Bihar Elections: పప్పు, తప్పు, అప్పు.. ఇండియా కూటమి నేతలపై యోగి సెటైర్లు
ABN, Publish Date - Nov 03 , 2025 | 03:38 PM
కాంగ్రెస్ మద్దతుతో ఆర్జేడీ పాలన సాగించినప్పుడు పేదలను పట్టించుకోలేదని, రేషన్, ప్రభుత్వ స్కీములు దక్కనీయలేదని యోగి అన్నారు. 2005కు ముందు కాంగ్రెస్, ఆర్జేడీ పాలనలో పేద ప్రజలు జబ్బు పడితే కనీస వైద్య సౌకర్యాలు లేక ప్రాణాలు కోల్పోయే వారని తెలిపారు.
పాట్నా: బిహార్ (Bihar)లో ఎన్డీయే (NDA) ప్రభుత్వం సాధించిన అభివృద్ధిపై విపక్ష 'ఇండియా' కూటమి తప్పుడు ప్రచారం చేస్తోందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) అన్నారు. మహాత్మాగాంధీ మూడు కోతుల గురించి అందరికీ తెలిసే ఉంటుందని, ఇప్పుడు ఇండియా కూటమిలో మూడు ఉన్నాయని, అవి 'అప్పు, తప్పు, పప్పు' అని విమర్శించారు. పప్పు నిజం మాట్లాడరని, తప్పు నిజం చూడలేరని, అప్పు నిజం వినరని చెప్పారు. ఈ నేతలకు ఎన్డీయే ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి కనపడదు, వినపడదు, దానిపై మాట్లాడరని సైటర్లు వేశారు. బిహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా దర్బంగాలో సోమవారంనాడు జరిగిన సభలో యోగి మాట్లాడారు.
పేదలను పట్టించుకోలేదు
కాంగ్రెస్ మద్దతుతో ఆర్జేడీ పాలన సాగించినప్పుడు పేదలను పట్టించుకోలేదని, రేషన్, ప్రభుత్వ స్కీములు దక్కనీయలేదని అన్నారు. 2005కు ముందు కాంగ్రెస్, ఆర్జేడీ పాలనలో పేద ప్రజలు జబ్బు పడితే కనీస వైద్య సౌకర్యాలు లేక ప్రాణాలు కోల్పోయే వారని తెలిపారు.
కాంగ్రెస్ విధానాల వల్లే కశ్మీర్ వివాదాస్పద ప్రాంతమైందని, ఈరోజు ప్రధాని మోదీ, అమిత్‌షాలు ఉగ్రవాదం నుంచి కశ్మీర్‌కు విముక్తి కలిగించారని చెప్పారు. హిందువులు కశ్మీర్‌ను విడిచివెళ్లడానికి కాంగ్రెస్ చేసిన పాపమే కారణమని 27 ఏళ్ల తర్వాత కశ్మీర్ వెళ్లిన ఒక నటుడు చెప్పినట్టు తాను విన్నానని, ఇప్పుడు మిథిల, బిహార్ ప్రజలు అక్కడ ప్రశాంతంగా జీవిస్తున్నారని యోగి చెప్పారు. విపక్ష పార్టీలు రాముడికి వ్యతిరేకులని, హిందూ విశ్వాసాలను గౌరవించరని తప్పుపట్టారు. రాముడు, జానకి మాత ఉనికినే కాంగ్రెస్ ప్రశ్నించిందని, దీనిపై సుప్రీంకోర్టులో అఫిడవిట్ కూడా దాఖలు చేశారని చెప్పారు.
ఆర్జేడీ హయాంలో బిహార్‌లో 70 మందికి పైగా ఊచకపోతకు గురయ్యారని, కులాలపై కులాలను ఉసిగొల్పడం, వర్తకుల్లో అభద్రతాభావం నెలకొల్పడం, తుపాకులు, పిస్తోళ్లు చూపించి శాంతి భద్రతలను ధ్వంసం చేయడం వంటివి చోటుచేసుకున్నాయని చెప్పారు. కుల ప్రాతిపదికపై ప్రజలను విడకొట్టి జాతీయ భద్రతను బలహీనపరచడమే ఈ పార్టీల లక్ష్యమని విమర్శించారు.
ఇవి కూడా చదవండి..
అడగడానికి ఇంకేమీ ప్రశ్నలు లేవా... నాయకత్వ మార్పుపై సిద్ధరామయ్య
ఉద్యోగమిప్పించమని వచ్చి.. ఎమ్మెల్యేని కుళ్లబొడిచేశాడు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Nov 03 , 2025 | 03:40 PM