MLA Attacked By Stranger: ఉద్యోగమిప్పించమని వచ్చి.. ఎమ్మెల్యేని కుళ్లబొడిచేశాడు
ABN , Publish Date - Nov 03 , 2025 | 12:56 PM
ఎమ్మెల్యే సార్‌ని కలిసి ఉద్యోగం ఇప్పించమని కోరతానని ఇంట్లోకి వెళ్లాడు. ఎమ్మెల్యేకి దూరం నుంచి నమస్కారం పెట్టి, దగ్గరకి వెళ్లాడోలేదో.. అదే పనిగా ఎమ్మెల్యే పొట్ట మీద పిడిగుద్దులు కురిపించాడు. రెప్పపాటులో అదేపనిగా ఎక్కడ దొరికితే అక్కడ శరీరాన్ని కుళ్ళబొడిచేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: బ్రతకడానికి ఉద్యోగం లేక నానా అవస్థలు పడుతున్నా.. ఎమ్మెల్యే సార్ ని కలిసి ఉద్యోగం ఇప్పించమని కోరతా..! ఇదీ ఎమ్మెల్యే ఇంటి దగ్గరున్న సెక్యూరిటీ సిబ్బందికి ఆ వ్యక్తి చెప్పిన మాట. సరేకదాని.. ఆ వ్యక్తిని ఎమ్మెల్యే ఇంట్లోకి వెళ్లనిచ్చారు సిబ్బంది. అంతే, ఎమ్మెల్యేకి దూరం నుంచి నమస్కారం పెట్టిన సదరు వ్యక్తి, దగ్గరకి వెళ్లాడోలేదో.. అదే పనిగా ఎమ్మెల్యే పొట్ట మీద పిడిగుద్దులు కురిపించాడు. క్షణం ఆలస్యం చేయకుండా అదేపనిగా ఎక్కడ దొరికితే అక్కడ శరీరాన్ని కుళ్ళబొడిచేశాడు.
ఈ విస్తుబోయే ఘటన పశ్చిమబెంగాల్ లో జరిగింది. బాధిత వ్యక్తి పశ్చిమ బెంగాల్‌కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అయిన జ్యోతిప్రియ మల్లిక్. సదరు ఎమ్మెల్యే సాక్షాత్తూ తన నివాసంలోనే దాడికి గురయ్యారు. ఆదివారం రాత్రి బిధాన్నగర్ సాల్ట్ లేక్ ప్రాంతంలోని ఎమ్మెల్యే నివాసం వద్దకు వచ్చిన యువకుడు ఇంతపని చేశాడు.

ఈ హఠాత్పరిణామంతో ఎమ్మెల్యేకి ఆ క్షణం ఏంజరుగుతోందో.. ఏమీ పాలుపోలేదు. గుద్దు గుద్దుకీ తీవ్ర గందరగోలానికి గురైన ఎమ్మెల్యే మల్లిక్.. అంతలోనే తేరుకుని బిగ్గరగా కేకలు వేశారు. ఉన్న ఫళంగా ఇంట్లో నుంచి దిక్కులు పిక్కటిల్లేలా అరుపులు వినిపించడంతో భద్రతా సిబ్బంది పరుగుపరుగున లోనికి వెళ్లారు. విషయం తెల్సుకుని దాడికి పాల్పడ్డ యువకుడ్ని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన బెంగాల్ వ్యాప్తంగానే కాదు, దేశ వ్యాప్తంగా ఉన్న రాజకీయనేతల్ని కలవరపాటుకు గురిచేస్తోంది.
పోలీస్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. దాడికి పాల్పడ్డ వ్యక్తి 30 ఏళ్ల వయస్సున్న అభిషేక్ దాస్. రాత్రి 9 గంటల సమయంలో ఎమ్మెల్యే మల్లిక్ ఇంటికి వచ్చి ఈ దాడికి పాల్పడ్డాడు. ఇతర సందర్శకులవలే నివాసం వద్దకు చేరుకున్న అతడు.. తనకు ఉద్యోగం ఇప్పించమని ఎమ్మెల్యేను కలిసేందుకు వచ్చినట్లు భద్రతా సిబ్బందితో చెప్పి దాడికి పాల్పడ్డాడని పోలీసులు చెప్పారు. బిధాన్నగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..
Infectious Diseases: భారత్‌లో పెరుగుతున్న అంటువ్యాధులు