Share News

Vande Bharat Sleeper Trains: ఇంకా పట్టాలెక్కని వందే భారత్ స్లీపర్ రైళ్లు.. కారణమేమంటే..?

ABN , Publish Date - Nov 03 , 2025 | 03:39 PM

అత్యధిక వేగంతో ప్రయాణించే వందే భారత్ రైళ్లు.. ప్రయాణికుల మనస్సును చొరగొన్నాయి. ఆ క్రమంలో వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకు వస్తామని రైల్వే శాఖ ప్రకటించింది. కానీ వీటిని పట్టాలెక్కించడంలో తీవ్ర ఆలస్యం అవుతుంది. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ స్పందించింది.

Vande Bharat Sleeper Trains: ఇంకా పట్టాలెక్కని వందే భారత్ స్లీపర్ రైళ్లు.. కారణమేమంటే..?
Vande Bharat sleeper trains

న్యూఢిల్లీ, నవంబర్ 03: దేశంలోని వివిధ ప్రాంతాల్లో అత్యధిక వేగంతో వందే భారత్ రైళ్ల నడుస్తున్నాయి. ఈ రైళ్లకు ప్రయాణికుల నుంచి రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వందే భారత్ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తీసుకు రావాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వందే భారత్ స్లీపర్ రైళ్లను ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకు వస్తామని ఇప్పటికే రైల్వే శాఖ ప్రకటించింది కానీ సెప్టెంబర్, అక్టోబర్ మాసాలు వెళ్లిపోయాయి. నవంబర్ కూడా వచ్చేసింది. కానీ వందేభారత్ స్లీపర్ రైళ్లు మాత్రం పట్టాలు ఎక్కలేదు. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ సోమవారం స్పందించింది.


ఈ రైళ్లు పట్టాలు ఎక్కక పోవడానికి గల కారణాలను రైల్వే బోర్డు.. డైరెక్టర్ జనరల్, ది రిసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ అర్గనైజేషన్‌తోపాటు అన్ని రైల్వే జోన్ల జనరల్ మేనేజర్లకు లేఖల ద్వారా వివరించింది. ఈ రైలులోని డిజైన్లలో సంక్లిష్టతతోపాటు మరికొన్ని ఇతర కారణాల వల్ల ఈ వందేభారత్ స్లీపర్ రైళ్లు పట్టాలెక్కడంలో ఆలస్యమైందని స్పష్టం చేసింది. చాలా చోట్ల ఫర్నిషింగ్, పనితనానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయని పేర్కొంది.


బెర్తింగ్ ఏరియాలో పదునైన అంచులు, కమర్స్, విండో కర్టెన్ హ్యాండిల్స్, బెర్త్ కనెక్టర్ల మధ్య పాకెట్స్ శుభ్రపరిచడం తదితర సమస్యలు.. ఈ ఆలస్యానికి గల కారణాలని సోదాహరణగా వివరించింది. కొత్తగా డిజైన్ చేసిన ఈ రైళ్లకు ఆర్‌డీఎస్‌ఓ, సీసీఆర్ఎస్ నుంచి ఆమోదం పొందాల్సి ఉంది. అనంతరం వీటి సేవలను ప్రారంభించడానికి అనుమతి ఇవ్వాలని రైల్వే మంత్రిత్వ శాఖకు చీఫ్ కమిషనర్ రైల్వే సేఫ్టీ కోరతారు. అనంతరం ఈ రైళ్లు పట్టాలెక్కేందుకు రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.


ఈ స్లీపర్ రైళ్లో ప్రత్యేకతలు..

ఈ స్లీపర్ రైలులోని ప్రతి కోచ్ పూర్తిగా ఎయిర్ కండిషన్‌‌ ఉండేట్లు ఏర్పాటు చేశారు. విశాలమైన బెడ్‌లతోపాటు వాటిపైకి ఎక్కేందుకు మెట్లు కూడా సౌకర్య వంతంగా రూపొందించారు. ఆధునిక ఇంటీరియర్‌లను ఏర్పాటు చేశారు. అలాగే అత్యంత భద్రత ఏర్పాట్లతో ఈ కోచ్‌‌లను రూపొందించారు. వికలాంగుల కోసం ప్రత్యేక టాయిలెట్లు, ఆటోమేటిక్ ఇంటర్ కోచ్‌ తలుపులు ఏర్పాటు చేశారు.


వైఫై, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్టులు, సెన్సార్ ఆధారిత లైటింగ్‌తోపాటు డిజిటల్ ఇన్ఫర్మేషన్ ప్యానెళ్లను ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు. ఇక రైలు ప్రమాదాలను నిరోధించేందుకు స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన రక్షణ వ్యవస్థ కవచ్‌ ఏర్పాటు చేశారు. ఈ రైళ్లు గరిష్ట వేగం గంటకు 180 కిలోమీటర్లు కాగా.. సర్వీస్ వేగం గంటకు 160 కిలోమీటర్లుగా నిర్ణయించారు.


రాత్రి వేళల్లో.. అంటే 700 నుంచి 1200 కిలోమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ దూరం ప్రయాణికుల కోసం ఈ వందే భారత్ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఇప్పటికే రైల్వే శాఖ ప్రకటించింది. ఈ రైళ్లలో ప్రోటో టైప్‌ 16 కోచ్‌లు ఉంటాయి. 11 ఏసీ 3 ట్రైర్, 1 ఏసీ ఫస్ట్ క్లాస్ కోచ్ ఉంటాయి.


ఈ రైలులో దాదాపు 1,128 మంది ప్రయణికులు ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించారు. సీటింగ్, స్లీపింగ్ వసతితోపాటు ప్రయాణికులకు 823 బెర్త్‌లు ఏర్పాటు చేశారు. ఈ రైళ్లను తొలుత ఢిల్లీ నుంచి అహ్మదాబాద్, భోపాల్, పాట్నా తదితర నగరాల మధ్య నడపనున్నారు. దీని వల్ల దాదాపు 1000 కిలోమీటర్ల దూరానికి ప్రయాణ సమయం బాగా తగ్గనుందని ఇప్పటికే రైల్వే శాఖ వెల్లడించింది.

ఈ వార్తలు కూడా చదవండి..

బార్క్ నకిలీ శాస్త్రవేత్త కేసు.. నిందితుడికి ఐఎస్ఐతో సంబంధాలు

మళ్లీ పాక్ ఏదైనా మూర్ఖపు చర్యకు దిగితే.. భారత ఆర్మీ చీఫ్ వార్నింగ్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 03 , 2025 | 03:39 PM