CM Chandrababu Naidu: వైజాగ్కి గూగుల్ పెట్టుబడి రావడానికి కారణం శాంతి భద్రతలు: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Oct 21 , 2025 | 09:22 AM
క్రిమినల్స్ అప్డేట్ అవుతున్నారని.. వారి కంటే ముందుండకపోతే కట్టడి చేయలేమని సీఎం అన్నారు. అన్ని ఇజంలను అరికట్టాలంటే సమర్థంగా ఉండాలని చెప్పారు. గూగుల్ సంస్థ పెట్టుబడులు వైజాగ్ వచ్చాయంటే దానికి కారణం నమ్మకం.. శాంతి భద్రతలపై నమ్మకంతో పెట్టుబడులు వస్తున్నాయని వివరించారు.
ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 21: సమాజంలో అశాంతి సృష్టించడానికి రాజకీయ ముసుగులో కొత్త నేరాలు చేస్తున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. మంగళగిరి APSP బెటాలియన్‍లో జరిగిన పోలీసు అమరవీరుల దినోత్సవం కార్యక్రమంలో సీఎం పాటు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాణం తాత్కాలికమని.. చేసే పని శాశ్వతమని చెప్పారు. రాజకీయ కుట్రతో ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని.. కుల మత చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియా పెద్ద ఛాలెంజ్ గా మారిందని అన్నారు. వ్యక్తిగత హాననానికి కొందరు పాల్పడుతున్నారని చెప్పారు. తాను ఎంతో మందిని చూస్తున్నానని.. ఇబ్బందులతోవారు కుమిలిపోతున్నారని అన్నారు. రాష్ట్ర పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామన్న సీఎం.. నేరస్తులు, సంఘవిద్రోహక శక్తుల పట్ల పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో అస్సలు రాజీ పడవద్దని సూచించారు. పోలీసులు ప్రభుత్వానికి, ప్రజలకు అండగా ఉండాలని.. మీకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
పోలీసులకు భీమా కల్పించి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని సీఎం చెప్పుకొచ్చారు.హోమ్ గార్డ్ లకు త్వరలో ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం విధ్వంసం చేసిందని.. తమ ప్రభుత్వం పుననిర్మాణం చేస్తోందని చెప్పారు. పోలీసులకు డీఏతో పాటు సరెండర్ లీవులు ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 6100 మంది కానిస్టేబుల్ లను నియమించామన్నారు. శాఖా పరమైన అన్ని పనులు చేస్తామని చెప్పారు. 2047 నాటికి దేశంలో ఏపీ నంబర్ 1గా ఉండాలని ఆకాంక్షించారు. ఇందుకు అన్ని రకాల భద్రత ఉంటేనే సాధ్యమని చెప్పారు. పోలీసుల త్యాగాలు, బలిదానాల స్ఫూర్తితో తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. గత ఏడాదిలో దేశ వ్యాప్తంగా 192 మంది అమరులయ్యారని చెప్పారు.
పోలీస్ శాఖకి ఎప్పుడూ గౌరవం, ప్రాధాన్యత ఉంటుందని సీఎం అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఆరుగురు రోడ్డు ప్రమాదంలో మరణించారని చెప్పారు. శాంతి, భద్రతల పట్ల తాను కఠినంగా ఉంటానని.. లేకుంటే రాష్ట్రానికి పెట్టుబడులు రావని అన్నారు. ఏలూరులో వికలాంగుల వాహనం అపహరించిన దొంగని పట్టుకోవడం, చెప్పులు లేని పిల్లలకి చెప్పులు కొనిపెట్టిన పెనమలూరు పోలీస్ వెంకటరత్నం లాంటి అంశాలను ఉదహరించి పోలీస్ గొప్పతనాన్ని ప్రస్తావించారు. సాంకేతికతను ఉపయోగించుకోవడం, గంజాయి, ఎర్ర చందనం అరికట్టడం కోసం పోలీసులు చేస్తున్న సేవలను కొనియాడారు. విజిబుల్ పోలీస్.. ఇన్విజిబుల్ పోలీసింగ్ ఉండాలని సూచించారు.
క్రిమినల్స్ అప్డేట్ అవుతున్నారని.. వారి కంటే ముందుండకపోతే కట్టడి చేయలేమని సీఎం అన్నారు. అన్ని ఇజంలను అరికట్టాలంటే సమర్థంగా ఉండాలని చెప్పారు. గూగుల్ సంస్థ పెట్టుబడులు వైజాగ్ వచ్చాయంటే దానికి కారణం నమ్మకం.. శాంతి భద్రతలపై నమ్మకంతో పెట్టుబడులు వస్తున్నాయని వివరించారు. టెక్నాలజీలో పోలీసులు ముందుండాలని.. నేరాలు చేయాలంటే నేరస్తుల గుండెల్లో రైళ్లు పరుగెత్తాలని, ఆ దిశగా పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు.
ఇవి కూడా చదవండి:
Heavy Rains in AP: ఉపరితల ఆవర్తనం.. ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
CM Chandrababu Diwali Celebrations: కుటుంబసభ్యులతో ఘనంగా దీపావళి సంబరాలు చేసుకున్న సీఎం చంద్రబాబు