటే.. బీజేపీ అభ్యర్థి విమర్శలు
ABN, Publish Date - Oct 21 , 2025 | 11:41 AM
ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని దీపక్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండు అన్నదమ్ముల లాంటి వారన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఒకటే అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని లంకల దీపక్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
హైదరాబాద్, అక్టోబర్ 21: జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉపఎన్నికలో భారతీయ జనతా పార్టీ విజయం ఖాయమని ఆ పార్టీ జూబ్లీహిల్స్ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి (Lankala Deepak Reddy) ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒక్కటే అంటూ వ్యాఖ్యలు చేశారు. పదేళ్ల బీఆర్‌ఎస్, రెండేళ్ల కాంగ్రెస్... జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని విమర్శించారు. జూబ్లీహిల్స్ రోడ్లను చూస్తేనే తెలుస్తోంది వారు చేసిన అభివృద్ధి ఏంటనేది అని అన్నారు. ఎక్కడ చూసినా రోడ్లపై మురుగు నీరు పారుతోందని తెలిపారు. అభివృద్ధి కోసం బీజేపీకి ఓటు వేయాలని కోరారు. ప్రజల కోసం పోరాటం చేసే పార్టీ బీజేపీ అని స్పష్టం చేశారు. గెలిపిస్తే పోరాటం చేసైనా జూబ్లీహిల్స్‌ను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండు అన్నదమ్ముల లాంటి వారన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఒకటే అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని లంకల దీపక్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కాగా.. ఈరోజు బీజేపీ జూబ్లీహిల్స్ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేయనున్నారు బీజేపీ అభ్యర్థి. మరి కాసేపట్లో వెంకటగిరి కాలనీ నుంచి ర్యాలీ మొదలుకానుంది. ఈ ర్యాలీలో బీజేపీ అగ్ర నాయకులు పాల్గొననున్నారు. కాగా.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్లకు నేడే చివరి రోజు. మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లను రిటర్నింగ్ ఆఫీసర్ స్వీకరించనున్నారు. చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటి వరకు మొత్తం 94 మంది 127 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ రెండు సెట్ల నామినేషన్ వేశారు. బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత మూడు సెట్ల నామినేషన్ వేశారు. బీఆర్ఎస్ నుంచి పి. విష్ణు వర్ధన్ రెడ్డి డమ్మీ నామినేషన్ వేశారు. నామినేషన్లను రేపు స్క్రూటినీ చేయనున్నారు అధికారులు. ఈనెల 24 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి..
వైజాగ్కి గూగుల్ పెట్టుబడి రావడానికి కారణం శాంతి భద్రతలు: సీఎం చంద్రబాబు-
విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు.. మూడు దేశాల్లో..
Read Latest Telangana News And Telugu News
Updated Date - Oct 23 , 2025 | 09:30 AM