Bihar Elections: కేంద్రంలో కొత్తగా అవమానాల మంత్రిత్వ శాఖ.. మోదీపై ప్రియాంక విసుర్లు
ABN, Publish Date - Nov 03 , 2025 | 05:46 PM
రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించేది ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కాదని ప్రియాంక విమర్శించారు. ప్రధాని, ఇతర కేంద్ర నాయకులు న్యూఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్‌తో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని అన్నారు.
సహర్సా: దేశాన్ని, బిహార్‌ను అవమానించారంటూ విపక్ష నేతలపై ప్రధానిమంత్రి నరేంద్ర మోదీ ముద్ర వేస్తున్నారంటూ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) విమర్శలు గుప్పించారు. ఇందుకోసం కేంద్రంలో కొత్తగా అవమానాల మంత్రిత్వ శాఖ (Ministry of Insults)ను ఏర్పాటు చేయాలన్నారు. సహర్సా జిల్లా సోనాబర్సా ఎన్నికల ర్యాలీలో ప్రియాంకగాంధీ సోమవారంనాడు మాట్లాడుతూ, ప్రధాని అనవసరమైన అంశాలు మాట్లాడుతున్నారని, రాష్ట్రంలో అవినీతి, ఎన్డీయే ప్రభుత్వ దుష్పరిపాలనపై ఒక్కమాట కూడా మాట్లాడరని విమర్శించారు. ఎన్నికల సమయంలో వరాలు ప్రకటించడానికి బదులు గత 20 ఏళ్లలో ఎన్డీయే సర్కార్ ఏమి చేసిందో మోదీ, అమిత్‌షా చెప్పాలని డిమాండ్ చేశారు.
నడిపేది నితీష్ కాదు
రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించేది ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కాదని ప్రియాంక విమర్శించారు. ప్రధాని, ఇతర కేంద్ర నాయకులు న్యూఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్‌తో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని అన్నారు. కీలక నిర్ణయాలన్నీ ప్రధాని, హోం మంత్రి తీసుకుంటున్నారని, సీఎంకు ఎలాంటి గౌరవం లేదని అన్నారు. కనీసం ఆయన మాటకూడా వినిపించదని, అలాంటప్పుడు ప్రజల గొంతు వినేదెవ్వరని ప్రశ్నించారు.
రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కు హామీకి బిహార్‌లోని ఎన్డీయే ప్రభుత్వం ముప్పుగా పరిణమించిందని, నిరుద్యోగం తారాస్థాయికి చేరుకోవడంతో రాష్ట్ర యవకులు బలవంతంగా రాష్ట్రం విడిచిపోతున్నారని, ఉద్యోగాలు సృష్టించే పీఎస్‌యూలను తమ కార్పొరేట్ మిత్రులకు బీజేపీ ధారాదత్తం చేస్తోందని విమర్శించారు. సమానత్వం, హక్కుల కోసం మహాత్మాగాంధీ పోరాటం చేశారని, వాటితోనే ఇప్పుడు మనం మరో పోరాటం చేయాల్సి వస్తోందని అన్నారు. అప్పుడు బ్రిటీష్ పాలన అయితే ఇప్పుడు మోదీ పాలన అని ఎద్దేవా చేసారు.
ఇవి కూడా చదవండి..
మద్యం మత్తులో బీభత్సం సృష్టించిన ట్రక్ డ్రైవర్.. 10 మంది మృతి..
ఇంకా పట్టాలెక్కని వందే భారత్ స్లీపర్ రైళ్లు.. కారణమేమంటే..?
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Nov 03 , 2025 | 05:50 PM