ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Translating Sahil: ఇలాంటివి అనువదించటమంటే ఇంగ్లీష్‌ ప్రపంచాన్ని కల్లోలపరచడమే

ABN, Publish Date - Oct 27 , 2025 | 06:02 AM

తెలుగులో కథలు ఎప్పుడూ సమకాలీన వస్తువును ఎంచుకోవడంలోనూ, సామాజికాంశాలను ప్రస్తావించడంలోనూ, శిల్ప వైవిధ్యాన్ని ప్రదర్శించడంలోనూ ముందున్నాయి...

తెలుగులో కథలు ఎప్పుడూ సమకాలీన వస్తువును ఎంచుకోవడంలోనూ, సామాజికాంశాలను ప్రస్తావించడంలోనూ, శిల్ప వైవిధ్యాన్ని ప్రదర్శించడంలోనూ ముందున్నాయి. కానీ వాటిని తెలుగు నేలను దాటించి, ఇతర భాషల పాఠకులకి చేరవేయటంలో మనం అంతగా విజయం సాధించలేదు. ఈ నేపథ్యంలో అఫ్సర్‌ కథా సంకలనం ‘సాహిల్ వస్తాడు’ ఇంగ్లీష్‌లోకి ‘Sahil will come’గా అనువాదం కావటం, ఓరియంట్ బ్లాక్‌స్వాన్ లాంటి ప్రముఖ పబ్లిషింగ్ హౌస్ ద్వారా విడుదల కావటం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా పుస్తకం అనువాదకులు అల్లాడి ఉమ, యం. శ్రీధర్‌ లతో జరిపిన సంభాషణ ఇది.

అఫ్సర్‌ ‘సాహిల్‌ వస్తాడు’ పుస్తకాన్ని అనువాదానికి ఎన్నుకోడానికి ప్రేరేపించిన అంశాలేమిటి?

ఇందులోని కథలు చాలావరకు ముస్లిం జీవితాల గురించి మనకు ఉన్న మూస భావనలకు భిన్నంగా ఉన్నాయి. అవి కేవలం గ్రామీణ జీవితాలకో లేదా నగర జీవితాలకో మాత్రమే పరిమితం కాలేదు. ఒక తరం వాళ్ళకి మాత్రమే సంబంధించిన కథలు కాదు. ముందుగా నిర్ణయించుకున్న భావజాలానికి మాత్రమే ఒదిగి ఉండే కథలు కాదు. ఈ లక్షణాలు మమ్మల్ని ఆకట్టుకున్నాయి. ఉదాహరణకు ఏ మతానికి చెందిన మూఢత్వాన్నయినా వ్యతిరేకించడం ఈ పుస్తకంలో ప్రత్యేకంగా కనపడుతుంది. ఇవన్నీ కాక, 1980ల తర్వాత తెలుగు సాహిత్యాన్ని కుదిపేసిన స్త్రీవాద, దళిత/ బహుజన, మైనారిటీ, ఇతర అస్తిత్వ వాదాలు లేవనెత్తిన ఎన్నో ప్రశ్నలను ఈ కథలు స్పృశించడం మాకు నచ్చింది.

ఈ కథల్లో సాంస్కృతిక అంశాలు, కుల మత ప్రస్తావనలు చాలా ఉన్నాయి. ఆ భావాలకు ఆంగ్లంలో సమానార్థకాలు లేకపోయినా అంతర్జాతీయ పాఠకులకు అర్థమయ్యేలా అనువాదం ఎలా చెయ్యగలిగారు?

సంస్కృతి, కుల మతాలకు సంబంధించిన ప్రత్యేకతలు ఏ ఒక్క భాషకో పరిమితం కాదు. అయినా ఇలాంటి అంశాలు అనువదించటంలో కొంత సమస్య ఉంటుంది. ఇక్కడ అఫ్సర్ విషయంలో మనం గుర్తించవలసింది– తాను ముస్లిం అయినప్పటికీ ప్రధానంగా హిందూ పాఠకులను ఉద్దేశించే రాస్తుండడం. అందుకే అఫ్సర్ కూడా తన పాఠకులకులందరికీ ఆ సాంస్కృతికాంశాలు అర్థమయ్యేలా ఫుట్‌నోట్స్ వాడారు. మేము కూడా అదే పద్ధతి పాటించాం.

ఇలాంటి ప్రత్యేక అనుభవాలను చదివిన ఆంగ్ల పాఠకులకు ఎలాంటి అనుభూతి కలుగుతుందని భావిస్తున్నారు?

అఫ్సర్ లాంటి ఒక ప్రత్యేక సాంస్కృతిక నేపథ్యానికి చెందిన రచయితను ఇంగ్లీష్‌లోకి అనువాదానికి ఎంపిక చేసుకోడమంటే ఇంగ్లీష్ ప్రపంచాన్ని కల్లోలపరచడమే. ఇలాంటి బాధ్యత చాలా బరువైనదే. అంతర్జాతీయ స్థాయిలో యుద్ధ పోరాటాలు చేస్తున్న వివిధ జాతుల, మతాల మధ్య నెలకొన్న రాజకీయ వాతావరణంలోకి మన భాషలలో జరుగుతున్న చర్చలను చొప్పించడమే ఇలాంటి అనువాదాలు చేసే పని.

భారత ప్రాంతీయ భాషల నుంచి ఆంగ్లంలోకి సాహిత్యాన్ని అనువాదం చేయడం గురించి మీ దృక్పథం ఏమిటి? ఇలాంటి అనువాదాల విజయానికి మీ దృష్టిలో గీటురాయి ఏమిటి?

తెలుగు కానీ, మరే ఇతర భారతీయ భాష కానీ ‘ప్రాంతీయ’ భాష కాదు. జాతీయ, అంతర్జాతీయ అంశాలను చర్చించే ఏ భాషైనా ప్రాంతీయమెలా అవుతుంది? సాహిత్య అనువాదాలు మూల రచనల నైసర్గిక, సాంస్కృతిక, శైలీ సంబంధమైన ప్రత్యేకతలను ప్రతిబింబించాలి. అలాంటి ప్రత్యేకతలను ఇంగ్లీష్ అనువాదం ఏ మేరకు తీసుకెళ్లగలిగిందీ, పాఠకులను ఎంతమేరకు ప్రభావితం చేయగలిగింది అనేది ఆ అనువాదం సాధించిన విజయంగా భావించవచ్చు.

ఇంటర్వ్యూ : అరిపిరాల సత్యప్రసాద్

ఇవీ చదవండి:

నవంబరు 1 నుంచి బ్యాంకుల్లో వచ్చే మార్పులివే..

హైదరాబాద్‌ యాపిల్‌ ఎయిర్‌పాడ్స్‌ తయారీ హబ్‌

కర్నూలు బస్సు ప్రమాదం.. బ్లూ మీడియాపై ప్రభుత్వం సీరియస్

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 27 , 2025 | 06:02 AM